ప్రభుత్వాసుపత్రుల్లో ఇద్దరి మృతి
కరీంనగర్ హెల్త్, న్యూస్‌లైన్ :కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, సకాలంలో వైద్యం అందించలేదని బం ధువులు ఆరోపించారు. మృతురాలి కుమారు డు రమేష్ కథనం ప్రకారం.. ఎల్కతుర్తి మం డలం జీల్గులకు చెందిన పంజాల సమ్మక్క (55) తీవ్ర జ్వరంతో సోమవారం మధ్యాహ్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించి ఐడీ వార్డులో చేర్చుకున్నారు. అక్కడ బెడ్లు ఖాళీ లేకపోవడం తో వరండాలో మంచం కేటాయించారు.
ప్రిస్క్రిప్షన్ ప్రకారం.. సిబ్బంది ఇంజిక్షన్ ఇచ్చి సెలైన్ ఎక్కించారు. సాయంత్రమైనా రోగి ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో బంధువులు మరోమారు డాక్టర్‌కు సమాచారమందించారు. తాము ఏమీ చేయలేమని చేతులెత్తేశాడు. ఆస్పత్రి సిబ్బంది సమ్మక్కకు వెంటిలేటర్ అమర్చారు. రాత్రి ఏడు గంటల నుంచి దాహందాహం అంటూ అరుస్తూనే ఉంది. మంగళవారం వేకువజామున 15 గ్లాసుల నీరు తాగించారు. వెంటిలేటర్ ఉన్నా శ్వాస తీసుకోలేక కొట్టుకుంటూనే ఉంది. విషయాన్ని డ్యూటీ డాక్టర్‌కు తెలపగా.. మరో రెండు ఇంజిక్షన్లు ఇచ్చారు. జనరల్ వార్డు నుంచి ఎమర్జెన్సీ వార్డుకు తరలించి ప్రాణాలు కాపాడాలని డాక్టర్‌ను వేడుకున్నా.. అక్కడ బెడ్లు ఖాళీగా లేవంటూ వెళ్లిపోయాడు.
పరిస్థితి విషమించి మధ్యాహ్నం ఒంటి గంటకు సమ్మక్క మృతిచెందింది. వైద్యమందక సమ్మక్క కొట్టుకుంటున్నా డాక్టర్లు పట్టించుకోలేదని, వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లినా తన తల్లి ప్రాణాలు దక్కేవని రమేష్ కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కొండల్‌రెడ్డిని వివరణ కోరగా.. సమ్మక్క గుండె జబ్బుతోపాటు తీవ్ర జ్వరంతో ఆసుపత్రికి వచ్చిందని, పరిస్థితి విషమంగా ఉందని, వరంగల్‌కు తీసుకెళ్లాలని చెప్పినా బంధువులు పట్టిం చుకోలేదని, వైద్యుల తప్పులేదని అన్నారు.
కోల్‌సిటీ, న్యూస్‌లైన్ :గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జాడి మల్లయ్య(65) మంగళవారం రాత్రి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతో వృద్ధుడు మృతి చెందాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. రామగుండం మండలం తక్కల్లపల్లికి చెందిన మల్లయ్య మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం మంగళవారం ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. సకాలంలో వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు అందుబాటులో లేరని, నర్సులే చికిత్స అందించారని,
డాక్టర్ పర్యవేక్షణ లేకపోడంతో తన తండ్రి మృతి చెందాడని కుమారుడు వెంకటేష్ ఆరోపించాడు. వన్‌టౌన్ ఎస్సై వలీబాబా డ్యూటీ డాక్టర్‌తో మాట్లాడి వివరాలు సేకరించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌కు తీసుకుపోవాలని బంధువులకు చెప్పినట్లు డ్యూటీ డాక్టర్ వెల్లడించారు. ఇందులో వైద్యం నిర్లక్ష్యం లేదని, తను చెప్పడంతోనే నర్సింగ్ సిబ్బంది చికిత్స అందించారని డాక్టర్ వివరించారు. అందుబాటులో లేని డాక్టర్‌పై చర్యలు తీసుకునేంత వరకు మృతదేహాన్ని తరలించేది లేదని బంధువులు పేర్కొన్నారు. చివరికి ఎస్సై జోక్యంతో కుటంబసభ్యులు శాంతించారు.