రుణం మొత్తం చెల్లించాకే సబ్సిడీ
విలేకరుల సమావేశంలో ‘స్త్రీ నిధి’ మేనేజింగ్ డెరైక్టర్ జీవీఎస్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వివిధ పథకాల కింద ప్రభుత్వమిచ్చే సబ్సిడీ దుర్వినియోగం కాకుండా, లబ్ధిదారు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాకే సబ్సిడీ మొత్తాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్త్రీ నిధి బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ జీవీఎస్‌రెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ ఎస్పీసింగ్ అధ్యక్షతన మంగళవారం హోటల్ గోల్కొండలో వివిధ ప్రభుత్వ విభాగాల అధిపతులు, కమిషనర్లు, కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బ్యాంకులు రుణాలివ్వని ప్రాంతాల్లో అర్హులైన పేద మహిళలకు రుణ సదుపాయం కల్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకే కాకుండా, ఆయా గ్రూపుల్లో సభ్యులు కాని వారికి కూడా రుణాలందించే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ముఖ్యంగా బీసీ, గిరిజన, మైనార్టీ, మహిళా, శిశు సంక్షేమం, ఎస్సీ డెవలప్‌మెంట్, ఫిషరీస్, అగ్రికల్చర్, ఉద్యానవన, హస్తకళలు, విత్తనోత్పత్తి, పశు సంవర్థక .. తదితర ప్రభుత్వ విభాగాల్లోని సబ్సిడీ లింక్ పథకాల ద్వారా ఆర్థిక చేయూతను అందించడంలో స్త్రీ నిధి తనవంతు పాత్ర పోషిస్తుందన్నారు.
పేదరిక నిర్మూలనకు క్లస్టర్ అప్రోచ్ విధానం
పేదరిక నిర్మూలన నిమిత్తం క్లస్టర్ అప్రోచ్ విధానాన్ని అవలంబించాలని యోచిస్తున్నామని జీవీఎస్ రెడ్డి చెప్పారు. ప్రాంతాల వారీగా వివిధ రకాల (కూరగాయలు, పాలు, చేపల పెంపకం తదితర) ఉత్పత్తుల సాగును ప్రోత్సహించి, లబ్ధిదారులకు రుణాలు, శిక్షణతో పాటు టెక్నికల్, మార్కెటింగ్ అంశాల్లో సహకారాన్ని కూడా అందించాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ ద్వారా వివిధ రకాల వృత్తుల్లో శిక్షణ ఇప్పించనున్నట్లు తెలిపారు.