'ఇక్కడే చస్తా.. అస్థికలు కలిసేది గంగలోనే'
తిరువనంతపురం: తన జాతీయతపై మరోసారి చెలరేగుతున్న విమర్శకులకు ధీటుగా బదులిచ్చారు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ. తాను భారతీయురాలినేనని, తన ప్రియమైన వ్యక్తుల నెత్తురు కలిసిపోయిన ఈ గడ్డపైనే మరణిస్తానని, అస్తికలు ఇక్కడి గంగలోనే కలుస్తాయని ఉద్వేగభరితంగా మాట్లాడారు. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తిరువనంతపురంలో ఏర్పాటుచేసిన సభలో సోనియా మాట్లాడారు.
'అవును. నేను ఇటలీలో పుట్టానని చెప్పుకోవడానికి సిగ్గుపడను. 90 ఏళ్ల నా తల్లి అక్కడే ఉందని చెప్పడానికి సంకోచించను. ఇందిరాగాంధీ కోడలినయిన తర్వాత గడిచిన 48 ఏళ్ల నుంచి నేను ఇక్కడే ఉంటున్నా. ఇదే నా ఇల్లు. ఇదే నాదేశం. నా చావు ఇక్కడే. అస్తికలు కలిసేది ఈ నీటిలోనే' అని సోనియా గాంధీ అన్నారు. ఘనమైన తన జాతీయతను మోదీగానీ, ఆర్ఎస్ఎస్ గానీ అర్థంచేసుకోలేరని, అలా అర్థం చేసుకోవాలని తాను భావించనూలేదని వ్యాఖ్యానించారు.
ఇటలీలోని ఒక గౌరవప్రదమైన కుటుంబంలో జన్మించానని, అక్కడ తన తల్లి, ఇద్దరు సోదరీమణులు ఉన్నారన్న సోనియా.. తన దేశం భారత్ లో తనకెంతో ప్రియమైన వ్యక్తుల రక్తం కలిసిపోయిందని, తుది శ్వాస వరకు ఇక్కడే ఉంటానని స్పష్టంచేశారు. వ్యక్తులను దూషించడం, ఎప్పుడూ అబద్ధాలు చెప్పడమే వాళ్ల పని అంటూ ప్రధాని మోదీని విమర్శించారు. శుక్రవారం కేరళలో జరిగిన బీజేపీ సభలో ప్రధాని మోదీ సోనియా జాతీయతపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన సంగతి తెలిసిందే. కాగా, తమిళనాడు, కేరళల్లో శుక్ర, శనివారాల్లో పోలింగ్ జరగనుంది. ప్రచారానికి మరో మూడు రోజుల్లో గడువు ముగియనుండటంతో పార్టీలు తమ కీలక నేతలతో ప్రచారం నిర్వహిస్తున్నారు.