Woman Fund
-
ఐడియాలున్నా ఫండింగ్ లేదు!
ఈ ఏడాది తొలి ఆరునెలల్లోనే మహిళల స్టార్టప్‌కు ఫండింగ్ 24 శాతం వరకు పడిపోయిందని ‘మేకర్స్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆ తగ్గిన మొత్తం విలువ సుమారు 2 వేల 60 కోట్ల రూపాయలు! మహిళల స్టార్టప్‌లపై నమ్మకం లేక డబ్బు పెట్టేవాళ్లు ఇలా ముఖం చాటేయవచ్చు కానీ, అవే ముఖాలు ఆశ్చర్యంతో తమ వైపు తిరిగి చూసేలా మహిళలు తమ వ్యాపార దక్షతను చాటుతుండటం విశేషం. ‘బయోకాన్’ సంస్థ ఒక ఆలోచనగా ఆవిర్భవించే నాటికి కిరణ్ మజుందార్ షా వయసు ఇరవై ఐదేళ్లు. అప్పటికే ఆమెకు మంచి ‘బ్య్రూ–మాస్టర్’గా పేరుంది. ‘బయోకాన్’ జీవ ఔషధాల పరిశోధనా సంస్థ కనుక ‘బ్య్రూ–మాస్టర్’గా ఆమెకు ఉన్న అనుభవం తప్పక తోడ్పడుతుంది. అనుభవం సరే. డబ్బు మాటేమిటి? ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలి. ఎవరూ రాలేదు! ఒక మహిళ శక్తి సామర్థ్యాలను నమ్మి బయో టెక్నాలజీ రంగంలోని ఒక అంకుర సంస్థకు (టెక్–స్టార్టప్) రుణం ఇచ్చేందుకు ఒక్క బ్యాంకు కూడా ఆనాడు తొందరపడలేదు. కిరణ్ మజుందార్ షా కొన్ని మాత్రం ముందుకు వచ్చాయి కానీ, రుణం ఇవ్వడానికి ఆమె తండ్రి ఆమెకు షూరిటీగా ఉండాలన్న షరతు విధించాయి. యునైటెడ్ బ్రూవరీస్లో ఆయన హెడ్ బ్య్రూ–మాస్టర్. తండ్రి చేత సంతకాలు పెట్టించడం కిరణ్ మజుందార్‌కు ఇష్టం లేదు. చివరికి ఓ ‘ఏంజెల్ ఇన్వెస్టర్’ ఆమెకు దొరికారు. అంటే.. బంధువుల్లోనే ఒకరు. అలా బెంగళూరులో బయోకాన్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఆ సంస్థ నికర విలువ సుమారు 33 వేల కోట్ల రూపాయలు! ∙∙ గుర్గావ్లోని ప్రసిద్ధ ‘విన్‌గ్రీన్స్ ఫామ్స్’ సంస్థ రైతులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంటుంది. పర్యావరణ సమతౌల్యం కోసం వంద రకాలైన పంటలను పండిస్తుంది. ఆహార, ఆరోగ్య ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఆ సంస్థ వ్యవస్థాపకురాలు అంజు శ్రీవాత్సవ. మొదట్లో సిబ్బందికి జీతాలు ఇవ్వడానికే ఆమెకు కష్టమైపోయింది. పది లక్షల రూపాయల పెట్టుబడితో 2008లో ప్రారంభం అయింది ‘విన్ గ్రీన్స్ ఫామ్స్’. అంజు శ్రీవాత్సవ కిరణ్ మజుందార్లానే అంజు శ్రీవాత్సవ కూడా విన్గ్రీన్స్కు అవసరమైన పెట్టుబడి కోసం తలకు మించిన ప్రయత్నాలు చేయవలసి వచ్చింది. మహిళ అన్న ఒకే ఒక కారణంగా వెంచర్ క్యాపిటలిస్టులు (డబ్బు పెట్టేవారు) వెనకాడారు. కనీసం ఆమెకు తెలిసినవాళ్లలో ఏంజెల్ ఇన్వెస్టర్లైనా లేరు. తన తిప్పలు తనే పడ్డారు. సంస్థను పైకి తెచ్చారు. పెట్టుబడి డబ్బు కోసం వెళ్లినప్పుడు ఖాళీ చేతులు చూపించిన వారికి ఇప్పుడు ఆమె నెలకు 8 కోట్ల రూపాయల ఆదాయాన్ని చూపిస్తున్నారు! ∙∙ ‘నిరమయి’ పేరు వినే ఉంటారు. వినూత్న వైద్య ఆరోగ్య చికిత్స సాధనాలు, విధానాల పరిశోధనా సంస్థ. నిరమయి వ్యవస్థాపకురాలు గీతా మంజూనాథ్. సంస్థ బెంగళూరులో ఉంటుంది. రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు చేసే మామోగ్రఫీ కన్నా కూడా చౌకగా నిరమయి కనిపెట్టిన వ్యాధి నిర్థారణ విధానం ఆ సంస్థకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ఈ సంస్థ ఆవిష్కరణలన్నీ స్వయంగా మంజూనాథ్ పర్యవేక్షణలోనే జరుగుతాయి. బయోటెక్నాలజీలో 25 ఏళ్ల అనుభవం ఆమెది. అయితే ‘‘మహిళల స్టార్టప్‌లకు అంత తేలిగ్గా ఏమీ ఫండింగ్ దొరకదు’’ అని మంజూనాథ్ అంటారు. నాలుగేళ్ల క్రితమే మొదలైన ‘నిరమయి’.. సవాళ్లను ఎదుర్కొంటూ ఇప్పుడిప్పుడు కోట్ల రూపాయల రాబడిని పొందుతున్న కంపెనీగా వెంచర్ క్యాపిటలిస్టుల గుర్తింపు తెచ్చుకుంది. గత ఏడాది 16 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించుకోగలిగింది. ∙∙ స్టార్టప్‌ను నడపడం బ్రహ్మవిద్యేమీ కాదని మహిళల నేతృత్వంలోని బయోకాన్, విన్‌గ్రీన్స్, నిరమయి వంటి విజయవంతమైన కంపెనీలు నిరూపిస్తున్నప్పటికీ మహిళల స్టార్టప్‌లకు ఫండింగ్ దొరకడం అన్నది మాత్రం ఇప్పటికీ పెద్ద విషయం గానే ఉంది! 