అక్రమంగా కేసు బనాయించారు
అనంతపురం సెంట్రల్: వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా సభ్యుడు, న్యాయవాది రామకృష్ణానాయక్‌పై కదిరి టౌన్ పోలీసులు అక్రమంగా కేసు బనాయించారంటూ జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌కు ఆ పార్టీ లీగల్‌సెల్ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు ఎస్పీని గురువారం ఆయన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా పార్టీ లీగల్‌సెల్ జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ... రామకృష్ణానాయక్ చెల్లెలు లలితాబాయిపై అదే గ్రామానికి చెందిన చలపతి, మరికొందరు ఈనెల 19న దాడి చేశారన్నారు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో, నిందితుడు కూడా కౌంటర్ కేసు పెడుతూ రామకృష్ణానాయక్‌ను మొదటి ముద్దాయిగా చేర్చారని వివరించారు.
అయితే ఘటన జరిగిన రోజు రామకృష్ణానాయక్ అక్కడ లేరని, కదిరికి చెందిన టీడీపీ ముఖ్య నేత ప్రోద్భలంతో తప్పుడు కేసు బనాయించారని ఆరోపించారు. ఇందుకు బాధ్యులనై టౌన్ ఎస్ఐలు రాజేష్, మధుసూదన్‌రెడ్డి, డీఎస్పీ వెంకటరమణపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ లీగల్‌సెల్ జిల్లా నేత ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమణయాదవ్, రామకృష్ణానాయక్, ఆదినారాయణ, అదిక్ అహ్మద్, భాస్కర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.