World Masters Tournament
-
‘పరుగుల అవ్వ’.. వయసు 95.. పోలాండ్‌లో పరుగుకు రెడీ
భగవాని దేవిని అందరూ ‘పరుగుల అవ్వ’ అంటారు. వయసు 95కు చేరినా ఆమె ఉత్సాహంగా పరుగు తీస్తోంది.. మెడల్స్ సాధిస్తోంది. 35 ఏళ్లు దాటిన వారి కోసం నిర్వహించే ‘వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఇండోర్ ఛాంపియన్షిప్స్’ కోసం ఇప్పుడు ఆమె పోలాండ్‌లో ఉంది. ‘గోల్డ్ మెడల్ తెస్తాను ఉండండి’ అంటోంది. వంద మీటర్ల దూరాన్ని మీరు ఎన్ని సెకన్లలో పరిగెడతారు? హుసేన్ బోల్ట్ 9.58 సెకన్లలో పరిగెత్తాడు. టీనేజ్ పిల్లలు చురుగ్గా ఉంటే పదిహేను సెకన్లలో పరిగెడతారు. ఇరవై ఏళ్లు దాటిన వారు ఇరవై సెకన్లు తీసుకోక తప్పదు. మరి 90 దాటిన వారు? ఫిన్లాండ్లో గత ఏడాది జరిగిన వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో భగవాని దేవి (94) వంద మీటర్లను కేవలం 24.74 సెకన్లలో పరిగెత్తింది. అది మన నేషనల్ రికార్డ్. ఆ రికార్డ్‌తో గోల్డ్ మెడల్ సాధించింది భగవాని దేవి. ఇప్పుడు ఆమెకు తొంభై ఐదు ఏళ్లు. మార్చి 25 నుంచి 31 వరకు పోలాండ్లోని టోరౌలో వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు విమానంలో బయలుదేరింది. పోయిన సంవత్సరం ఫిన్లాండ్కు పది గంటలు ప్రయాణించడం ఆమెకు కష్టమైంది. అందుకే ఈసారి స్పాన్సరర్లు ఆమెకు బిజినెస్ క్లాస్ బుక్ చేసి మరీ పంపించారు. ఆమె మెడల్ కొట్టకుండా వెనక్కు రాదని వాళ్ల గట్టి నమ్మకం. హర్యానా దాదీ భగవాని దేవిది హర్యానాలోని ఖేడ్కా అనే గ్రామం. పన్నెండు ఏళ్లకు పెళ్లయితే ముప్పై ఏళ్లు వచ్చేసరికల్లా వితంతువు అయ్యింది. పుట్టిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు చనిపోగా మిగిలిన ఒక్క కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకోకుండా సేద్యం చేసి కొడుకును పెంచింది భగవాని దేవి. చదువుకున్న కొడుకు ఢిల్లి మునిసిపల్ కార్పొరేషన్లో ఉద్యోగిగా మారడంతో ఢిల్లీ చేరుకుంది. ఆ తర్వాత నానమ్మ (దాదీ) అయ్యింది. ముగ్గురు మనవల్లో వికాస్ డాగర్ క్రీడల్లో గుర్తింపు సంపాదించాడు. అతడే తన దాదీలో ఆటగత్తె ఉందని గ్రహించాడు. ‘ఒకరోజు నేను షాట్ పుట్ ఇంటికి తెచ్చాను. నువ్వు విసురుతావా నానమ్మా అని అడిగితే మొహమాట పడింది. కాని మరుసటి రోజు ఉదయం ఆమె దానిని విసరిన తీరు చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని తెలిపాడు వికాస్. ఆ తర్వాత అతడే తన దాదీకి కోచ్‌గా మారి ఆమెను అథ్లెట్‌ను చేశాడు. ‘చిన్నప్పుడు కబడ్డీ ఆడటం తప్ప నాకు వేరే ఏం గుర్తు లేదు’ అని నవ్వుతుంది భగవాని దేవి. బైపాస్ ఆపరేషన్ జరిగినా భగవాని దేవికి 2007లో బైపాస్ ఆపరేషన్ జరిగింది. అయినా సరే ఆమె పూర్తి ఆరోగ్యంగా, చురుగ్గా ఉంది. పరిగెడితే అలసిపోదు. వేరే ఏ ఇబ్బందులు లేవు. అందువల్ల త్వరలోనే ఆమె వయోజనులకు పెట్టే పోటీల్లో పతకాలు సాధించడం మొదలెట్టింది. కాని గత ఏడాది ఫిన్లాండ్లో గోల్డ్ మెడల్ సాధించడంతో ఆమెకు విశేష గుర్తింపు వచ్చింది. ‘నాకు ఏదైనా అవుతుందని భయపడవద్దు. దేశం కోసం పరుగెట్టి ప్రాణం విడిచినా నాకు సంతోషమే’ అని చెప్పి బయలుదేరిందామె పోయినసారి. ఈసారి కూడా ఆ స్ఫూర్తి చెక్కుచెదరలేదు. సెంచరీ వయసులోనూ పరిగెడతాను’ అంటుంది భగవాని దేవి. -
బంగారు ‘బామ్మ’
⇒101 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లో స్వర్ణం ⇒ప్రపంచ మాస్టర్స్ టోర్నీలో మన్ కౌర్ ఘనత ఆక్లాండ్: సెంచరీ వయసు దాటినవాళ్లే మనకు చాలా అరుదుగా కనిపిస్తారు. అలా ఎవరైనా ఉన్నా... అది ఇల్లు దాటడం కూడా అసాధ్యంగా మారిపోయే దశ! అలాంటిది సముద్రాలు దాటి ఒక పరుగు పందెంలో పోటీ పడటం, అక్కడ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోవడం మాటలు కాదు. కానీ చండీగఢ్‌కు చెందిన 101 ఏళ్ల బామ్మ మన్ కౌర్ దానిని చేసి చూపించింది. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడల్లో 100 మీటర్ల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. ఈ పరుగును కౌర్ ఒక నిమిషం 14 సెకన్లలో పూర్తి చేసింది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమిటంటే 100 ప్లస్ వయో విభాగం కేటగిరీలో మన్ కౌర్ తప్ప మరెవరూ పోటీ పడలేదు! అయితే దీనికీ ఆమె వద్ద సమాధానం సిద్ధంగా ఉంది. ‘పతకం సాధించడం కోసం కాలంతో పరుగెత్తి పోటీ పడటం నాకు ముఖ్యం కాదు. ఇక్కడ పాల్గొనడమే నా దృష్టిలో గొప్ప విజయం. ఈ పరుగులో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. నేను దీంతో ఆగిపోను. పరుగెత్తడం ఆపను. వయసుతో సంబంధం లేకుండా అందరికీ స్ఫూర్తినివ్వాలనేదే నా పరుగు ఉద్దేశం’ అని ఆమె గర్వంగా చెప్పింది. మన్ కౌర్ ఎనిమిదేళ్ల క్రితమే 93 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లోకి అడుగు పెట్టింది. ఈ పతకంతో ఆగిపోకుండా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 200 మీటర్ల పరుగు, 2 కిలోల షాట్‌పుట్, 400 గ్రామ్‌ల బరువున్న జావెలిన్ ఈవెంట్లలో పాల్గొనేందుకు మన్ కౌర్ సన్నద్ధమైంది.