Womens employees
-
కశ్మీర్‌కు 9 అదనపు బెటాలియన్లు
జమ్మూ: పాకిస్తాన్ చేస్తున్న వరుస షెల్లింగ్ దాడులను తిప్పికొట్టేందుకు కశ్మీర్లో కొత్తగా 9 బెటాలియన్లను ఏర్పాటుచేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్ ప్రకటించారు. అందులో రెండింటిని సున్నిత ప్రాంతాల్లో మోహరిస్తామన్నారు. జమ్మూ, కశ్మీర్‌లలో ఒక్కోటి చొప్పున 2 మహిళా బెటాలియన్లను ఏర్పాటుచేస్తామని, వీటి వల్ల సుమారు 2 వేల మంది మహిళలకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. త్వరలో ఏర్పాటుచేయబోయే ఇండియన్ రిజర్వ్ బెటాలియన్లలో స్థానికులకే 60 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. సరిహద్దుల్లో పాక్ కాల్పుల ప్రభావిత ప్రాంతాలైన ఆర్‌ఎస్‌పురా, కుప్వారా జిల్లాల్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాల్పుల సమయంలో వాడుకోవడానికి అక్కడ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల్లో స్థానికులకు రక్షణగా రూ.450 కోట్ల వ్యయంతో 14,460 బంకర్లు నిర్మిస్తామన్నారు. పాక్ షెల్లింగ్‌లో మృతిచెందిన వారి కుటుంబీకులకు పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచామని తెలిపారు. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబ బ్యాంకు ఖాతాలో వేస్తామని, ఇకపై ఈ సాయం పొందాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాల్సిన అవసరంలేదన్నారు. రాష్ట్రంలో స్థిరపడిన పశ్చిమ పాకిస్తాన్ శరణార్థుల కుటుంబాలకు రూ.ఐదున్నర లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని వెల్లడించారు. కుప్వారాలో వలసదారులు, స్థానిక ప్రతినిధులతో రాజ్‌నాథ్ సమావేశమయ్యారు. జిల్లా పోలీస్ లైన్స్ సందర్శించి అమర జవాన్లు, పోలీసులకు నివాళులర్పించారు. రాజ్‌నాథ్ వెంట కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ, కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ ఉన్నారు. రోహింగ్యాలపై సర్వే.. దేశంలో నివసిస్తున్న రోహింగ్యా ముస్లింలపై సర్వే జరపాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించామని రాజ్‌నాథ్ చెప్పారు. అలాగే వారు పౌరసత్వం పొందేలా ఎలాంటి చట్టబద్ధ పత్రాలు జారీచేయొద్దని సూచించామన్నారు. అన్ని రాష్ట్రాల నుంచి సర్వే సమాచారం వచ్చిన తరువాత రోహింగ్యాలను వెనక్కి పంపే ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ప్రాబల్యం క్రమంగా తగ్గుముఖం పడుతోందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కేవలం పది జిల్లాల్లోనే మావోయిస్టుల హింస ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అతివాదుల కార్యకలాపాలు తగ్గాయని తెలిపారు. ప్రధానికి నక్సలైట్ల ముప్పు ఉందన్న వార్తలపై స్పందిస్తూ..మోదీ భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. -
మహిళా ఉద్యోగి కంటతడి
అనంతపురం సిటీ : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలో మహిళా ఉద్యోగులపై ఉన్నతాధికారుల వేధింపులు కొనసాగుతున్నాయి. నిన్న ఐసీడీఎస్ పీడీ వెంకటేశం.. నేడు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా పరిషత్‌లోని ఆడిటింగ్ కార్యాలయంలో సరస్వతి ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం 10.20 గంటల సమయంలో కార్యాలయంలోంచి గట్టిగా ఏడుస్తూ బయటకు వచ్చారు. తోటి ఉద్యోగులు, స్థానికులు ఏమని ఆరా తీయగా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి తనపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆమె గోడు వెల్లబోసుకున్నారు. అదే