⇒101 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లో స్వర్ణం
⇒ప్రపంచ మాస్టర్స్ టోర్నీలో మన్ కౌర్ ఘనత
ఆక్లాండ్: సెంచరీ వయసు దాటినవాళ్లే మనకు చాలా అరుదుగా కనిపిస్తారు. అలా ఎవరైనా ఉన్నా... అది ఇల్లు దాటడం కూడా అసాధ్యంగా మారిపోయే దశ! అలాంటిది సముద్రాలు దాటి ఒక పరుగు పందెంలో పోటీ పడటం, అక్కడ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోవడం మాటలు కాదు. కానీ చండీగఢ్‌కు చెందిన 101 ఏళ్ల బామ్మ మన్ కౌర్ దానిని చేసి చూపించింది. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడల్లో 100 మీటర్ల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. ఈ పరుగును కౌర్ ఒక నిమిషం 14 సెకన్లలో పూర్తి చేసింది. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ ఏమిటంటే 100 ప్లస్ వయో విభాగం కేటగిరీలో మన్ కౌర్ తప్ప మరెవరూ పోటీ పడలేదు! అయితే దీనికీ ఆమె వద్ద సమాధానం సిద్ధంగా ఉంది.
‘పతకం సాధించడం కోసం కాలంతో పరుగెత్తి పోటీ పడటం నాకు ముఖ్యం కాదు. ఇక్కడ పాల్గొనడమే నా దృష్టిలో గొప్ప విజయం. ఈ పరుగులో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. నేను దీంతో ఆగిపోను. పరుగెత్తడం ఆపను. వయసుతో సంబంధం లేకుండా అందరికీ స్ఫూర్తినివ్వాలనేదే నా పరుగు ఉద్దేశం’ అని ఆమె గర్వంగా చెప్పింది. మన్ కౌర్ ఎనిమిదేళ్ల క్రితమే 93 ఏళ్ల వయసులో అథ్లెటిక్స్‌లోకి అడుగు పెట్టింది. ఈ పతకంతో ఆగిపోకుండా మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో 200 మీటర్ల పరుగు, 2 కిలోల షాట్‌పుట్, 400 గ్రామ్‌ల బరువున్న జావెలిన్ ఈవెంట్లలో పాల్గొనేందుకు మన్ కౌర్ సన్నద్ధమైంది.
బంగారు ‘బామ్మ’
Published Tue, Apr 25 2017 1:42 AM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM
Advertisement