Winter Tips
-
చంపుతున్న చలి.. గుండె జబ్బులున్నవారు వాకింగ్ చేస్తున్నారా!
తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దినదినం రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. వణికించే చలి కారణంగా వ్యాధులు చుట్టుముట్టే అవకాశముంది. ప్రధానంగా ఉబ్బసం, ఆయాసం, గుండె జబ్బులున్నవారికి ప్రమాదం పొంచి ఉంది. ఉదయం, రాత్రివేళలో బయటకు వెళ్తే చర్మం పొడి బారి బిగుసుగా మారనుంది. కాళ్ల మడిమలు, పాదాలు పగులుతాయి. చలికాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి సమస్యల నుంచి అధిగవిుంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. చర్మ సంరక్షణ ఇలా.. చలికాలంలో శరీరానికి మాయిశ్చరైజర్లు తప్పనిసరి. క్రీమ్ టేస్ట్ మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. చలికి పెదాలు పగిలి రక్తం కారకుండా వ్యాజిలిన్, లిప్‌బామ్ రాసుకోవాలి. చర్మం తెల్లగా పొడిబారకుండా ఉండేందుకు గ్లిజరిన్ సబ్బులు వాడాలి. స్నానానికి ముందు ఆలీవ్ ఆయిల్, కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకొని గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఖర్చు తగ్గించుకోవాలనుకునేవారు ఇంట్లోనే అందుబాటులో ఉండే శనగపిండితో స్నానం చేయాలి. వివిధ పనుల కోసం బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా ఉన్ని దస్తులు ధరించాలి. బైక్‌పై వెళ్లేవారు మంకీ క్యాప్, కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌస్లు వాడాలి. ఎండకు వెళ్లాలనుకుంటే సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. రాత్రివేళ నిద్రించే ముందు మోచేతులు, మోకాళ్లు పగలకుండా నూనె, లేపనం రాసుకుంటే మంచిది. థైరాయిడ్ తరహా సమస్యలున్నవారు పైజాగ్రత్తలతో పాటు ఇంట్లో సాక్స్‌లు ధరించడం మేలు. దగ్గు, జలుబు, ఫ్లూ, జ్వరం ఉంటే ఇంటి వ ద్దనే విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించాలి. మధుమేహం, గుండెజబ్బులున్నవారు శరీరంపై గీతలు పడకుండా జాగ్రత్తపడాలి. చదవండి: Winter Care Tips: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తిన్నారంటే.. పాదాలు పగిలితే.. చలికాలంలో చాలామందికి పాదాలు పగులుతాయి. ఉప్పునీరు కలిసిన గోరు వెచ్చని నీటిలో పది నిమిషాల పాటు పాదాలు ఉంచాలి. ఆ తర్వాత సబ్బుతో శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతో తుడవాలి. పగిలిన చోట మాయిశ్చరైజర్ రాయాలి. విటమిన్–ఈ క్రీమ్ రాస్తే మంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సలహాలు పాటించాలి. అస్తమా ఉంటే.. చలికాలంలో అస్తమా ఉన్నవారు నిత్యం వాడే మందులను అందుబాటులో ఉంచుకోవాలి. దుమ్ము, ధూళి పనులకు దూరంగా ఉండాలి. గాలికి తిరగవద్దు. డాక్టర్ సలహా మేరకు మందులు, ఇన్హేలర్, నెబ్యులైజర్ లాంటివి వాడాలి. గుండె జబ్బులుంటే.. చలికాలంలో గుండెజబ్బులున్న వారు, గుండె ఆపరేషన్ చేయించుకున్నవారు వాకింగ్ చేయవద్దు. చలిలో ఎక్కువగా తిరిగితే రక్త నాళాలు సంకోచించి గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. బీపీ, షుగర్ ఉన్న వారు కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. ఆహారంలో మార్పులు అవసరం చలికాలంలో సమతుల ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా జామ, దానిమ్మ, బొప్పాయి, సంత్ర, అరటిపండ్లు ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ ‘సీ’ ఉన్న పండ్లు జలుబు, ఫ్లూ వంటి జబ్బుల నుంచి కాపాడుతాయి. మరీ పచ్చిగా ఉన్నవి, బాగా పండినవి కాకుండా మధ్యస్తంగా ఉన్న పండ్లు ఎంపిక చేసుకోవాలి. చలికాలంలో సహజంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు, వంటివి త్వరగా వస్తాయి. ఆహారం అరుగుదల తక్కువగా ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలి. మనిషి శరీరానికి యాంటీ యాసిడ్స్ ఎంతో అవసరం. గుడ్లు, చేపల్లో ఇవి అధికంగా లభిస్తాయి. జింక్ ఉండే బాదం వంటి ఆహారాన్ని అధికంగా తీసుకోవాలి. రోగకారక క్రిములతో పోరాడే పెరుగును తీసుకోవడం ఉత్తమం. వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. మార్కెట్లో లభిస్తున్న నల్లద్రాక్ష చర్మ సంరక్షణకు దోహదం చేస్తుంది. వీటిలో విటమిన్ ఏ, బీ1, బీ2 ఉంటాయి. పిల్లల్లో కడుపునొప్పికి నివారణిగా పని చేస్తాయి. జాగ్రత్తలు తప్పనిసరి చలికాలంలో శరీరానికి వేడిచేసే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అల్కహాలి క్ పానీయాలను స్వీకరించొద్దు. పొడి దుస్తులను ధరించాలి. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా చూడాలి. సూర్యోదయం తర్వాతే జాగింగ్, వ్యా యామం చేయాలి. ఏదైన ఆరోగ్య సమ స్య ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. – రత్నాకర్, జనరల్ ఫిజీషియన్, నిర్మల్ జిల్లా ఆస్పత్రి -
Winter: చలికాలంలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! చల్లారిన ఆహారం తింటే..
