woman alive
-
చనిపోయిందని శ్మశానానికి.. ఆఖరు క్షణంలో ట్విస్ట్..
రాయ్పూర్: ఓ వృద్ధురాలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. కోవిడ్ టెస్టు చేశారు. నెగటీవ్ రీపోర్టు వచ్చింది. కానీ ఈసీజీలో నిల్ అని రావడంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు గుర్తించారు. అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తీసుకెళ్లాక అరుదైన ఘటన చోటుచేసుకుంది. అదేంటో తెలుసుకునేందుకు వివరాల్లోకి వెళితే.. చత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్కు చెందిన 77 ఏళ్ల లక్ష్మీబాయ్ అనే వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. కొన్ని రోజుల నుంచి ఇంట్లోనే చికిత్స అందిస్తుండగా తాజాగా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. భీంరావ్ అంబేద్కర్ ఆసుపత్రిలో చేర్చారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం కోవిడ్ టెస్టులు నిర్వహించగా నెగటీవ్ రిపోర్టు వచ్చింది. అనంతరం ఈసీజీలో మాత్రం ‘నిల్’ అని రిపోర్టు వచ్చింది. దీన్ని పరిశీలించిన వైద్యులు.. లక్ష్మీబాయి చనిపోయినట్లు ధృవీకరించారు. లక్ష్మీబాయి మనవరాలు నిధి కూడా వైద్యరంగంలోనే పనిచేస్తున్నారు. తన బామ్మ మెడికల్ రిపోర్టులు ఆమె కూడా పరిశీలించి చనిపోయినట్టు నిర్ధారించుకుంది. అనంతరం అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గోకుల్ నగర్ శ్మశానవాటికకు తీసుకెళ్లారు. కానీ అప్పటికీ మృతదేహం చల్లబడలేదు. దీంతో నిధికి అనుమానం వచ్చింది. ఒక వైద్యుడిని అక్కడికి పిలిపించి పరీక్షించగా అసలు విషయం బయటపడింది. లక్ష్మీబాయి అప్పటికి ఇంకా మరణించలేదని, పల్స్ మీటర్లో ఆక్సిజన్ స్థాయి 85గా ఉందని డాక్టర్ గుర్తించారు. ఆమెకు అత్యవసర విభాగంలో చికిత్స అందించాలని పేర్కొన్నారు. దీంతో వెంటనే లక్ష్మీబాయిని హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. మార్గం మధ్యలో అంబులెన్స్లోనే ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ విషయంపై నిధి అంబేడ్కర్ ఆసుపత్రి వైద్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఈసీజీ సక్రమంగా తీయకపోవడంతో తన బామ్మ చనిపోయిందని వాపోయింది. కొన్ని గంటల ముందే ఆసుపత్రికి తీసుకొస్తే బతికేదని, తన బామ్మ చావుకు డాక్టర్లే కారణమని ఆరోపించింది. అయితే ఇందులో తమ నిర్లక్ష్యం ఏమీ లేదని తమ ఆసుపత్రిలో మొదటిసారి ఇలా జరిగిందని ఆసుపత్రి సిబ్బంది చెబుతున్నారు. చదవండి: హోం ఐసోలేషన్.. కేంద్రం కొత్త గైడ్లైన్స్ ఎనిమిది నెలల గర్భిణిని కాల్చి చంపిన భర్త -
చనిపోయిందనుకుంటే...లేచి కూర్చొంది
ఆత్మహత్యాయత్నం చేసిన యువతి చనిపోయిందని ఆటోట్రాలీలోకి ఎక్కించిన పోలీసులు అంతలోనే లేచి కూర్చున్న వైనం దుండిగల్: చనిపోయిందనుకొని యువతిని దుప్పటిలో చుట్టి, ఆటో ట్రాలీలో పడుకోబెట్టారు... అంతలోనే ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంది. దీంతో పోలీసులు, స్థానికులు అవాక్కయ్యారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు... పశ్చిమగోదావరి జిల్లా ఇప్పలపాడు గ్రామానికి చెందిన సత్తిబాబు కుమార్తె పడాల కనకదుర్గ (22)కు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో నాలుగేళ్ల క్రితం పెళ్లింది. ఏడాది గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో కనక దుర్గను భర్త వదిలేశాడు. దీంతో ఆమె తల్లిదండ్రులకు భారం కాకూడదని మూడేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చింది. గండి మైసమ్మ ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని ఉంటూ టైలరింగ్ దుకాణంలో పని చేస్తోంది. భర్త దూరం కావడం.. ఒంటరితనం భరించలేక గురువారం ఉదయం 10 గంటలకు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. అయితే, రాత్రైనా కనకదుర్గ గది నుంచి బయటకు రాకపోవడం, గది నుంచి పెద్దగా టీవీ శబ్ధం వస్తుండటంతో స్థానికులు తలుపులు తట్టారు. ఉలుకు.. పలుకు లేదు. అదే రోజు రాత్రి పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేయగా వారు కూడా స్పందించలేదు. దీంతో శుక్రవారం ఉదయం తలుపులు బద్దలకొట్టి చూడగా కనకదుర్గ నిర్జీవంగా పడి ఉంది. చనిపోయిందని భావించి గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఆటోట్రాలీలో కనకదుర్గను పడుకోబెట్టారు. ఇంతలో ఒక్కసారిగా లేచి కూర్చోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ఆమెను సూరారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. జీవితంపై విరక్తిలో నిద్రమాత్రలు మింగానని పోలీసులకు చెప్పిన కనకదుర్గ పూర్తి వివరాలను వెల్లడించేందుకు మాత్రం నిరాకరించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.