పోలీసు స్టేషన్లో దుస్తులు విప్పించి..
రక్షక భటులే భక్షకులయ్యారు. నీచాతి నీచంగా వ్యవహరించారు. విచారణ కోసం పిలిచిన ఇద్దరు మహిళలను వివస్త్రలుగా చేసి.. వారి ఒంటిపై కారం చల్లి అమానుషంగా ప్రవర్తించారు. దీంతో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో గల క్రాంతి చౌక్ పోలీసుస్టేషన్‌కు చెందిన ముగ్గురు సిబ్బందిపై విచారణ కొనసాగుతోంది. తమ స్నేహితురాలి మరణం విషయంలో విచారణ కోసం పిలిపించారని, అక్కడ ఒక మగ పోలీసు సూచనల మేకు ఓ మహిళా పోలీసు తమను దుస్తులు విప్పాల్సిందిగా బలవంతపెట్టిందని ఇద్దరు మహిళల్లో ఒకరైన ఓ ఇంజనీరింగ్ డిప్లొమా హోల్డర్ (21) చెప్పారు. తర్వాత తమ ఒంటిపై చెప్పుకోలేని చోట్ల కూడా కారం చల్లారని వాపోయారు. ఆరోపణల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, దీనిపై వెంటనే విచారణ జరపాల్సిందిగా ఆదేశించామని పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ చెప్పారు.
జనవరి 4న జరిగిన ఓ రోడ్డు ప్రమాదం గురించి విచారించేందుకు ఆ ఇద్దరు మహిళలను క్రాంతి చౌక్ పోలీసులు అదుపులోకి తీసుకుని జనవరి 6 సాయంత్రం వరకు స్టేషన్లోనే ఉంచారు. విడుదలైన వెంటనే ఆ మహిళ, ఆమె తల్లి పోలీసు కమిషనర్ కార్యాలయానికి వెళ్లి, ఈ విషయాన్ని డీసీపీ సందీప్ అతోలే దృష్టికి తీసుకెళ్లారు. ఆమె, మరో ఆరుగురు స్నేహితులు కొత్త సంవత్సరం వేడుకల కోసం ఓ హోటల్‌కు వెళ్లారు. ఇద్దరు మహిళలు తప్ప మిగిలినవారంతా మద్యం తాగారు. వాళ్లలో ఒక యువకుడు మత్తులో పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. దాంతో అతడిని అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో దేవగిరి కాలనీ వద్ద వదిలిపెట్టి మహిళలిద్దరినీ వాళ్ల ఇంటివద్ద దింపేందుకు వెళ్లారు. తర్వాత సెంట్రల్ బస్టాండు వద్దకు వెళ్లగా, అక్కడ తమ స్నేహితుడు కనిపించాడు. అంతకుముందు పిచ్చిగా ప్రవర్తించడంతో అతడిని వాళ్లు కొట్టారు. అతడు అక్కడి నుంచి పరిగెడుతూ కింద పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు చెప్పారు.
మర్నాటి ఉదయం ఎస్ఐ గణేష్ ఢొక్రట్, మరో మహిళా ఎస్ఐ తమను స్టేషన్‌కు తీసుకెళ్లారని, అక్కడ తమను విపరీతంగా తిట్టడమే కాకుండా దుస్తులు విప్పించి, చెప్పుకోలేని చోట్ల కారం చల్లారని మహిళలిద్దరూ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. యువకుడి మృతికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజి ఉన్నా, తమతో బలవంతంగా వాంగ్మూలాలు ఇప్పించారన్నారు. ఈ కేసు నుంచి బయటపడేయాలంటే లంచాలు ఇవ్వాలని అడిగినట్లు కూడా ఆరోపించారు.