పోరాడి ఓడిన భారత్
మహిళల జూనియర్ ఆసియా కప్ లో భారత హాకీ జట్టు పోరాడి ఓడింది. ఇవాళ అతిథ్య జట్టు చైనాతో జరిగిన మ్యాచ్ లో భారత్ 2-4 తేడాతో పరాజయం పాలైంది. టోర్నీలో తొలి రెండు మ్యాచ్ ల్లో అదరగొట్టిన మనమ్మాయిలు.. పటిష్ట చైనా పైన మ్యాచ్ లో చమటోడ్చారు. మ్యాచ్ తొలి నుంచి చైనా ప్లేయర్లు భారత గోల్ పోస్టు పై పదే పదే దాడి చేశారు. దీంతో చైనాకు తొలి అర్థ భాగంలో నిమిషాల తేడాలో మూడు గోల్స్ లభించాయి. అయితే వెంటనే తేరుకున్న భారత డిఫెండర్లు చైనాను నిలువరించారు. ఇక జస్ ప్రీత్ కౌర్ పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలచడంతో తొలి అర్ధ భాగంలో భారత్ ఒక గోల్ చేయగలిగింది. ఇక రెండో అర్ధ భాగంలో చైనా దూకుడును భారత డిఫెండర్ లు సమర్ధంగా అడ్డుకోడంతో.. చైనా కేవలం ఒక్క గోల్ మాత్రమే చేయగలిగింది. ఆట ముగిసే ముందు గుర్ జిత్ కౌర్ మరో గోల్ చేయడంతో చైనా ఆధిక్యం 2కు తగ్గించగలిగింది.
పూల్ లో మూడు విజయాలతో చైనా తొలి స్ధానం సాధించి.. సెమీస్ కు చేరింది. ఇక రెండో స్ధానం భారత్, మలేషియాలు పోటీ పడుతున్నాయి. రేపు జరిగే ముఖా ముఖి మ్యాచ్ లో మలేషియా గెలిస్తే.. సెమీస్ లో అడుగుపెడుతుంది. ఒక వేళ భారత్ గెలిస్తే.. భారత్ సెమీస్ బెర్త్ దక్కించు కుంటుంది. ఈ మ్యాచ్ డ్రా అయినా.. భారత్ కే సెమీస్ బెర్త్ దక్కే అవకాశం ఉంది. ఈనెల 12 నుంచి నాకౌట్ మ్యాచ్ లు ప్రారంభమైతాయి.