చికిత్స పొందుతున్న కనకదుర్గ
ఆత్మహత్యాయత్నం చేసిన యువతి
చనిపోయిందని ఆటోట్రాలీలోకి
ఎక్కించిన పోలీసులు
అంతలోనే లేచి కూర్చున్న వైనం
దుండిగల్: చనిపోయిందనుకొని యువతిని దుప్పటిలో చుట్టి, ఆటో ట్రాలీలో పడుకోబెట్టారు... అంతలోనే ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుంది. దీంతో పోలీసులు, స్థానికులు అవాక్కయ్యారు. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు... పశ్చిమగోదావరి జిల్లా ఇప్పలపాడు గ్రామానికి చెందిన సత్తిబాబు కుమార్తె పడాల కనకదుర్గ (22)కు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో నాలుగేళ్ల క్రితం పెళ్లింది. ఏడాది గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో కనక దుర్గను భర్త వదిలేశాడు.
దీంతో ఆమె తల్లిదండ్రులకు భారం కాకూడదని మూడేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వలస వచ్చింది. గండి మైసమ్మ ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని ఉంటూ టైలరింగ్ దుకాణంలో పని చేస్తోంది. భర్త దూరం కావడం.. ఒంటరితనం భరించలేక గురువారం ఉదయం 10 గంటలకు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించింది. అయితే, రాత్రైనా కనకదుర్గ గది నుంచి బయటకు రాకపోవడం, గది నుంచి పెద్దగా టీవీ శబ్ధం వస్తుండటంతో స్థానికులు తలుపులు తట్టారు.
ఉలుకు.. పలుకు లేదు. అదే రోజు రాత్రి పోలీసులకు సమాచారం అందించగా.. వారు వచ్చి యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేయగా వారు కూడా స్పందించలేదు. దీంతో శుక్రవారం ఉదయం తలుపులు బద్దలకొట్టి చూడగా కనకదుర్గ నిర్జీవంగా పడి ఉంది. చనిపోయిందని భావించి గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఆటోట్రాలీలో కనకదుర్గను పడుకోబెట్టారు.
ఇంతలో ఒక్కసారిగా లేచి కూర్చోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే ఆమెను సూరారంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. జీవితంపై విరక్తిలో నిద్రమాత్రలు మింగానని పోలీసులకు చెప్పిన కనకదుర్గ పూర్తి వివరాలను వెల్లడించేందుకు మాత్రం నిరాకరించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.