ఎన్కౌంటర్లో నలుగురు మావోలు మృతి
చర్ల/మల్కన్‌గిరి: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మంగళవారం ఉదయం పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ సహా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. సుకుమా జిల్లా జేగురుగొండ– చింతల్నార్ పోలీస్ స్టేషన్ల సరిహద్దులోని బీమాపురం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో మాటువేసి ఉన్న మావోయిస్టులు పోలీసులపైకి కాల్పులు జరపడంతో, పోలీసులు సైతం ఎదురు కాల్పులకు దిగారు.
ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు హతమయ్యారు. కాల్పుల అనంతరం మృతదేహాల వద్ద ఒక ఇన్సాస్ రైఫిల్, రెండు .303 రైఫిళ్లు, ఒక బర్మార్ తుపాకీ, పేలుడు సామగ్రి,, నిత్యావసర వస్తువులు లభ్యమయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. నలుగురిలో దుధి హిడ్మా, ఆయ్‌తే అనే ఇద్దరిపై రూ.8 లక్షల చొప్పున రివార్డు కూడా ఉందని, మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని దక్షిణ బస్తర్ డీఐజీ సుందర్రాజ్ తెలిపారు.