world foot ball
-
FIFA 2022: భారత్‌లో అమ్మాయిల ‘కిక్’స్టార్ట్
భువనేశ్వర్: ‘ఫిఫా’ అమ్మాయిల అండర్–17 ప్రపంచ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు సర్వం సిద్ధమైంది. 16 జట్ల మధ్య ఈనెల 30 వరకు జరిగే ఈ టోర్నీని భువనేశ్వర్, గోవా, నవీ ముంబైలలో నిర్వహిస్తారు. గ్రూప్ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో బ్రెజిల్‌తో మొరాకో తలపడనుండగా, మరో మ్యాచ్‌లో 2008 రన్నరప్ అమెరికాతో భారత్ ఎదుర్కోనుంది. ఈ వయో విభాగంలో జరుగుతున్న ఏడో ప్రపంచకప్ లో భారత్ ఆడటం ఇదే మొదటిసారి. ఆతిథ్య హోదాతో బెర్త్ లభించగా మిగతా జట్లు ఆరు కాన్ఫెడరేషన్ల టోర్నీలతో అర్హత సాధించాయి. ఆసియా నుంచి భారత్‌తో పాటు చైనా, జపాన్... ఆఫ్రికా కాన్ఫెడరేషన్ నుంచి మొరాకో, నైజీరియా, టాంజానియా... సెంట్రల్, ఉత్తర అమెరికా, కరీబియన్ల నుంచి కెనడా, మెక్సికో, అమెరికా, దక్షిణ అమెరికా నుంచి బ్రెజిల్, చిలీ, కొలంబియా, ఓసియానియా నుంచి న్యూజిలాండ్, యూరోప్ నుంచి ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. గ్రూప్ ‘ఎ’లో భారత్‌కు ప్రతీ మ్యాచ్ అగ్నిపరీక్షే! అమెరికా, బ్రెజిల్, మొరాకోలతో క్లిష్టమైన పోటీలే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూప్ దశ దాటడం అసాధ్యమే! అద్భుతాలకు ఏ మాత్రం చోటులేదు. ‘బి’ గ్రూపులో జర్మనీ, నైజీరియా, చిలీ, న్యూజిలాండ్.. ‘సి’లో స్పెయిన్, కొలంబియా, మెక్సికో, చైనా.. ‘డి’లో జపాన్, టాంజానియా, కెనడా, ఫ్రాన్స్ ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. ఈ నెల 30న ఫైనల్ జరుగుతుంది. -
పుట్‌బాల్ ప్రపంచకప్‌కు పోర్చుగల్
లిస్బన్: తన కెరీర్లో లోటుగా ఉన్న ప్రపంచకప్ టైటిల్‌ను సాధించేందుకు పోర్చుగల్ కెప్టెన్, విఖ్యాత ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోకు మరో అవకాశం లభించింది. ఈ ఏడాది నవంబర్–డిసెంబర్లలో ఖతర్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌కు పోర్చుగల్ జట్టు అర్హత పొందింది. బుధవారం జరిగిన యూరోపియన్ జోన్ ప్లే ఆఫ్ ఫైనల్లో పోర్చుగల్ 2–0 గోల్స్ తేడాతో నార్త్ మెసెడోనియా జట్టును ఓడించి ప్రపంచకప్ బెర్త్ సొంతం చేసుకుంది. పోర్చుగల్ తరఫున బ్రూనో ఫెర్నాండెజ్ (32వ, 65వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. రొనాల్డోకిది వరుసగా ఐదో ప్రపంచకప్ కానుంది. మరో ప్లే ఆఫ్ ఫైనల్లో పోలాండ్ 2–0తో స్వీడన్‌ను ఓడించి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఆఫ్రికా జోన్ నుంచి ఘనా, సెనెగల్, ట్యూనిషియా, మొరాకో, కామెరూన్ జట్లు కూడా ప్రపంచకప్ బెర్త్‌లు సంపాదించాయి. మొత్తం 32 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు 27 జట్లు అర్హత పొందాయి. జూన్ 14న జరిగే ఇంటర్ కాంటినెంటల్ ప్లే ఆఫ్ మ్యాచ్‌ల అనంతరం మిగిలిన ఐదు బెర్త్‌లు ఖరారవుతాయి. మిగిలిన ఐదు బెర్త్‌ల కోసం రేసులో ఉన్న జట్లతో కలిపి శుక్రవారం ప్రపంచకప్ ‘డ్రా’ను విడుదల చేయనున్నారు. -