Winter Skin Care Tips In Telugu: చలికాలంలో ఇంచుమించు అందరినీ వేధించే సమస్యలలో ప్రధానమైనది చర్మం పొడిగా మారడం. చలి ముదిరేకొద్దీ ఇది సహజమైనదే అయినా, తెలిసీ తెలియక మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల చర్మం మరింత త్వరగా పొడిబారిపోతుంది. అవేమిటో తెలుసుకుని, వాటికి దూరంగా ఉందాం. వేడి నీటి స్నానం సాధారణంగా చలికాలంలో అందరూ వేడినీటి స్నానం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. నిజానికి బడలికగా ఉన్నప్పుడు వేడి వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర అలసట తొలగిపోతుందనేది చాలామందికి అనుభవమే. అయితే స్నానానికి ఉపయోగించే నీరు తగుమోతాదు వేడిలో మాత్రమే ఉండాలి. బాగా వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం మరింత దెబ్బతింటుంది. వేడి నీరు చర్మంలో ఉన్న ఆయిల్‌ను, తేమను తొలగిస్తుంది. అందుకే వేడి నీళ్లతో కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. చర్మానికి అది మంచిది కాదు చాలా మంది మేకప్ వేసుకొని అలాగే నిద్రపోతారు. ఇది చర్మానికి మంచిది కాదు. నిద్రకు ఉపక్రమించే ముందు ముఖాన్ని కడుక్కుని, మాయిశ్చరైజర్ రాసుకొని పడుకోవాలి. రాత్రి చర్మ సంరక్షణ దినచర్య చాలా ముఖ్యం ఇది మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేస్తుంది. చల్లబడిన ఆహారం తింటే చల్లబడిన ఆహారం తీసుకోవడం చలికాంలో ఆహారం తొందరగా చల్లారి పోతుంది. అలా చల్లారిపోయిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల తొందరగా అరగదు. ఫలితంగా చర్మం డ్రైగా అవుతుంది. అందువల్ల వీలయినంత వరకు వేడిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. నీరు ఎక్కువగా తాగితేనే తక్కువ నీరు తాగడం చలికాలంలో దాహం ఎక్కువగా వేయదు. అందువల్ల చాలామంది మంచినీళ్లు తాగరు. అయితే దాహం వేసినా, వేయకపోయినా అరగంటకోసారి రెండు మూడు గుక్కలు నీటితో గొంతు తడుపుకుంటూ ఉండటం మంచి అలవాటు. శరీరంలో తగినంత నీరు ఉండటం వల్ల చర్మం త్వరగా పొడిబారిపోకుండా ఉంటుంది. చదవండి: Jeelakarra Health Benefits: జీలకర్ర వేసి కాచిన గోరువెచ్చని నీటిని రోజూ పరగడుపున తాగితే జరిగేది ఇదే! ఈ విషయాలు తెలిస్తే.. Athiya Shetty: బొప్పాయి గుజ్జు, రోజ్ వాటర్.. పార్టీకి వెళ్లే ముందు ఇంట్లోనే ఇలా! నా బ్యూటీ సీక్రెట్ Diabetes: షుగర్ పేషెంట్లకు ఆరోగ్య ఫలం!.. ఒక్క గ్లాసు జ్యూస్ తాగితే 15 నిమిషాల్లో.. -
చలికాలంలో ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా..!
