‘సుప్రీం’’ తీర్పు గోదావరి పాలు
ప్రమాదాల నివారణకు రాష్ట్ర, జాతీయ రహదారులకు
దూరంగా మద్యం దుకాణాలుండాలన్న సప్రీం
ఆ తీర్పునకు వక్రభాష్యం చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం
దుకాణాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర రహదారులను ఎండీఆర్గా మార్పు
మంగళవారం ఉత్తర్వులు జారీ
జిల్లాలో యథాతథంగా 340 దుకాణాలు
సాక్షి, రాజమహేంద్రవరం:
మద్యం మత్తులోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి, వాటిని నివారించేందుకు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణాలను దూరంగా ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వం తనదైన భాష్యం చెప్పింది. తమ ఆదాయానికి, మద్యం వ్యాపారులకు నష్టం జరగకుండా నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల నుంచి వెళుతున్న రాష్ట్ర రహదారులను ఆయా సంస్థల పరిధి వరకు జిల్లా ప్రధాన రోడ్లు (ఎండీఆర్)గా మారుస్తూ మంగళవారం జీవో జారీ చేసింది. ఫలితంగా జల్లాలో జాతీయ రహదారుల వెంట ఉన్న 36 దుకాణాలు మినహా మిగిలిన మద్యం దుకాణాలు యథాతథంగా కొనసాగనున్నాయి. జిల్లాలో 545 దుకాణాలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అయితే ఈసారి (2017–19 లైసెన్స్ కాలం) 534 దుకాణాలకు వేలంలో వ్యాపారులు తీసుకున్నారు. గత లైసెన్స్ కాలం (2015–17)లో 545 దుకాణాలకుగాను 499 దుకాణాలు మాత్రమే వేలంలో పాడుకున్నారు. ఇందులో 376 దుకాణాలు జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట ఉన్నాయి. మొత్తం దుకాణాల్లో ఇవి 75 శాతం మేర ఉన్నాయి. 376 దుకాణాల్లో 36 దుకాణాలు జాతీయ రహదారుల వెంట ఉండగా, మిగిలిన 340 దుకాణాలు రాష్ట్ర రహదారుల వెంట ఉన్నాయి. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో ఉండే రహదారుల నిర్వాహణ గతంలో జిల్లా పరిషత్, స్థానిక సంస్థలు చూసేవి. అయితే ఇవి భారం కావడంతో వాటిని రాష్ట్ర రహదారులుగా మారుస్తూ రోడ్లు, భవనాల శాఖకు అప్పగించారు. అయితే సుప్రీం తీర్పు వల్ల మద్యం దుకాణాల ఏర్పాటుకు ఇబ్బందులు కలుగుతుండడంతో వాటిని జిల్లా ప్రధాన రహదారులుగా మారుస్తూ జీవో జారీ చేసింది. ఫలితంగా జాతీయ రహదారుల వెంట ఉన్న 36 దుకాణాలు మినహా అన్నీ కూడా యథాతథస్థానంలో కొనసాగనున్నాయి.
.
ప్రజల ప్రాణాలపై ఏదీ చిత్తశుద్ధి..?
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో అధికశాతం మద్యం మత్తులో ఉండడం వల్లే జరుగుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు, సర్వేలు వెల్లడిస్తున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మద్యం తాగినవారితోపాటు అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. వీటి నివారణకు దేశ అత్యున్నత న్యాయస్థానం పటిష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఆదాయమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం వాటికి వక్రభాష్యం చెప్పడం ప్రజల ప్రాణాలపై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. అంతేకాకుండా మండలం పరిధిగా ఎక్కడైనా మద్యం దుకాణం ఏర్పాటు చేసుకోవచ్చన్న నిబంధనతో జనావాసాలు, జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మహిళలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఓ పక్క వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకుంటామంటూనే మరోపక్క ప్రభుత్వం తమ పని తాము చేసుకుపోతోంది.
.
చేతులు మారిన కోట్ల రూపాయలు...
ఏడాదికి ఒకసారి ఇచ్చే బార్లైసెన్స్ను ఐదేళ్లకు పెంచుతూ ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.382 కోట్ల రూపాయల ముడుపులు ప్రభుత్వ పెద్దలకు అందినట్లు బలమైన ఆరోపణలున్నాయి. తాజాగా రాష్ట్ర రహదారుల వెంట ఉన్న మద్యం దుకాణదారుల నుంచి వాటిని ఎండీఆర్గా మర్పు చేసేందుకు కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. వ్యాపారం సాగాలంటే రోడ్లకు దగ్గరలోనే దుకాణాలు ఉండాలి కాబట్టి అడిగిన మేరకు ముడపులు ఇవ్వాల్సి వచ్చిందని రాజమహేంద్రవరానికి చెందిన ఓ వ్యాపారి వాపోయారు.