బ్లాటర్‌కు చెక్
♦ రాజీనామాకు అన్నివైపుల నుంచి డిమాండ్ ♦ నేడు ఫిఫా అధ్యక్ష పదవికి ఎన్నికలు 17 సంవత్సరాలుగా ప్రపంచ ఫుట్‌బాల్‌ను కనుసైగలతో శాసిస్తున్న ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్ కష్టాల్లో పడ్డారు. మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవడానికి రంగం సిద్ధం చేసుకున్న తరుణంలో... తన సహచరుల అరెస్టులతో ఆయన కంగుతిన్నారు. బ్లాటర్ ఇకపై ఆటతో కొనసాగడానికి వీల్లేదని, తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్ పెరిగింది. జురిచ్ : ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులను విశేషంగా ఆకర్షించే క్రీడ ఫుట్‌బాల్. ఇంతటి శక్తివంతమైన క్రీడను పర్యవేక్షించే ఫిఫాలో అవినీతి ఉదంతం ఇప్పుడు తీవ్ర దుమారాన్నే రేపుతోంది. 2018 (రష్యా), 2022 (ఖతార్) ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు ఆయా దేశాలకు దక్కేందుకు లంచాలు తీసుకున్నారనే కారణంతో ఫిఫా ఉపాధ్యక్షుడితో పాటు మరో ఆరుగురిని స్విట్జర్లాండ్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫిఫాను 17 ఏళ్లుగా అంతా తానై నడిపిస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు సెప్ బ్లాటర్‌ను ఈ పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫిఫాలో ఇంత దారుణ పరిస్థితులు నెలకొంటున్నా ఇంకా పదవిని పట్టుకుని వేళ్లాడటమేమిటని అన్ని వైపుల నుంచి నిలదీస్తున్నారు. నేడు (శుక్రవారం) జరిగే అధ్యక్ష పదవి ఎన్నికల్లో ఐదో పర్యాయం ఎన్నికయ్యేందుకు 79 ఏళ్ల బ్లాటర్ సిద్ధమవుతున్నారు. కానీ ఎన్నికలకు రెండు రోజుల ముందే ఈ వ్యవహారం బయటపడడం ఆయన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. బ్లాటర్‌కు పోటీగా జోర్డాన్ ప్రిన్స్ అలీ బిన్ అల్ హుస్సేన్ పోటీ పడుతున్నారు. ఈనేపథ్యంలో అధ్యక్ష ఎన్నికలు తక్షణం వాయిదా వేయాలని యూరోపియన్ సమాఖ్య (యూఈఎఫ్ఏ) డిమాండ్ చేస్తోంది. ‘అవినీతి ఉదంతం ఫిఫాను అధోగతి పాలు చేసింది. ఫుట్‌బాల్ క్రేజ్‌ని కూడా ఇది దారుణంగా దెబ్బతీసింది. ఇప్పుడు ఎన్నికలు వాయిదా వేసి ఆరునెలల్లోగా జరపాలి’ అని యూఈఎఫ్ఏ ప్రధాన కార్యదర్శి గియాని ఇన్ఫాంటినో అన్నా రు. మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్ కూడా బ్లాటర్పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. ‘బ్లాటర్ గెటవుట్’ అంటూ ప్రపంచ మీడియా తమ తొలి పేజీలో కథనాలను గుప్పించింది. ఇదిలావుండగా రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం బ్లాటర్‌కు మద్దతుగా నిలిచారు. ఫిఫాలో అవినీతి విచారణపై ఎఫ్‌బీఐ లోపభూయిష్టంగా పనిచేసిందని విమర్శించారు. స్పాన్సర్ల గుస్సా.. ఫుట్‌బాల్‌లో మిలియన్ల కొద్ది డబ్బులను గుమ్మరిస్తున్న ప్రధాన స్పాన్సర్లు కూడా తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. కోకా