పనిగా అవసరం లేని ఫైళ్లను తెప్పించుకోవడమే కాకుండా పని చేయడం సరిగా రాదంటూ మానసికంగా హింసిస్తున్నారని తెలిపారు. మహిళా ఉద్యోగికి కనీస గౌరవం ఇవ్వాలన్న ఇంగితం లేకుండా తరచూ సూటిపోటి మాటలతో మనసు గాయపరుస్తుండటంతో పరిపాలనా అధికారి (ఏఓ) రామచంద్రారెడ్డి ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందనా లేకపోయిందన్నారు. గురువారం ఉదయం వచ్చీరాగానే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ నోటికొచ్చినట్టు మాట్లాడటంతో తట్టుకోలేకపోయానని కన్నీటి పర్యంతమయ్యారు. విచారణలో వెటకారం! అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి దురుసు ప్రవర్తన గురించి బాధితురాలు సరస్వతి సాయంత్రం ఏఓ దృష్టికి తీసుకెళ్లారు. ఇరువురినీ తన ఛాంబర్లోకి పిలిపించుకున్న ఏఓ విచారణలో హుందాగా వ్యవహరించలేదు. వలవలా ఏడుస్తున్న బాధితురాలికి ధైర్యం చెప్పకుండా.. మహిళా ఉద్యోగుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో చివాట్లు పెట్టకుండా.. సమన్వయంతో పని చేసుకుని వెళ్లాలని అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌ను మందలించకుండా.. తన సీటులో వెనక్కు ఆనుకుని.. ‘ఏమ్ జరిగిందీ..’ అంటూ వెటకారంగా విచారణ మొదలు పెట్టారు. తన బాధను అర్థం చేసుకోవడం లేదని భావించిన సరస్వతి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతున్నట్లు చెప్పడంతో కంగుతిన్న అధికారులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడుతున్న అధికారి వ్యవహారంపై ఇప్పటిదాకా జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. -
వారిని అవమానించడం లైంగిక వేధింపే!
మహిళా ప్రభుత్వోద్యోగుల భద్రతపై లోక్‌సభలో కేంద్రం ప్రకటన న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను అవమానించేలా ప్రవర్తిం చడం లైంగిక వేధింపుల కిందకు రానుంది. వారిని బెదిరించడం, పనిలో జోక్యం చేసుకోవడం, ఉపాధికి హాని కలిగించేలా ప్రవర్తించడం తదితర చర్యలన్నింటినీ కేంద్రం లైంగిక వేధిం పుల పరిధిలోకి తెచ్చింది. లైంగిక వేధింపుల నిర్వచనానికి విస్తృత అర్థాన్ని చేరుస్తూ కేంద్ర సర్వీసు నిబంధనలకు ఈ నెల 19న సవరణ చేసినట్లు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్లశాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ బుధవారం లోక్‌సభలో ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ట్రిపుల్ ఐటీ బిల్లుకు ఆమోదం: అలహాబాద్, గ్వాలియర్, జబల్పూర్, కాంచీపురంలలోని ట్రిపుల్ ఐటీలను ఒకే అధికార పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం రూపొందించిన ట్రిపుల్ ఐటీ-2014 బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ఆస్తుల వివరాల వెల్లడి గడువు డిసెంబర్ 31: లోక్‌పాల్ చట్టంలోని నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వోద్యోగులంతా డిసెంబర్ 31లోగా తమ వ్యక్తిగత, కుటుంబ ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించాల్సి ఉందని ప్రభుత్వం లోక్‌సభలో ఓ ప్రశ్నకు బదులిచ్చింది. నిషేధం లేదు: జీఎం పంటల క్షేత్రస్థాయి ప్రయోగాలపై ప్రభుత్వం లేదా సుప్రీంకోర్టు నిషేధం విధించలేదని కేంద్రం లోక్‌సభకు తెలిపింది. కార్మిక చట్టాలకు సవరణలు: బాలకార్మిక వ్యవస్ధ నిరోధక చట్టం, ఫ్యాక్టరీల చట్టం, కనీస వేతనాల చట్టం సహా పలు కార్మిక చట్టాలకు సవరణలు చేపట్టే అంశాన్ని ప్రభుత్వం శ్రద్ధగా పరిశీస్తున్నట్టు కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ రాజ్యసభలో ఒక ప్రశ్నకు బదులిచ్చారు.