winter tips: డిసెంబర్‌లోకి అడుగుపెట్టాం. వాతావరణం మరికొన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలను తగ్గించుకుని మనల్ని పరీక్ష పెట్టే స్థాయులను పెంచుకుంటుంది. వార్ధక్యంలో ఉన్న వాళ్లను హైపోథెర్మియా కండిషన్‌కు నెట్టేస్తుంటుంది కూడా. హైపోథెర్మియా అంటే వాతావరణంలో చల్లదనానికి– మన దేహం ఉత్పత్తి చేసుకునే ఉష్ణోగ్రతకు మధ్య భారీ తేడా రావడం. బయటి ఉష్ణోగ్రతలు పడిపోయిన స్థాయికి దీటుగా దేహం ఉష్ణోగ్రతలను పెంచుకోలేకపోవడం వల్ల దేహం చల్లబడడం. ఇది మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించాల్సిన అత్యంత ప్రమాదకర స్థితి. వార్ధక్యానికి పరీక్ష పెట్టే ఈ కాలంలో హైపోథెర్మియాతోపాటు కీళ్ల నొప్పులు కూడా ఎక్కువవుతాయి. బారోమెట్రిక్ ప్రెషర్లో వచ్చే మార్పుల వల్ల కీళ్ల దగ్గర ఉండే టిష్యూలు ఉబ్బుతాయి. దాంతో కీళ్ల వాపు, నొప్పి కలుగుతుంది. వీటి నుంచి తమను తాము కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను చెబుతున్నారు గుర్గావ్లోని మేదాంత– ద మెడిసిటీ వైద్యసంస్థలో ఇంటర్నల్ మెడిసిన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ సుశీలా కటారియా. ►నడక, తేలికపాటి యోగాసనాలను రోజూ ప్రాక్టీస్ చేయాలి. ఈ కాలంలో వాతావరణం ఉదయం, సాయంత్రం రెండు వేళల్లోనూ వాకింగ్‌కి పెద్దగా సహకరించకపోవచ్చు. అందుకే వాకింగ్‌కి పదకొండు గంటల సమయం మంచిది. అప్పటికి చలి తీవ్రత తగ్గుముఖం పట్టి సూర్యుడు నడినెత్తి మీదకు వస్తుంటాడు. మధ్యాహ్నం తర్వాత మాత్రమే సాధ్యమయ్యే వాళ్లు కూడా నాలుగు గంటల లోపు వాకింగ్ పూర్తి చేసుకోవాలి. కీళ్లు నొప్పిగా ఉన్నాయని నడకను వాయిదా వేస్తే నొప్పులు తగ్గవు. సరికదా క్రమేపీ కీళ్లను కదిలించడం కూడా కష్టమవుతుంది. కాబట్టి నడిచి తీరాల్సిందే. నడకతో నొప్పులు మాయమవుతాయని మర్చిపోకూడదు. అరగంట నుంచి గంట సేపు సూర్య కిరణాలు దేహాన్ని తాకేటట్లు చూసుకుంటే పైన చెప్పుకున్న సమస్యలను దూరంగా ఉంచవచ్చు. ►దేహంలో నీటి శాతం తగ్గకుండా ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఒక పెద్ద కప్పు వెజిటబుల్ సూప్, ఈ సీజన్లో దొరికే కమలాల వంటి తాజా పళ్ల రసం ఒక పెద్ద గ్లాసు తీసుకోవాలి. అలాగే రోజుకు ఒకసారి మిరియాల టీ లేదా తులసి టీ తాగితే జలుబు, దగ్గు దరి చేరవు. ►సీనియర్ సిటిజెన్ కూడా చంటిబిడ్డలతో సమానమే. కాబట్టి పెద్దవాళ్లు ఉన్న ఇంట్లో రూమ్ హీటర్ కూడా ఉంటే మంచిది. ఈ కాలంలో చర్మం పగుళ్లుబారడం మామూలు వాళ్లకంటే అరవై ఐదు దాటిన వాళ్లలో ఎక్కువ. కాబట్టి పాదాలకు సాక్స్ ధరించడం శ్రేయస్కరం. వారానికి ఒకటి –రెండు సార్లు గోరువెచ్చటి ఆయిల్‌తో దేహానికి మసాజ్ చేసుకోవాలి. ►ధూమపానం, మద్యపానం అలవాటున్న వాళ్లు ఈ సీజన్లో అసంకల్పితంగానే మోతాదు పెంచేస్తుంటారు. నిజానికి ఈ సీజన్లో వాటిని పూర్తిగా మానేయాలి లేదా తగ్గించాలి. ►కాలేయ సమస్యలున్న వాళ్లు ఈ కాలంలో మాంసం వంటి వాటికి బదులు తేలికగా జీర్ణమయ్యే చేపలను తీసుకోవడం మంచిది. రోజూ ఆకుకూరలు, కూరగాయలు, ఉడికించిన గుడ్డు ఒకటి లేదా రెండు తీసుకోవాలి. ►దేహం చురుగ్గా ఉండడానికి తీసుకోవాల్సిన పై జాగ్రత్తలోపాటు మెదడు చురుగ్గా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. అందుకే సుడోకు, పదశోధనలు పరిష్కరించడంతోపాటు చెస్, అష్టాచెమ్మా వంటి ఏదో ఒక ఆటలతో కాలక్షేపం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చలికాలానికి భయపడాల్సిన పని లేదు, ఆ చలికే సవాల్‌గా మారవచ్చు. చదవండి: ఇండియన్ షకీరా! -
అందానికి ఐదు చిట్కాలు..