కోలా, వీసా, అడిడాస్, మెక్‌డొనాల్డ్స్ ఇందులో ఉన్నాయి. ఫిఫాలో పరిస్థితులు మారకపోతే తమ ఒప్పందాలను రద్దు చేసుకుంటామంటూ కటువుగా వ్యాఖ్యానించాయి. ఫిఫా సమాఖ్యలతో బ్లాటర్ భేటి జరుగుతున్న పరిమాణాలపై ఫిఫాకు చెందిన ఆరు సమాఖ్యల అధ్యక్షులతో బ్లాటర్ గురువారం సమావేశమయ్యారు. అయితే చర్చల వివరాలు బయటికి రాలేదు కానీ కొందరు ఆయన్ని పదవి నుంచి దిగిపోవాలని అడిగినట్టు సమాచారం. అయితే ఎన్నికల్లో ఇప్పటికీ ఆయనే ఫెవరెట్‌గా కనిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే... 2010లో ఫిఫా ఎగ్జిక్యూటివ్ కమిటీలో 2018, 2022 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ నిర్వహణ హక్కుల కోసం బిడ్డింగ్ జరిగింది. ఓటింగ్‌లో 2018 టోర్నీ కోసం రష్యా.. 2022 టోర్నీ కోసం ఖతార్ నిర్వహణ హక్కులు గెలుచుకున్నాయి. అయితే ఈ వ్యవహారం వెనుక చాలా పెద్ద స్థాయిలోనే డబ్బులు చేతులు మారాయని ఆరోపణలు వినిపించాయి. సభ్య దేశాలకు చెందిన అధికారులు ఈ రెండు దేశాలకు అనుకూలంగా ఓటేయడానికి మిలియన్ల డాలర్లను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం స్విస్ పోలీస్ అధికారులు ఈ బిడ్డింగ్‌లో పాల్గొన్న 10 మంది ఫిఫా ఎగ్జిక్యూటివ్ అధికారులను విచారిస్తున్నారు. కొన్ని బ్యాంకు రికార్డులను, ఇతర ఫైళ్లను కూడా సీజ్ చేశారు. అలాగే 2010లో దక్షిణాఫ్రికాలో జరిగిన టోర్నీ కోసం కూడా 10 మిలియన్ డాలర్లను లంచాల రూపంలో తీసుకున్నట్టు యూఎస్ పరిశోధక సంస్థ తెలిపింది. ప్రసార హక్కుల కోసం కూడా... ఇక ఫుట్‌బాల్ ప్రసార హక్కులను దక్కించుకునేందుకు స్పోర్ట్ బ్రాడ్కాస్ట్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ 150 మిలియన్ డాలర్ల (రూ.958 కోట్లు)కు పైగానే ఫిఫా, కాంకాకాఫ్ (మధ్య, ఉత్తర అమెరికా) అధికారులకు లంచాల రూపంలో చెల్లించినట్టు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపించింది. 1991 నుంచే ఈ భాగోతం సాగుతున్నట్టు వారి విచారణలో తేలింది. నిందితులు దోషులుగా నిర్ధారణ అయితే 20 ఏళ్ల జైలు శిక్ష పడొచ్చు. -
పీలే కుమారుడికి 33 ఏళ్ల జైలు
సావోపాలో: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న పీలేకు నిజంగా ఇది చేదువార్తే. ఆయన కుమారుడు ఎడిన్హోకు బ్రెజిల్ కోర్టు 33 ఏళ్ల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ సరఫరా ద్వారా సమకూరిన డబ్బును అక్రమంగా రవాణా చేస్తున్నందుకు తను ఈ శిక్షను ఎదుర్కోనున్నాడు. 1990ల్లో సాంటోస్ క్లబ్ తరఫున ఎడిన్హో గోల్ కీపర్‌గా వ్యవహరించాడు. అయితే తాను డ్రగ్స్‌కు బానిసనే కానీ ఆ మాఫియాతో కలిసి పనిచేయడం లేదని 43 ఏళ్ల ఎడిన్హో వాదిస్తున్నాడు. మరోవైపు అతడికి డ్రగ్స్ డాన్ రొనాల్డో నాల్డిన్హోతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ శిక్షపై ఎడిన్హో పైకోర్టులో అప్పీల్ చేసుకోనున్నాడు. పీలేకు అతను మూడో సంతానం.