Vengalarao Nagar
-
వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
వెంగళరావునగర్: యువతి వైన్స్ షాపు వద్ద హల్చల్ సృష్టించిన సంఘటన మధురానగర్ పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు... శుక్రవారం రాత్రి ఓ యువతి తన స్నేహితులతో కలిసి మధురానగర్‌లోని మధుర వైన్స్‌కు వచ్చింది. వైన్స్లోనికి ప్రవేశించి మద్యం బాటిల్స్ పగలకొట్టి, రాక్లను కొడుతూ, క్యాష్ కౌంటర్ వద్దకు వచ్చి హడావుడి చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునే సరికి యువతి తన హంగామాను కొనసాగిస్తూనే ఉంది. పోలీసులు ఆ యువతితోపాటు ఆమె స్నేహితులను బయటకు తీసుకొచ్చారు. రోడ్డుపై వచ్చిన వారు ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. ఆయా సంఘటనలను పోలీసులు ఫొటోలు, వీడియోలు తీస్తుండగా వారిని దుర్భాషలాడుతూ వారి ఫోన్‌ను లాక్కును కింద పడేసి రాయితో పగలకొట్టడానికి ప్రయతి్నంచారు. అడ్డుకోబోయిన పోలీసులను రక్కుతూ, జుట్టుపట్టుకుని లాగుతూ కేకలు వేస్తూ ట్రాఫిక్ జామ్ చేశారు. ఎట్టకేలకు వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అర్ధరాత్రి వరకు పీఎస్‌లో సిబ్బందిని అత్యంత తీవ్రమైన పదజాలంతో దుర్భాషలాడుతూ మరోసారి హడావుడి చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
వెంగళరావునగర్: పెంపుడు కుక్క అరచిందని పెద్ద గొడవే జరిగింది. ఓ కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చి చితకబాదారు కొందరు. తన తమ్ముడితో పాటు మరదలును, కుక్కను హత్య చేయబోయారంటూ ఓ వ్యక్తి మధురానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రహమత్ నగర్ లో నివాసం ఉండే ఎన్. శ్రీనాధ్, అతని భార్య స్వప్నలు ఈ నెల 8వ తేదీనాడు ఉదయం పోస్టల్ బ్యాలెట్ వేయడానికి తన పెంపుడు కుక్కతో పాటు ఇంటి నుంచి బయలుదేరాడు. అదే సమయంలో ఇంటి పక్కన ఉన్న వ్యక్తి వారి కుక్క రోడ్డుపై ఉన్నారు. ఆ సమయంలో వీరి కుక్క వారిని చూసి మొరిగింది. దాంతో ధనుంజయ్ అనే వ్యక్తి భార్య భర్తలను దుర్భాషలాడాడు. ఈ విషయంపై నాడు మధురానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తిరిగి ఈ నెల 14వ తేదీ సాయంత్రం శ్రీనాధ్ కుక్కతో బయటకు రాగా ధనుంజయ్ అనే వ్యక్తితో పాటు నలుగురు వ్యక్తులు వచ్చి శ్రీనాధ్ ను, అతని భార్య స్వప్నతో పాటుగా మేనల్లుడు, కోడలును, కుక్కను సైతం చంపుతామని బెదిరిస్తూ తీవ్రంగా కర్రలతో, రాడ్లతో కొట్టారు. దాంతో శ్రీనాథ్ అపస్మారకస్థితికి వెళ్లాడు. మిగిలిన వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో శ్రీనాథ్ సోదరుడు ఎన్.మధు మధురానగర్ పీఎస్ లో ఎల్. మధుతో పాటు మరో నలుగురిపై హత్యయత్నం కేసు పెట్టాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరితో ప్రేమాయణం.. మరో యువతితో నిశ్చితార్థం.. సినీ ఫక్కీలో పోలీస్ ఎంట్రీతో షాక్!