2020 తొలి ఆరునెలల్లోనే మహిళల స్టార్టప్ కు ఫండింగ్ 24 శాతం వరకు పడిపోయిందని ‘మేకర్స్ ఇండియా’ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాదిని వదిలేసి చూసినా ఇండియాలో వెంచర్ క్యాపిటలిస్టుల ఫండింగ్‌లో కేవలం 2 శాతం కన్నా తక్కువ మాత్రమే మహిళల స్టార్టప్‌లు పొందగలుగుతున్నాయి. కారణం తెలిసిందే. ఐటీ రంగంలో మహిళల వ్యాపార దక్షతలపై ఇన్వెస్టర్లకు నమ్మకం లేకపోవడమే. మహిళల పేరుపై వ్యక్తిగత ఆస్తులు ఉండకపోవడం కూడా మరొక కారణం. గీతా మంజునాథ్ ‘వెంచర్స్ ఇంటెలిజెన్స్’ సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో ఫండింగ్ ఉన్న మహిళల స్టార్టప్‌లు 2018లో 9.2 రెండు శాతంగా ఉంటే, ఈ ఏడాది నవంబరుకు 14.3 శాతానికి పెరిగాయట! మరి ఈ పెరుగుదల ఎలా సాధ్యం అయింది? ఎలా అంటే.. ఆ స్టార్టప్ ల సహ వ్యవస్థాపకులుగా పురుషులు ఉండటం. పురుషుల భాగస్వామ్యం ఉన్నప్పుడే (తండ్రి గానీ, భర్త గానీ, మరొకరు గానీ) మహిళల స్టార్టప్‌లకు నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, వెంచర్ కేపిటలిస్టు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. మహిళలకు ఫండింగ్ దొరకపోవడానికి కారణాలను వెతుక్కోవడం కాదు ఇదంతా. ఫండింగ్ లభించకపోయినా మహిళలు వెనకంజ వేయకుండా వ్యాపార రంగంలో అద్భుతమైన ఫలితాలను సాధించి చూపుతున్నారని చెప్పడం. -
రుణం మొత్తం చెల్లించాకే సబ్సిడీ
విలేకరుల సమావేశంలో ‘స్త్రీ నిధి’ మేనేజింగ్ డెరైక్టర్ జీవీఎస్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: వివిధ పథకాల కింద ప్రభుత్వమిచ్చే సబ్సిడీ దుర్వినియోగం కాకుండా, లబ్ధిదారు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాకే సబ్సిడీ మొత్తాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్త్రీ నిధి బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ జీవీఎస్‌రెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్ అధ్యక్షతన మంగళవారం హోటల్ గోల్కొండలో వివిధ ప్రభుత్వ విభాగాల అధిపతులు, కమిషనర్లు, కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బ్యాంకులు రుణాలివ్వని ప్రాంతాల్లో అర్హులైన పేద మహిళలకు రుణ సదుపాయం కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకే కాకుండా, ఆయా గ్రూపుల్లో సభ్యులు కాని వారికి కూడా రుణాలందించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ముఖ్యంగా బీసీ, గిరిజన, మైనార్టీ, మహిళా, శిశు సంక్షేమం, ఎస్సీ డెవలప్మెంట్, ఫిషరీస్, అగ్రికల్చర్, ఉద్యానవన, హస్తకళలు, విత్తనోత్పత్తి, పశు సంవర్థక .. తదితర ప్రభుత్వ విభాగాల్లోని సబ్సిడీ లింక్ పథకాల ద్వారా ఆర్థిక చేయూతను అందించడంలో స్త్రీ నిధి తనవంతు పాత్ర పోషిస్తుందన్నారు. పేదరిక నిర్మూలనకు క్లస్టర్ అప్రోచ్ విధానం పేదరిక నిర్మూలన నిమిత్తం క్లస్టర్ అప్రోచ్ విధానాన్ని అవలంబించాలని యోచిస్తున్నామని జీవీఎస్ రెడ్డి చెప్పారు. ప్రాంతాల వారీగా వివిధ రకాల (కూరగాయలు, పాలు, చేపల పెంపకం తదితర) ఉత్పత్తుల సాగును ప్రోత్సహించి, లబ్ధిదారులకు రుణాలు, శిక్షణతో పాటు టెక్నికల్, మార్కెటింగ్ అంశాల్లో సహకారాన్ని కూడా అందించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ద్వారా వివిధ రకాల వృత్తుల్లో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు.