అత్యాచారాలపై నిరసనలు
లండన్, కొచ్చిల్లో మహిళాసంఘాల ధర్నాలు
లండన్/న్యూఢిల్లీ/కొచ్చి/షిల్లాంగ్: ఉత్తరప్రదేశ్లో ఇటీవల చోటు చేసుకున్న పలు హత్యాచార ఘటనలపై విమర్శలు, నిరసనలు, వివాదాస్పద వ్యాఖ్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళలపై భారతదేశవ్యాప్తంగా పెరుగుతన్న నేరాలు, అత్యాచార ఘటనలకు నిరసనగా దక్షిణాసియా మహిళాహక్కుల సంఘాలు, కుల వివక్ష వ్యతిరేక సంఘాలు గురువారం లండన్లోని భారతీయ దౌత్య కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బదౌన్(యూపీ)- భగానా(హర్యానా)ల్లో జరిగిన ఘటనలు పునరావృతం కావద్దంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారు.
యూపీలో మహిళలపై కొనసాగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా కేరళలోని కొచ్చిలో హైకోర్టు ముందు ఐదుగురు మహిళలు అర్థనగ్నంగా నిరసన తెలిపారు. ‘స్త్రీ కూటైమ’ సంస్థకు చెందిన ఆ మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై పెరుగుతున్న నేరాలు అత్యంత ముఖ్యమైన, సున్నితమైన సామాజికాంశాలని, వాటిని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య, ఎంపీ డింపుల్ యాదవ్ గురువారం పేర్కొన్నారు.
బదౌన్ సహా ఉత్తరప్రదేశ్లో జరిగిన అత్యాచార ఘటనలపై అఖిలేశ్, ఆయన తండ్రి ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో డింపుల్ పై విధంగా స్పందించారు. ఇదిలా ఉండగా, మహిళలపై అత్యాచారాలకు, ఇతర నేరాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలుంటాయని యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ హెచ్చరించారు. అలాగే, విధుల నిర్వహణలో విఫలమైన అధికారులు, పోలీసులపై కూడా చర్యలు ఉంటాయన్నారు.
ఐటం నెంబర్ పాటల వల్లే..
భోపాల్: దేశంలో మహిళలపై అత్యాచారాలతో పాటు, వాటికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ విషయంలో యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్, ఎస్పీ అధినేత ములాయం సింగ్ల సరసన మధ్యప్రదేశ్ హోం మంత్రి బాబూలాల్ గౌర్ కూడా చేరారు. ‘ఏ ప్రభుత్వమూ అత్యాచారాల్ని నిరోధించలేదు. ఆ ఘటన జరిగిన తరువాతే చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుంది. రేప్ అనేది ఒక సామాజిక నేరం. అది స్త్రీ, పురుషులపై ఆధారపడి ఉంటుంది.
రేప్ అనేది ఒక్కోసారి తప్పు అవుతుంది. ఒక్కోసారి ఒప్పు అవుతుంది. ఫిర్యాదు వస్తే తప్ప ఏం చేయలేం. మహిళలు కరాటే, జూడో లాంటి స్వీయరక్షణ విద్యలు నేర్చుకోవాలి. సినిమాల్లోని ఐటం నెంబర్ పాటల వల్ల కూడా వతావరణం పాడవుతోంది’ అంటూ గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి గౌర్ మరో దుమారానికి తెర లేపారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.