5 లక్షల నిర్మాణ కూలీలు కావలెను!
దుబాయ్: గల్ఫ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ లో నిర్మాణ కూలీల కొరత రియల్ ఎస్టేట్ రంగాన్ని పట్టిపీడిస్తోందని ఓ మీడియా నివేదికలో వెల్లడైంది. 2015 నాటికి నిర్మాణ కూలీల కొరత భారీగా పెరిగే అవకాశం ఉందని నివేదికలో పేర్కొన్నారు. 2015 నాటికి 5 లక్షల మంది నిర్మాణ కూలీల కొరత ఉంటుందని సర్వేలో వెల్లడైంది. ఇటీవల దుబాయ్ ఇంటర్నేషనల్ అకడమిక్ సిటీ(డీఐఏసీ), డెల్లాయిట్ కన్సల్టెన్సీ ఓ సర్వే నిర్వహించారు.
పబ్లిక్, ప్రైవేట్ ప్రాజెక్ట్ లకు ఊహించని డిమాండ్ ఏర్పడటంతో నిర్మాణ రంగంలోని అన్ని విభాగాల్లో కూలీ, ఇతర సాంకేతిక నిపుణల కొరత ఏర్పడిందని నివేదికలో తెలిపారు. డిజైన్ ఇంజనీరింగ్, మధ్య స్థాయి నిపుణుల అవసరం ఉంటుందని మల్టీ నేషనల్ కంపెనీలు తెలిపాయి. వరల్డ్ ఎక్స్ పో 2020 నిర్వహించడానికి దుబాయ్ బిడ్ గెలుచుకోవడంతో రియల్ ఎస్టేట్ రంగానికి భారీగా డిమాండ్ పెరిగింది.
పెద్ద ఎత్తున నిర్వహించే వరల్డ్ ఎక్స్ పో 2020 కు 45 వేల హోటల్ రూమ్ లు అవసరం ఉంటుందని హెచ్ ఎస్ బీసీ బ్యాంక్ తెలిపింది. వరల్డ్ ఎక్స్ పో 2020 కోసం 3.40 బిలియన్ డాలర్ల మేరకు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పనులు నిర్వహించాల్సి ఉంటుందని.. అందుచేత స్కిల్డ్ లేబర్ కు యూఏఈలో పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని తెలిపారు.