నాటి శిశువు...నేటి వధువు
వెంగళరావునగర్: కొన్నేళ్ల క్రితం ఓ పసిగుడ్డు యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌కు చేరింది. అక్కడి సిబ్బంది ఆమెను అక్కున చేర్చుకున్నారు. కన్నబిడ్డలా ఆదరించారు. కాలం శరవేగంగా పరుగులెత్తింది. వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోని మహిళా శిశు సంక్షేమశాఖ ఆవరణలో ఉన్న శిశువిహార్‌లో బుధవారం మాధురి అనే యువతికి దత్తాత్రి అనే యువకుడితో ఘనంగా వివాహమైంది. ఒకప్పటి అనాథ శిశువే ఈ మాధురి.ఉదయం 11.55 గంటలకు కుంభలగ్నంలో వారి వివాహమైంది.
అమ్మ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో...
మోహన్‌నగర్‌లోని విద్యార్థినుల వసతి గృహం సూపరింటెండెంట్ ఇందిరాదేవి దంపతులు మాధురి తరఫున కన్యాదానం చేశారు. తాళిబొట్టుతో పాటు ఇతర ఆభరణాలను ఆమెకు అందజేశారు. అమ్మ ఆర్గనైజేషన్, జంట నగరాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇతర పెళ్ళి ఖర్చులు, భోజనాలు, పట్టుచీరలు సమకూరాయి.
హాజరైన ప్రజాప్రతినిధులు...
మాధురి వివాహానికి అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు తరలివచ్చారు. తమ స్థాయిలో కానుకలు అందజేసి ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి దత్తాత్రి తల్లి ద్రుపతాభాయి, కు టుంబ సభ్యులతో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్ కె.రాజ్యలక్ష్మి, ప్రాజెక్ట్ డెరైక్టర్ కేఆర్‌ఎస్ లక్ష్మీదేవి, శిశువిహార్, చిల్డ్రన్స్‌హోం, స్టేట్‌హోం, ఓల్డేజ్‌హోం, సర్వీస్‌హోంల ఇన్‌చార్జులు స్వరూపరాణి, లక్ష్మీకుమారి, గిరిజ, రసూల్‌బీ సుల్తానా, సీడీపీఓలు ప్రజ్వల, సుకేసిని, సత్యవతి, నర్సింగరావు, నేతలు ఆర్.సాంబశివరావు, పి.వి.రవిశేఖర్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, స్టేట్‌హోం సిబ్బంది, కాలనీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఇప్పుడు అనాథ కాదు...
శిశువిహార్‌లో పెరిగి పెద్దదై కాలేజ్ ఎట్ హోంలో ఉంటున్న మాధురి ఇప్పుడు అనాథ కాదని మోహన్‌నగర్ హోం సూపరింటెండెంట్ ఇందిర అన్నారు. తమ బిడ్డను కన్యాదానం చేసినంత ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఆ దంపతులకు ఇల్లు మంజూరుకుఅధికారులు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు.
చాలా ఆనందంగా ఉంది...
తమ వివాహానికి అధికారులు... ప్రజా ప్రతినిధులు హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని నూతన జంట మాధురి, దత్తాత్రిలు తెలిపారు. తాము ఒక్కటి కావడానికి సహకరించిన సూపరింటెండెంట్‌తో పాటు కమిషనర్, ఆర్‌డీడీ, పీడీలకు రుణపడి ఉంటామని చెప్పారు. తన కన్న తల్లిదండ్రులైనా ఇంత ఘనంగా వివాహం జరిపించి ఉండేవారు కాదేమోనని సంతోషం వ్యక్తం చేసింది.