చలికాలం మొదలైందంటే చాలు.. చర్మం పొడిబారిపోయి గరుకుగా తయారవుతుంది. చర్మం బిరుసెక్కి అందవిహీనంగా మారుతుంది. శరీరంపై ఏ చిన్న గీతపడినా తెల్లటి చారలు ఏర్పడతాయి. ముఖం, పెదాలు కూడా కళావిహీనంగా మారుతాయి. అయితే మనం తీసుకునే చిన్నపాటి జాగ్రత్తలతో శీతాకాలంలోనూ మెరిసిపోవచ్చు. కాస్త సమయం కేటాయిస్తే పొడిబారిన చర్మం నుంచి తప్పించుకోవచ్చు. గాఢత ఎక్కువగా ఉండే కెమికల్ ప్రోడక్ట్‌ల జోలికి పోకుండా సహజ సిద్ధమైన ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే కోమలమైన చర్మం మీ సొంతమవుతుంది. ► శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉండటం కోసం ఎప్పుడూ నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది చర్మం తేమను కోల్పోకుండా ఉండటానికి సహాయపడుతుంది. వీలైతే నిమ్మ, దోసకాయ, పుచ్చకాయ వంటి పండ్లరసాలను తాగితే మరింత మంచిది. ► చర్మం పొడిబారకుండా తేమతో కూడిన ఆయిల్స్‌ను అప్లై చేయాలి. స్నానానికి వెళ్లే ముందు ఆయుర్వేద ఆయిల్‌ను ఒంటికి పట్టించుకుని ఆ తర్వాత స్నానానికి వెళ్లాలి. ► బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. తాజా కొబ్బరి, బాదంపప్పు, అవకాడో, ఆలివ్ ఆయిల్, నెయ్యి, చేపలు వంటి సంతృప్తికర కొవ్వును అందించే ఆహారాన్ని రోజువారీ డైట్లో చేర్చుకోవాలి. ఇవి మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా కనిపించేందుకు దోహదం చేస్తాయి. ► బద్ధకం వదిలి కాసేపు శరీరానికి శ్రమ కల్పించాలి. యోగా, ఎక్సర్సైజ్ ఏదైనా సరే కాసేపు వ్యాయామాన్ని చేయండి. బయట చలిగా ఉంది.. చేయలేమని చేతులెత్తేయకుండా కనీసం ధ్యానమైనా చేయాలి. ఇది మీ ఆందోళనల నుంచి బయటకు తెచ్చి ప్రశాంతతను చేకూరుస్తుంది. ► గ్లిజరిన్‌లో నిమ్మరసం కలిపి గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని ప్రతిరోజు ఓ మాయిశ్చరైజర్‌లా అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ముఖానికి అప్లై చేసిన గంట తర్వాత కడిగేసుకుంటే చర్మం సున్నితంగా, కాంతివంతంగా నిగనిగలాడుతుంది. -
దూర ప్రయాణాలకు వెళితే...
వింటర్ టిప్స్ ప్రయాణాలంటే అమితమైన ఇష్టం ఉన్నవారు కాలాలను పట్టించుకోరు. కానీ ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చూపితే సందర్శనీయ స్థలాలలో ఆనందించలేరు. మిగతా కాలాలతో పోల్చితే చలికాలంలో ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. మీ విహారం అత్యద్భుతంగా సాగాలంటే... మందులు: ఎన్ని రోజుల ప్రయాణమో ముందుగానే నిర్ణయించుకుంటారు కాబట్టి మీకున్న ఆరోగ్య సమస్యలు డాక్టర్ చెకప్‌ల ద్వారా నిర్ధారించుకోవాలి. అలాగే వైద్యులు సూచించిన మందులను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. చలికాలంలో వచ్చే సమస్యలకు సాధారణ మందులతోబాటు స్థానిక ఫార్మసీ నిపుణుల సాయంతో కొన్ని రిలీఫ్, రిలాక్స్ కలిగించే ఔషధాలను తీసుకెళ్లడం ఉత్తమం. పరీక్షించుకోవడం: ప్రయాణంలో ఎవరికి వారు ఆరోగ్య పరీక్షలు జరుపుకునే బీపీ, షుగర్.. వంటి టెస్టింగ్ పరికరాలను వెంట ఉంచుకోవాలి. దూర ప్రయాణంలో పరీక్షించుకొని, సమస్యగా ఉంటే మీ డాక్టర్‌కు ఫోన్ చేసి, సలహా తీసుకోవచ్చు.