ఒక శవం.. మృతులిద్దరు..
లింగంపేట : మండలంలోని శెట్పల్లి శివారులో గత నెల 26న వెలుగుచూసిన గుర్తుతెలియని మహిళ శవం విషయం రాద్దాంతమవుతోంది. శవం మాదంటే మాదని ఇరు వర్గాల బాధితులు ముందుకు వచ్చారు. దీంతో శవమెవరిదో తేలక పోలీసులు సతమతమవుతున్నారు. ఈ మేరకు డీఎన్ఏ పరీక్షల నిమిత్తం పంపారు.
శెట్పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ కుళ్లిన శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో ఎల్లారెడ్డి సీఐ రామకృష్ణ, లింగంపేట ఎస్సై పల్లె రాకేశ్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడిని పిలిచి అక్కడే పోస్టుమార్టం చేశారు. మృతి చెందిన మహిళ చీర, జాకెట్, మెడలో ఉన్న నల్లపూసల దండ వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సమాచారాన్ని జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లకు చేరవేసారు.
అప్పు చెప్పిన కథ ఇదీ..
నిజాంసాగర్ మండలం మాగి గ్రామానికి చెందిన ద్యానబోయిన రామయ్య అనే వ్యక్తి తన పెద్దకూతురుతో కలిసి లింగంపేట పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని మృతురాలి వస్తువులను చూసి ఆమె తనకూతురు(పేరు రామవ్వ)అని నిర్ధారించారు. పిట్లం మండలం తిమ్మానగర్‌కు చెందిన సంజీవులు అనే వ్యక్తి కి తన కూతురు 60 వేలు అప్పుగా ఇచ్చిందని, అవి అడిగినందుకే హత్యచేసి ఉంటారని తండ్రి పోలీసులకు చెప్పాడు. పోలీసులు సంజీవులును అదుపులోకి తీసుకుని విచారించారు. రామవ్వను నేనే హత్యచేసానని అంగీకరించినట్లు తెలిసింది.
సెల్ ఫోన్ చెప్పిన కథ ఇదీ..
ఈ నేపథ్యంలో పోలీసులు ఏ విధంగా హత్య చేసావో చూపాలని నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెవెళ్లగా అక్కడికి కొద్ది దూరంలో సెల్‌ఫోన్ లభించింది. అది నాగిరెడ్డిపేట మండలం జప్తిజాన్కంపల్లి తండాకు చెందిన దెగావత్ శారదకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. శారద కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈక్రమంలో పోలీసులు లింగంపేట మండలం మోతె తండాకు చెందిన శారద తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా మృతురాలి వస్తువులను చూపించగా ఇవి తన కూతురు(శారద)వేనని తండ్రి తులసీరాం చెప్పాడు. దీంతో పోలీసులు ఇంతకీ మృతదేహం ఎవదనేది తేలక సతమతమవుతున్నారు. ఒక మహిళ మృత దేహం కోసం రెండు కుటుంబాలు మాదంటే మాదనడంతో వారిని పోలీసులు డీఎన్ఏ పరీక్షలకు సిఫారసు చేసారు. ఒకే మహిళ శవం కోసం ఇద్దరు పోటీ పడుతుండటంతో అసలు నిజాన్ని వెలికితీయాలని జిల్లా ఎస్పీ తరుణ్‌జోషీ ఆదేశించారని పోలీసులు తెలిపారు.