Women and child welfare departments
-
మహిళా, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: మహిళా, శిశు సంక్షేమ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. అంగన్వాడీలలో నాడు-నేడుపై సమీక్ష చేపట్టిన సీఎం.. దాదాపు రూ.1500 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందని.. మూడు విడతల్లో చేపట్టాలని ఆయన ఆదేశించారు. మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగుపడాలన్నారు. పనుల్లో నాణ్యత ఉండాలని, చిన్నారులకు మంచి వాతావరణం అందించాలన్న సీఎం.. ప్రతి మండలంలో కూడా పనులు జరిగేలా మూడు విడతలకూ కార్యాచరణ చేయాలని సీఎం పేర్కొన్నారు. ‘‘అంగన్వాడీలలో నిరంతర పర్యవేక్షణ ఉండాలి. పాలు, గుడ్లు లాంటి ఆహారం పంపిణీలో ఎలాంటి సమస్యలు ఉండకూడదు. వీటి పంపిణీపై సమగ్ర పర్యవేక్షణ, పరిశీలన ఉండాలి. సమగ్రమైన ఎస్ఓపీలు రూపొందించుకోవాలని, టెక్నాలజీ వాడుకోవాలి. పంపిణీలో ఎక్కడైనా లోపాలు ఉంటే కచ్చితంగా సంబంధిత వ్యక్తులను బాధ్యులు చేసి చర్యలు తీసుకోవాలి. సూపర్‌వైజర్లపైన కూడా పర్యవేక్షణ ఉండాలి’’ అని సీఎం జగన్ అన్నారు. సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్: ‘‘స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీతో పాటు, పదోన్నతుల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. 63 సీడీపీఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిని వీలైనంత త్వరగా భర్తీ చేయాలని ఆదేశించారు. ‘‘నూటికి నూరుశాతం పిల్లలకు పాలు పంపిణీ కావాలి. అలాగే పిల్లలకు ప్లేవర్డ్ పాలు పంపిణీని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలి. మూడు నెలల తర్వాత పూర్తిస్థాయిలో ప్లేవర్డ్ మిల్క్ పంపిణీ కావాలి. ఈ మేరకు షెడ్యూల్ రూపొందించుకోవాలి. అంగన్వాడీలలో బోధనపైనా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉత్తమ బోధనలను అందుబాటులోకి తీసుకు రావాలి. అంగన్వాడీలలో స్మార్ట్ టీవీల ద్వారా డిజిటల్ పద్ధతుల్లో బోధనపై ఆలోచనలు చేసి, ప్రతిపాదనలు రూపొందించాలి’’ అని సీఎం సూచించారు. ‘‘అంగన్వాడీల్లో పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్, వార్డు క్లినిక్స్ ద్వారా పరిశీలన చేయించాలి. వైద్య పరంగా ఎలాంటి చికిత్సలు అవసరమైనా ఆరోగ్యశ్రీని వినియోగించుకుని వారికి మెరుగైన వైద్యం అందించేలా చూడాలి. తల్లికానీ, బిడ్డకానీ.. ఎవరైనా రక్తహీనత, పౌష్టికాహారలోపం లాంటి సమస్యలతో బాధపడుతుంటే.. వాటిని నివారించడానికి సమగ్రమైన కార్యాచరణ ఉండాలి. ఈ విషయంలో అంగన్వాడీలు, విలేజ్ క్లినిక్స్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ఇలాంటి సమస్యలు ఉన్నవారికి అందరితో పాటు ఇచ్చే ఆహారం, మందులు కాకుండా.. అదనంగా ఇస్తూ... వీరి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. దీనిపై ఎస్ఓపీలను తయారు చేయాలి. ఫిబ్రవరి 1 నుంచి దీన్ని అమలు చేయాలి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో దీనికి పరిష్కారం చూపించాలి. తల్లులకు టేక్ హోం రేషన్ విధానం పై ఆలోచన చేయాలి. దీని కోసం లోపాలకు తావులేని విధానాన్ని రూపొందించాలి’’ అని సీఎం అన్నారు. ‘‘అంగన్‌వాడీలలోలను, ప్రభుత్వ బడులలో బలహీనవర్గాలకు చెందిన పిల్లలే అధికంగా ఉంటారు. ఈ వర్గాలకు చెందిన పిల్లలకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది. వారి పట్ల సానుకూల దృక్పథంతో పనిచేయాలి. 10–12 ఏళ్ల వయస్సులో మంచి బోధన అందించడం ద్వారా ఉత్తమైన ఫలితాలు సాధించవచ్చన్న సీఎం. విద్య, వ్యవసాయం, వైద్య ఆరోగ్యం తరహాలో మహిళ, శిశు సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్య కార్యక్రమంగా చేపట్టింది’’ అని సీఎం అన్నారు. చదవండి: కన్నీటి ఉద్దానంపై పన్నీటి జల్లు.. సీఎం జగన్ చిత్తశుద్ధికి సాక్ష్యాలివే! ఈ సమీక్షా సమావేశంలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ఎ బాబు, పాఠశాల మౌలికవసతులశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, పౌరసరఫరాలశాఖ ఎండీ జీ వీరపాండ్యన్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి, మార్క్ ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మహిళా, శిశు సంక్షేమశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
అంగన్వాడీల్లో ‘స్మార్ట్’ సేవలు
