Women Junior Asia Cup
-
సెమీస్ లో భారత్
కెప్టెన్ రాణీ రాంపాల్ హ్యాట్రిక్ తో రాణించడంతో... ఇక్కడ జరుగుతున్న ఉమెస్స్ జూనియర్ ఆసియా కప్ లో భారత్ సెమీస్ లోకి అడుగు పెట్టింది. ఇవాళ మలేషియాతో జరిగిన నిర్ణాయక మ్యాచ్ లో భారత్ 9-1 తేడాతో విజయం సాధించింది. సెమీస్ చేరాలంటే.. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో బారత్ దూకుడుగా ఆడింది. ఆట ప్రారంభమైన ఎనిమిదో నిమిషంలోనే చక్కటి ఫీల్డ్ గోల్ తో రాణీ కౌంట్ స్టార్ట్ చేసింది. తర్వాత 15వ నిమిషంలో జస్ ప్రీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచి లీడ్ రెండుకు పెంచింది. హాఫ్ టైమ్ కి ఆరునిమిషాల ముందు ప్రీతీ దూబే గోల్ తో లీడ్ మూడుకు పెరిగింది. హాఫ్ టైమ్ కు కాస్త ముందు భారత డిఫెన్స్ ను దాటుకుని మలేషియ గోల్ చేయగలిగింది. సెకండ్ హాఫ్ లో భారత్ మహిళలు రెచ్చిపోయారు. ఆరు నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్ చేశారు. ఆట 51 నిమిషంలో పూనమ్ బల్రా ఫీల్డ్ గోల్ చేయగా.. జస్ ప్రీత్ మరో పెనాల్టీ కార్నర్ గోల్ గా మలిచింది. దీంతో మలేసియా పై భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆదివారం సెమీ ఫైనల్ మ్యాచ్ జరగ నుంది. ఈ టోర్నీ వచ్చే ఏడాది జరగ నున్న ఎఫ్ఐహెచ్ జూనియర్ ప్రపంచ కప్ కు క్వాలిఫైయ్యింగ్ టోర్నీ కావడం విశేషం. -
పోరాడి ఓడిన భారత్
మహిళల జూనియర్ ఆసియా కప్ లో భారత హాకీ జట్టు పోరాడి ఓడింది. ఇవాళ అతిథ్య జట్టు చైనాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 2-4 తేడాతో పరాజయం పాలైంది. టోర్నీలో తొలి రెండు మ్యాచ్ ల్లో అదరగొట్టిన మనమ్మాయిలు.. పటిష్ట చైనా పైన మ్యాచ్ లో చమటోడ్చారు. మ్యాచ్ తొలి నుంచి చైనా ప్లేయర్లు భారత గోల్ పోస్టు పై పదే పదే దాడి చేశారు. దీంతో చైనాకు తొలి అర్థ భాగంలో నిమిషాల తేడాలో మూడు గోల్స్ లభించాయి. అయితే వెంటనే తేరుకున్న భారత డిఫెండర్లు చైనాను నిలువరించారు. ఇక జస్ ప్రీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచడంతో తొలి అర్ధ భాగంలో భారత్ ఒక గోల్ చేయగలిగింది. ఇక రెండో అర్ధ భాగంలో చైనా దూకుడును భారత డిఫెండర్ లు సమర్ధంగా అడ్డుకోడంతో.. చైనా కేవలం ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది. ఆట ముగిసే ముందు గుర్ జిత్ కౌర్ మరో గోల్ చేయడంతో చైనా ఆధిక్యం 2కు తగ్గించగలిగింది. పూల్ లో మూడు విజయాలతో చైనా తొలి స్ధానం సాధించి.. సెమీస్ కు చేరింది. ఇక రెండో స్ధానం భారత్, మలేషియాలు పోటీ పడుతున్నాయి. రేపు జరిగే ముఖా ముఖి మ్యాచ్ లో మలేషియా గెలిస్తే.. సెమీస్ లో అడుగుపెడుతుంది. ఒక వేళ భారత్ గెలిస్తే.. భారత్ సెమీస్ బెర్త్ దక్కించు కుంటుంది. ఈ మ్యాచ్ డ్రా అయినా.. భారత్ కే సెమీస్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. ఈనెల 12 నుంచి నాకౌట్ మ్యాచ్ లు ప్రారంభమైతాయి. -
భారత్ గోల్స్ వర్షం
చాంగ్జౌ (చైనా) : మహిళల జూనియర్ ఆసియా కప్‌లో భారత హాకీ జట్టు సూపర్ షోతో అదరగొడుతోంది. ఆదివారం జరిగిన తమ రెండో మ్యాచ్‌లో సింగపూర్‌ను 12-0 తేడాతో చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లో ఉత్తర కొరియాను 13-0తో ఓడించిన భారత అమ్మాయిలు ఈ మ్యాచ్‌లోనూ అదే రీతిన చెలరేగారు. తొలి నిమిషం నుంచే ఎదురుదాడికి దిగి ఫలితాన్ని రాబట్టారు. ఆరో నిమిషంలో పూనమ్ బార్లా తొలి గోల్ సాధించింది. 10వ నిమిషంలో అనూపా బార్లా, ప్రీతీ దూబే (15), జస్ప్రీత్ (25) గోల్స్‌తో తొలి అర్ధభాగంలో జట్టు 4-0తో ఆధిక్యం సాధించింది. ద్వితీయార్ధంలో లిలీ మయేబ్గమ్ (49) గోల్‌తో పాటు 52, 59, 61, 64, 65, 68, 70 నిమిషాల్లో వచ్చిన గోల్స్‌తో భారత్ విజయకేతనం ఎగురవేసింది. 9న చైనాతో తదుపరి మ్యాచ్ ఆడనుంది.