సాక్షి, హైదరాబాద్: ఇద్దరు యువతులను మోసం చేసి మూడో యువతితో పెళ్లితంతుకు సిద్ధమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తి తనకు మాత్రమే సొంతమంటూ మహిళలు కేసు పెట్టిన విచిత్రమైన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఏపీలోని రాయచోటి ప్రాంతానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ అనే యువకుడు మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుంటాడు. అదే ఆస్పత్రిలో పని చేసే యువతి రెండేళ్ల క్రితం అతనికి పరిచయం అయింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంగళరావునగర్ డివిజన్లోని ఒక బస్తీలో నివాసం ఉంటున్న యువతి రూముకు అనేకమార్లు వచ్చి తన కోర్కెను తీర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు చెప్పకుండా కార్ఘానాలోని మరో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పనిచేసే ఇంకో యువతితో సేమ్ సీన్ రిపీట్ చేశాడు. కట్ చేస్తే... (ఈ నెల 6న) ఎవరికీ చెప్పకుండా స్వగ్రామం వెళ్లాడు. అక్కడ తన ఇంటి పక్కనే ఉంటున్న యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల 24న నిశ్చితార్థం చేసుకోవాలనుకుని అనుకున్నాడు. పక్కాగా ప్లానింగ్ చేసి ఉంగరాలు, దండలు మార్చుకోవాలనుకునే సమయంలో సినీ ఫక్కీలో మధురానగర్ ఎస్ఐ ఇక్బాల్ షడన్‌గా రంగ ప్రవేశం చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిశి్చతార్థాన్ని చివరి నిమిషంలో అడ్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా వారికి అతని ఫ్లాష్‌బ్యాక్ మొత్తం చెప్పి నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం అయిందనుకున్నారంతా... అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. ఫక్రుద్దీన్‌ను మధురానగర్‌కు తీసుకువచ్చారని తెలుసుకున్న బాధిత యువతులు బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అర్ధరాత్రి వరకు వీడు నా వాడు అంటే కాదు నా వాడంటూ ఇరువురు యువతులు వాదులాడుకున్నారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ముందుగా నేను మోసపోయాను, కాబట్టి నాకే సొంతమంటూ ఒకరు, కాదు.. నావాడంటూ మరొకరు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఇరువురూ తమ ఆవేదను తెలియజేశారు. ఈ సమస్య ఎలా పరిష్కరించాలో అర్థంకాక మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌తోపాటు ఎస్ఐ ఇక్బాల్ తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు ఎగ్బాల్ను పోలీసులు రిమాండ్ తరలించి ఊపిరిపీల్చుకున్నారు. -
నాటి శిశువు...నేటి వధువు
వెంగళరావునగర్: కొన్నేళ్ల క్రితం ఓ పసిగుడ్డు యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌కు చేరింది. అక్కడి సిబ్బంది ఆమెను అక్కున చేర్చుకున్నారు. కన్నబిడ్డలా ఆదరించారు. కాలం శరవేగంగా పరుగులెత్తింది. వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలోని మహిళా శిశు సంక్షేమశాఖ ఆవరణలో ఉన్న శిశువిహార్‌లో బుధవారం మాధురి అనే యువతికి దత్తాత్రి అనే యువకుడితో ఘనంగా వివాహమైంది. ఒకప్పటి అనాథ శిశువే ఈ మాధురి.ఉదయం 11.55 గంటలకు కుంభలగ్నంలో వారి వివాహమైంది. అమ్మ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో... మోహన్‌నగర్‌లోని విద్యార్థినుల వసతి గృహం సూపరింటెండెంట్ ఇందిరాదేవి దంపతులు మాధురి తరఫున కన్యాదానం చేశారు. తాళిబొట్టుతో పాటు ఇతర ఆభరణాలను ఆమెకు అందజేశారు. అమ్మ ఆర్గనైజేషన్, జంట నగరాల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇతర పెళ్ళి ఖర్చులు, భోజనాలు, పట్టుచీరలు సమకూరాయి. హాజరైన ప్రజాప్రతినిధులు... మాధురి వివాహానికి అటు అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు తరలివచ్చారు. తమ స్థాయిలో కానుకలు అందజేసి ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి దత్తాత్రి తల్లి ద్రుపతాభాయి, కు టుంబ సభ్యులతో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మహిళా శిశు సంక్షేమశాఖ రీజనల్ జాయింట్ డెరైక్టర్ కె.రాజ్యలక్ష్మి, ప్రాజెక్ట్ డెరైక్టర్ కేఆర్ఎస్ లక్ష్మీదేవి, శిశువిహార్, చిల్డ్రన్స్‌హోం, స్టేట్‌హోం, ఓల్డేజ్‌హోం, సర్వీస్‌హోంల ఇన్చార్జులు స్వరూపరాణి, లక్ష్మీకుమారి, గిరిజ, రసూల్‌బీ సుల్తానా, సీడీపీఓలు ప్రజ్వల, సుకేసిని, సత్యవతి, నర్సింగరావు, నేతలు ఆర్.సాంబశివరావు, పి.వి.రవిశేఖర్‌రెడ్డి, లక్ష్మీరెడ్డి, స్టేట్‌హోం సిబ్బంది, కాలనీ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఇప్పుడు అనాథ కాదు... శిశువిహార్‌లో పెరిగి పెద్దదై కాలేజ్ ఎట్ హోంలో ఉంటున్న మాధురి ఇప్పుడు అనాథ కాదని మోహన్‌నగర్ హోం సూపరింటెండెంట్ ఇందిర అన్నారు. తమ బిడ్డను కన్యాదానం చేసినంత ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఆ దంపతులకు ఇల్లు మంజూరుకుఅధికారులు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. చాలా ఆనందంగా ఉంది... తమ వివాహానికి అధికారులు... ప్రజా ప్రతినిధులు హాజరు కావడం చాలా ఆనందంగా ఉందని నూతన జంట మాధురి, దత్తాత్రిలు తెలిపారు. తాము ఒక్కటి కావడానికి సహకరించిన సూపరింటెండెంట్‌తో పాటు కమిషనర్, ఆర్డీడీ, పీడీలకు రుణపడి ఉంటామని చెప్పారు. తన కన్న తల్లిదండ్రులైనా ఇంత ఘనంగా వివాహం జరిపించి ఉండేవారు కాదేమోనని సంతోషం వ్యక్తం చేసింది.