సాక్షి, పుట్టపర్తి: అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో స్మార్ట్ సేవలకు శ్రీకారం చుట్టేందుకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పని చేసే కార్యకర్తలు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్లను అందిస్తున్నారు. త్వరలో అధికారికంగా ఈ సేవలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. స్మార్ట్ సేవలతో అంగన్వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు పాదర్శక సేవలు అందించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. జిల్లాకు 2,863 స్మార్ట్ఫోన్ల పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టులకు గానూ 2,824 అంగన్వాడీ కేంద్రాలు (మినీ, మెయిన్) ఉన్నాయి. ఈ కేంద్రాల్లోని అంగన్వాడీ కార్యకర్తల పర్యవేక్షణకు గానూ 39 మంది సూపర్ వైజర్లు ఉన్నారు. అంగన్వాడీ సేవలను విస్తృతం చేయడంలో భాగంగా వీరందరికీ 2,863 స్మార్ట్ ఫోన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. విధి నిర్వహణలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్న వివిధ రకాల సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ల ద్వారా ఫీడ్ చేసి ఉన్నతాధికారులకు పంపాల్సి ఉంటుంది. పక్కాగా పౌష్టికాహారం అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంతో పాటు కోడిగుడ్లు తదితర పౌష్టికాహారాన్ని అందజేస్తారు. వీటి వివరాలను వైఎస్సార్ సంపూర్ణ పోషణ ట్రాక్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. లబ్థిదారుల హాజరు, గృహ సందర్శన కార్యక్రమాల ద్వారా గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐరన్ మాత్రల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. అదనంగా తీసుకోవాల్సిన ఆహారంపై కూడా చైతన్య పరచాల్సి ఉంటుంది. అలాగే పిల్లల బరువు, ఎత్తు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాల్సి ఉంటుంది. అంతేకాక రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు స్మార్ట్ ఫోన్ల విధానం ఎంతగానో దోహదపడుతుంది. పారదర్శక సేవలు అందుతాయి జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పారదర్శకమైన సేవలు అందుతున్నాయి. బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు ప్రతి రోజూ మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతోంది. ఐసీడీఎస్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ పక్కాగా అమలు చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్ల మంజూరుతో అక్రమాలకు చెక్ పడటంతో పాటు పారదర్శక సేవలు అందుతాయి. – రెడ్డి రమణమ్మ, ఇన్చార్జి పీడీ, ఐసీడీఎస్ (చదవండి: సెల్ఫీల కోసం వచ్చావా.. బాలయ్యా! ) -
నాటి శిశువు...నేటి వధువు
వెంగళరావునగర్: కొన్నేళ్ల క్రితం ఓ పసిగుడ్డు యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌కు చేరింది. అక్కడి సిబ్బంది ఆమెను అక్కున చేర్చుకున్నారు. కన్నబిడ్డలా ఆదరించారు. కాలం శరవేగంగా పరుగులెత్తింది. వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోని మహిళా శిశు సంక్షేమశాఖ ఆవరణలో ఉన్న శిశువిహార్‌లో బుధవారం మాధురి అనే యువతికి దత్తాత్రి అనే యువకుడితో ఘనంగా వివాహమైంది. ఒకప్పటి అనాథ శిశువే ఈ మాధురి.ఉదయం 11.55 గంటలకు కుంభలగ్నంలో వారి వివాహమైంది. అమ్మ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో... మోహన్‌నగర్‌లోని విద్యార్థినుల వసతి గృహం సూపరింటెండెంట్ ఇందిరాదేవి దంపతులు మాధురి తరఫున కన్యాదానం చేశారు. తాళిబొట్టుతో పాటు ఇతర ఆభరణాలను ఆమెకు అందజేశారు. అమ్మ ఆర్గనైజేషన్, జంట నగరాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇతర పెళ్ళి ఖర్చులు, భోజనాలు, పట్టుచీరలు సమకూరాయి. హాజరైన ప్రజాప్రతినిధులు... మాధురి వివాహానికి అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు తరలివచ్చారు. తమ స్థాయిలో కానుకలు అందజేసి ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి దత్తాత్రి తల్లి ద్రుపతాభాయి, కు టుంబ సభ్యులతో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్ కె.రాజ్యలక్ష్మి, ప్రాజెక్ట్ డెరైక్టర్ కేఆర్ఎస్ లక్ష్మీదేవి, శిశువిహార్, చిల్డ్రన్స్‌హోం, స్టేట్‌హోం, ఓల్డేజ్‌హోం, సర్వీస్‌హోంల ఇన్చార్జులు స్వరూపరాణి, లక్ష్మీకుమారి, గిరిజ, రసూల్‌బీ సుల్తానా, సీడీపీఓలు ప్రజ్వల, సుకేసిని, సత్యవతి, నర్సింగరావు, నేతలు ఆర్.సాంబశివరావు, పి.వి.రవిశేఖర్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, స్టేట్‌హోం సిబ్బంది, కాలనీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పుడు అనాథ కాదు... శిశువిహార్‌లో పెరిగి పెద్దదై కాలేజ్ ఎట్ హోంలో ఉంటున్న మాధురి ఇప్పుడు అనాథ కాదని మోహన్‌నగర్ హోం సూపరింటెండెంట్ ఇందిర అన్నారు. తమ బిడ్డను కన్యాదానం చేసినంత ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఆ దంపతులకు ఇల్లు మంజూరుకుఅధికారులు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. చాలా ఆనందంగా ఉంది... తమ వివాహానికి అధికారులు... ప్రజా ప్రతినిధులు హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని నూతన జంట మాధురి, దత్తాత్రిలు తెలిపారు. తాము ఒక్కటి కావడానికి సహకరించిన సూపరింటెండెంట్‌తో పాటు కమిషనర్, ఆర్డీడీ, పీడీలకు రుణపడి ఉంటామని చెప్పారు. తన కన్న తల్లిదండ్రులైనా ఇంత ఘనంగా వివాహం జరిపించి ఉండేవారు కాదేమోనని సంతోషం వ్యక్తం చేసింది.