మాటల కోసమేనా మహిళలు..?
న్యూఢిల్లీ: మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. స్త్రీలను పురుషులతో సమానంగా చూడాలని చెప్పే పెద్దలు తీరా తమ వంతు వచ్చేసరికి ఆ విషయాన్ని మరుస్తున్నారు. సాక్ష్యాత్తు దేశంలోని మార్కెట్ పెట్టుబడుల ఒడిదుడుకులను సమతుల్యం చేసే సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్సైంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని సంస్థలు వాటిని పాటిస్తున్నా మరికొన్ని మాత్రం ఆ ఆదేశాలు తుంగలో తొక్కుతూ బేఖాతరు చేస్తున్నాయి. దాదాపు దేశంలోని 56 బడా కంపెనీలు సెబీ గీసిన గీతను దాటుతున్నాయి.
ప్రతి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో కనీసం ఒక మహిళకు స్థానం ఇవ్వాలని కంపెనీ యాక్ట్ 2013కు 2014లో సవరణ చేసింది. ఏడాదిలోగా ప్రతి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక మహిళకు చోటు ఇవ్వాలని ఆదేశించింది. ఒక వేళ అలా చేయకుంటే రూ.50 వేల ఫైన్ తో ఆరు నెలల గడువు, అది చేయకుంటే రోజుకు రూ.వెయ్యి, అప్పటికీ పూర్తి చేయకుంటే రూ.లక్షా 43 వేల జరిమానాతోపాటు, ప్రతి రోజు ఐదువేలు చెల్లించాలని అందులో పేర్కొంది. ఇది కూడా అమలుచేయకుంటే ప్రమోటర్లతో పాటు డైరక్టర్ల మీద కూడా చర్యలు చేపడతామని హెచ్చరించింది.
అయినప్పటికీ, మహిళలకు తమ సంస్థల్లో ప్రాధాన్యం కల్పించకుండా దేశ వ్యాప్తంగా 56 కంపెనీలు ఇప్పటికీ కొనసాగుతుండటం గమనార్హం. ఆ కంపెనీల్లో.. టాటా పవర్, ఆల్ స్టామ్ ఇండియా, రాష్ట్రాల సారథ్యంలో నడిచే ఓఎన్జీసీ, గెయిల్, బీఈఎమ్ఎల్, బీపీసీఎల్, హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్, హెచ్ఎంటీ, ఐఓసీ, ఎమ్ఎమ్టీసీ, నేషనల్ ఫెర్టిలైజర్స్, పవర్ ఫినాన్స్ కార్పొరేషన్, సిండికేట్ బ్యాంక్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్, మద్రాస్ ఫెర్టిలైజర్స్ లాంటి ప్రభుత్వ సంస్థలు, లాన్కో ఇన్ఫ్రాటెక్, డీబీ కార్సో, వలేకా ఇంజనీరింగ్, సెర్వలక్ష్మీ పేపర్, సలోరా ఇంటర్నేషనల్ లాంటివి ఉన్నాయి.