నిర్లక్ష్యంగా విచారణ చేస్తున్న ఏఓ రామచంద్రారెడ్డి
అనంతపురం సిటీ : మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలో మహిళా ఉద్యోగులపై ఉన్నతాధికారుల వేధింపులు కొనసాగుతున్నాయి. నిన్న ఐసీడీఎస్ పీడీ వెంకటేశం.. నేడు అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిల్లా పరిషత్‌లోని ఆడిటింగ్ కార్యాలయంలో సరస్వతి ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం 10.20 గంటల సమయంలో కార్యాలయంలోంచి గట్టిగా ఏడుస్తూ బయటకు వచ్చారు. తోటి ఉద్యోగులు, స్థానికులు ఏమని ఆరా తీయగా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి తనపట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని ఆమె గోడు వెల్లబోసుకున్నారు.
అదే పనిగా అవసరం లేని ఫైళ్లను తెప్పించుకోవడమే కాకుండా పని చేయడం సరిగా రాదంటూ మానసికంగా హింసిస్తున్నారని తెలిపారు. మహిళా ఉద్యోగికి కనీస గౌరవం ఇవ్వాలన్న ఇంగితం లేకుండా తరచూ సూటిపోటి మాటలతో మనసు గాయపరుస్తుండటంతో పరిపాలనా అధికారి (ఏఓ) రామచంద్రారెడ్డి ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందనా లేకపోయిందన్నారు. గురువారం ఉదయం వచ్చీరాగానే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ నోటికొచ్చినట్టు మాట్లాడటంతో తట్టుకోలేకపోయానని కన్నీటి పర్యంతమయ్యారు.
విచారణలో వెటకారం!
అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటరెడ్డి దురుసు ప్రవర్తన గురించి బాధితురాలు సరస్వతి సాయంత్రం ఏఓ దృష్టికి తీసుకెళ్లారు. ఇరువురినీ తన ఛాంబర్‌లోకి పిలిపించుకున్న ఏఓ విచారణలో హుందాగా వ్యవహరించలేదు. వలవలా ఏడుస్తున్న బాధితురాలికి ధైర్యం చెప్పకుండా.. మహిళా ఉద్యోగుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో చివాట్లు పెట్టకుండా.. సమన్వయంతో పని చేసుకుని వెళ్లాలని అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌ను మందలించకుండా.. తన సీటులో వెనక్కు ఆనుకుని.. ‘ఏమ్ జరిగిందీ..’ అంటూ వెటకారంగా విచారణ మొదలు పెట్టారు.
తన బాధను అర్థం చేసుకోవడం లేదని భావించిన సరస్వతి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళుతున్నట్లు చెప్పడంతో కంగుతిన్న అధికారులు ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడుతున్న అధికారి వ్యవహారంపై ఇప్పటిదాకా జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment