woman doctor suicide
-
రెండో పెళ్లి.. అడిగిన డబ్బులు తేకుంటే మొదటి భార్యను తీసుకొస్తానని..
సాక్షి, మలక్‌పేట: భర్త వేధింపులు తాళలేక వైద్యురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ నెల 8న జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా దామరచర్లకు చెందిన గంగనపల్లి కాశీవిశ్వనాథం కుమార్తె స్వప్న(38)ఎంబీబీఎస్ చదివింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పీహెచ్సీలో వైద్యురాలిగా పని చేస్తున్న సమయంలో మహబూబ్‌నగర్‌కు చెందిన వ్యక్తితో ఆమెకు పెళ్లైంది. అనివార్య కారణాల వల్ల భర్త నుంచి విడాకులు తీసుకుంది. అనంతరం 2015 ఏప్రిల్‌లో కర్నూలుకు చెందిన ముత్యాల మద్దయ్య కుమారుడు శ్రీధర్‌తో రెండో వివాహం జరిగింది. రూ.10 లక్షలు నగదు, 14 తులాల బంగారం కట్నం కింద ముట్టజెప్పారు. శ్రీధర్ కూడా డాక్టర్. అతడికి మేనమామ కుమార్తెతో పెళ్లికాగా, విడాకులు తీసుకున్నారు. అప్పటికే వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్వప్నకు కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ సీటు రావడంతో హైదరాబాద్‌కు వచ్చింది. «శ్రీధర్ నల్లగొండ మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నాడు. భార్యాభర్తలు అస్మాన్‌ఘడ్ తిరుమల హిల్స్‌లో ఉంటున్నారు. ఏడాది పాటు వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగింది. అదనపు కట్నం తేవాలని, లేదంటే మొదటి భార్యను తీసుకొస్తానని భర్త వేధిస్తుండంతో స్వప్న మానసికంగా కృంగిపోయి ఆత్మహత్య కూడా యత్నించింది. చదవండి: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో.. 2020 సంవత్సరంలో స్వప్న తల్లి విజయ మృతి చెందగా అప్పటి నుంచి ఆమెకు చెందిన ఇంట్లో వాటా, ఆమె పేరిట ఉన్న నగదు తీసుకురావాలని స్వప్నను శ్రీధర్ ఒత్తిడి చేస్తున్నాడని తండ్రి విశ్వనాథం ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, ఈనెల 8న స్వప్న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ ఆమె తండ్రికి శ్రీధర్ ఫోన్ చేసి చెప్పాడు. మృతదేహాన్ని పరిశీలించిన కుటుంబసభ్యులు స్వప్న మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతిరాలి తండ్రి సైదాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కేసుపై ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌ను వివరణ కోరగా, స్వప్న ఆత్మహత్య చేసుకుందన్నారు. శ్రీధర్‌పై కట్నం వేధింపుల కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. -
సీనియర్ల వేధింపులు : మెడికో ఆత్మహత్య
సాక్షి,ముంబై : సీనియర్ల వేధింపులకు తాళలేక గైనకాలజీ పోస్ట్-గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు సీనియర్ వైద్యుల చేతిలో కులపరమైన వేధింపులకు ఎదుర్కొన్న మెడికో పాయల్ సల్మాన్ తద్వీ(26) హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నారు. ముంబై సెంట్రల్ బీవైఎల్ నాయర్ ఆసుపత్రిలోబుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జల్గావ్కు చెందిన డా. పాయల్ ఎంబీబీఎస్ పూర్తి చేసిన అనంతరం బీవైఎల్ నాయర్ ఆసుపత్రిలో ఎండీ (గైనకాలజీ) చేస్తున్నారు. అయితే ఎస్సీ కులానికి చెందిన పాయల్‌పై ముగ్గురు మహిళా డాక్టర్లు గత కొంతకాలంగా కులపరమైన వివక్ష చూపుతూ వేధింపులకు దిగారు. రిజర్వ్డ్ కేటగిరీ అంటూ పలుసార్లు ఎద్దేవా చేసేవారు. అంతేకాదు వాట్సాప్ గ్రూపులో ఆమెను తీవ్రంగా అవమానించేవారు. అయితే ఈ వేధింపులపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లభించలేదు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో డిప్రెషన్‌కు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. సీనియర్ వైద్యుల వేధింపులు, యాజమాన్య నిర్లక్ష వైఖరి కారణంగా తమ బిడ్డ ప్రాణాలు తీసుకుందని పాయల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే వేధింపులకు సంబంధించి తమకు రాతపూర్వక ఫిర్యాదు ఏదీ అందలేదని ఆసుపత్రి సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. కులం పేరుతో వేధించేవారనీ,లంచ్ విరామంలో భోజనం చేయడానికి అనుమతినిచ్చేవారు కాదని పాయల్ సోదరుడు నీలేష్ ఆరోపించారు. అంతేకాదు ఎండీ కోర్స్ ఎలా పూర్తి చేస్తావో చూస్తామంటూ బెదరించేవారని తెలిపారు. కనీసం భర్తను కలవడానికి కూడా పాయల్‌కు అనుమతినిచ్చేవారు కాదని ఆయన ఆరోపించారు. ఇదే హాస్పిటల్‌కు తాను ట్రీట్మెంట్కు వచ్చినపుడు పలుసార్లు వేధింపులకు పాల్పడ్డారని పాయల్ తల్లి, కాన్సర్‌తో బాధపడుతున్న అబీదా సలీం(53) కన్నీటి పర్యంతమయ్యారు. ఇదే విషయంలో బుధవారం సాయంత్రం తనతో చెప్పుకుని బాధపడిందనీ, తాము వచ్చేలోపే అంతా జరిగిపోయిందని వాపోయారు. మరోవైపు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా హేమా ఆహుజా, భక్తి మెహరే, అంకిత ఖండేల్వాల్ అనే ముగ్గురు సీనియర్ డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
విషపు ఇంజక్షన్ ఎక్కించుకొని...
సాక్షి, హైదరాబాద్: అనుమానస్పదస్థితిలో ఓ వైద్యురాలు మృతిచెందిన సంఘటన మంగళవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కథనం మేరకు. సివిల్ సర్జన్ డాక్టర్ ఎంవీఏ లక్ష్మీ (43) సైనిక్‌పురి, హస్తినాపురి, జేపీ టవర్‌లో నివాసం ఉంటూ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి హెచ్ఓడిగా విధులు నిర్వహిస్తుంది. అవివాహిత అయిన ఆమె ఒంటరిగానే ఉంటుంది. గత రెండు రోజులుగా ఇంటి నుంచి బయటకు రాకపోవడాన్ని గుర్తించిన వాచ్మెన్ అపార్టుమెంట్ అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన ఇరుగు పొరుగు సాయంతో పలుమార్లు తలుపు తట్టినా తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులను బద్దలుకొట్టి చూడగా ఇంట్లో చాపపై ఆమె మృతి చెంది ఉంది. సంఘటన స్థలంలో రెండు ఇంజక్షన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలను బట్టి ఆమె స్వయంగా విషాన్ని ఎక్కించుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని కుషాయిగూడ ఇన్స్పెక్టర్ తెలిపారు. -
కలకలం రేపుతున్న లేడీ డాక్టర్ ఆత్మహత్య!
విజయవాడ: ఓ మహిళా వైద్యురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన విజయవాడ అశోక్‌నగర్‌లో వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న లేడీ డాక్టర్ సుష్మ అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందింది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భర్త సునీల్ వేధింపుల వల్లే సుష్మ మృతి చెందిందని, భర్త హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు వైద్యురాలి భర్తను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. వీరికి ఏడేళ్ల పాప ఉంది. ఈ ఘటనపై సుష్మ కుటుంబీకులు తరఫు న్యాయవాది మాట్లాడుతూ... ప్రాథమిక ఆధారాల ప్రకారం సుష్మది కచ్చితంగా హత్యేనని, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. మృతురాలి ఒంటిమీద కూడా గాయాలు ఉన్నాయని తెలిపారు. మృతురాలి తల్లి గీత మాట్లాడుతూ... తన కుమార్తె చనిపోయేంత పిరికిది కాదని అన్నారు. భర్త వేధింపులతోనే ఆత్మహత్యకు పాల్పడిందని బంధువులు ఆరోపిస్తూ సుష్మ మృతదేహంతో ఆందోళనకు దిగారు. సునీల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెండు రోజులు గడిచినా కుటుంబసభ్యులు సుష్మ అంత్యక్రియలు చేయలేదు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మాట్లాడతామని పోలీసులు తెలిపారు.