'మహిళల కోసం ప్రత్యేక స్కీమ్‌లు'
కోల్‌కతా: ఒక మహిళగా తోటి మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే తలంపుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య ముందుకొచ్చారు. మహిళల కోసం ప్రత్యేక స్కీములు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. కోల్కత్తా లిటరరీ ఫెస్టివల్‌కు హాజరైన ఆమె.. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిరుద్యోగులందరకీ ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించలేదని, వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దితే ఉపాధివకాశాలు సృష్టించవచ్చన్నారు.
ప్రతి ఏడాది ఉద్యోగాల్లో జాయిన్ అయ్యే కోటి మంది యువతలో 50 శాతం మంది అమ్మాయిలేనని ఆమె అన్నారు. కాబట్టి కచ్చితంగా మహిళలకు చేయూతగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఓ మహిళా ఉద్యోగిగా ఎస్బీఐలో చేరినప్పుడు తాను వివక్షను ఎదుర్కొంటున్నట్టు కూడా తెలియలేదన్నారు. వివక్షను అధిగమించే లోపే, చాలా బాధ్యతలు నిర్వర్తించి ఈ స్థాయికి ఎదిగానని భట్టాచార్య తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మహిళలు చైర్‌పర్సన్‌గా ఎంపికవ్వడానికి తనకు లాగా చాలా సమయం పడుతుందని ఆమె అన్నారు. ప్రస్తుతం బ్యాంకుల్లో పనిచేసే చాలామంది మహిళలు అవకాశాలను అందిపుచ్చుకుని మంచి ఉద్యోగులుగా రాణిస్తున్నారని తెలిపారు.