winter tips: డిసెంబర్‌లోకి అడుగుపెట్టాం. వాతావరణం మరికొన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలను తగ్గించుకుని మనల్ని పరీక్ష పెట్టే స్థాయులను పెంచుకుంటుంది. వార్ధక్యంలో ఉన్న వాళ్లను హైపోథెర్మియా కండిషన్‌కు నెట్టేస్తుంటుంది కూడా. హైపోథెర్మియా అంటే వాతావరణంలో చల్లదనానికి– మన దేహం ఉత్పత్తి చేసుకునే ఉష్ణోగ్రతకు మధ్య భారీ తేడా రావడం. బయటి ఉష్ణోగ్రతలు పడిపోయిన స్థాయికి దీటుగా దేహం ఉష్ణోగ్రతలను పెంచుకోలేకపోవడం వల్ల దేహం చల్లబడడం.
ఇది మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించాల్సిన అత్యంత ప్రమాదకర స్థితి. వార్ధక్యానికి పరీక్ష పెట్టే ఈ కాలంలో హైపోథెర్మియాతోపాటు కీళ్ల నొప్పులు కూడా ఎక్కువవుతాయి. బారోమెట్రిక్ ప్రెషర్‌లో వచ్చే మార్పుల వల్ల కీళ్ల దగ్గర ఉండే టిష్యూలు ఉబ్బుతాయి. దాంతో కీళ్ల వాపు, నొప్పి కలుగుతుంది. వీటి నుంచి తమను తాము కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను చెబుతున్నారు గుర్‌గావ్‌లోని మేదాంత– ద మెడిసిటీ వైద్యసంస్థలో ఇంటర్నల్ మెడిసిన్ విభాగం డైరెక్టర్ డాక్టర్ సుశీలా కటారియా.
►నడక, తేలికపాటి యోగాసనాలను రోజూ ప్రాక్టీస్ చేయాలి. ఈ కాలంలో వాతావరణం ఉదయం, సాయంత్రం రెండు వేళల్లోనూ వాకింగ్‌కి పెద్దగా సహకరించకపోవచ్చు. అందుకే వాకింగ్‌కి పదకొండు గంటల సమయం మంచిది. అప్పటికి చలి తీవ్రత తగ్గుముఖం పట్టి సూర్యుడు నడినెత్తి మీదకు వస్తుంటాడు. మధ్యాహ్నం తర్వాత మాత్రమే సాధ్యమయ్యే వాళ్లు కూడా నాలుగు గంటల లోపు వాకింగ్ పూర్తి చేసుకోవాలి.
కీళ్లు నొప్పిగా ఉన్నాయని నడకను వాయిదా వేస్తే నొప్పులు తగ్గవు. సరికదా క్రమేపీ కీళ్లను కదిలించడం కూడా కష్టమవుతుంది. కాబట్టి నడిచి తీరాల్సిందే. నడకతో నొప్పులు మాయమవుతాయని మర్చిపోకూడదు. అరగంట నుంచి గంట సేపు సూర్య కిరణాలు దేహాన్ని తాకేటట్లు చూసుకుంటే పైన చెప్పుకున్న సమస్యలను దూరంగా ఉంచవచ్చు.
►దేహంలో నీటి శాతం తగ్గకుండా ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ ఒక పెద్ద కప్పు వెజిటబుల్ సూప్, ఈ సీజన్‌లో దొరికే కమలాల వంటి తాజా పళ్ల రసం ఒక పెద్ద గ్లాసు తీసుకోవాలి. అలాగే రోజుకు ఒకసారి మిరియాల టీ లేదా తులసి టీ తాగితే జలుబు, దగ్గు దరి చేరవు.
►సీనియర్ సిటిజెన్ కూడా చంటిబిడ్డలతో సమానమే. కాబట్టి పెద్దవాళ్లు ఉన్న ఇంట్లో రూమ్ హీటర్ కూడా ఉంటే మంచిది. ఈ కాలంలో చర్మం పగుళ్లుబారడం మామూలు వాళ్లకంటే అరవై ఐదు దాటిన వాళ్లలో ఎక్కువ. కాబట్టి పాదాలకు సాక్స్ ధరించడం శ్రేయస్కరం. వారానికి ఒకటి –రెండు సార్లు గోరువెచ్చటి ఆయిల్‌తో దేహానికి మసాజ్ చేసుకోవాలి.
►ధూమపానం, మద్యపానం అలవాటున్న వాళ్లు ఈ సీజన్‌లో అసంకల్పితంగానే మోతాదు పెంచేస్తుంటారు. నిజానికి ఈ సీజన్‌లో వాటిని పూర్తిగా మానేయాలి లేదా తగ్గించాలి.
►కాలేయ సమస్యలున్న వాళ్లు ఈ కాలంలో మాంసం వంటి వాటికి బదులు తేలికగా జీర్ణమయ్యే చేపలను తీసుకోవడం మంచిది. రోజూ ఆకుకూరలు, కూరగాయలు, ఉడికించిన గుడ్డు ఒకటి లేదా రెండు తీసుకోవాలి.
►దేహం చురుగ్గా ఉండడానికి తీసుకోవాల్సిన పై జాగ్రత్తలోపాటు మెదడు చురుగ్గా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. అందుకే సుడోకు, పదశోధనలు పరిష్కరించడంతోపాటు చెస్, అష్టాచెమ్మా వంటి ఏదో ఒక ఆటలతో కాలక్షేపం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చలికాలానికి భయపడాల్సిన పని లేదు, ఆ చలికే సవాల్‌గా మారవచ్చు.
చదవండి: ఇండియన్ షకీరా!
Comments
Please login to add a commentAdd a comment