World Vegetarian Day
-
నేడు వరల్డ్ వేగన్స్ డే... ఆ పదం ఎలా వచ్చిందో తెలుసా?
‘ఒక దేశం గొప్పతనం, నైతిక ప్రగతి... ఆ దేశం జంతువుల పట్ల వ్యవహరించే తీరును బట్టి ఉంటుంది’ అంటారు మహాత్మాగాంధీ! అట్లా జంతువుల మీద ప్రేమ కొంత, సొంత ఆరోగ్యంపట్ల శ్రద్ధ మరికొంత... మొత్తంగా వేగనిజం మీద ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది వేగన్స్‌గా మారిపోతున్నారు. నేడు (సోమవారం) వరల్డ్ వేగన్ డే సందర్భంగా ‘వేగనిజం’ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం! వేగన్స్ అంటే? మాంసాహారం మాత్రమే మానేసినవాళ్లు శాకాహారులు. కానీ జంతువుల నుంచి వచ్చే పాలు, పెరుగువంటి ఉత్పత్తులను కూడా తీసుకోకుండా, కేవలం మొక్కలు, ఆకుల మీద ఆధారపడి బతికేవారు వేగన్స్. జంతువుల హక్కుల న్యాయవాది డోనాల్డ్ వాట్సన్ వెజిటేరియన్ అనే పదం నుంచి వేగన్‌ను సృష్టించాడు. 1944లో ‘ది వేగన్ సొసైటీ’ని స్థాపించాడు. ఆ వేగన్ సొసైటీ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 1994 నుంచి ప్రతి ఏటా నవంబర్ 1న వరల్డ్ వేగన్ డే నిర్వహిస్తున్నారు. నవంబర్ నెలను వేగన్ మంత్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. పోషకాల కొరతేం లేదు.. వేగన్‌గా మారతాం సరే... శరీరానికి పోషకాలు అందేదెలా? ప్రోటీన్ మాటేమిటి? చాలా మంది ప్రశ్న. కానీ శరీరానికి అత్యవసరమైన అమినో యాసిడ్స్ అన్నీ ఆకుకూరలు, కూరగాయల్లో దొరుకుతాయంటారు వేగన్స్. మాంసాహారం, పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉన్నవారికి .. టోఫు, బాదం పాలు, సోయాపాలు, కొబ్బరిపాలు, బియ్యంపాలు వంటివాటిని ప్రత్యామ్నాయంగా చూపుతున్నారు. ఛీజ్, మయోనీజ్ సైతం... పాలు, గుడ్లు లేకుండా తయారు చేసుకోవచ్చట. ప్రత్యామ్నాయంగా శాకాహార మాంసం! ముక్కలేనిదే ముద్దదిగని వాళ్లు కొంతమంది ఉంటారు. ఎంత వద్దనుకున్నా ఏదో ఒకరకంగా మాంసాహారం ఊరిస్తూనే ఉంటుంది. మాంసాహారం తినేటప్పుడు ఎక్కువ నములుతాం. నోటి నిండా ఎక్కువ సమయం పదార్థ్ధాన్ని ఫీల్ అవుతాం. మాంసాహారం పంటికి సరిపోయే బైట్ స్ట్రెంత్ కలిగి ఉంటుంది. శాకాహారంతో అది ఉండదు. చాలామంది నాన్‌వెజ్ వదలకపోవడానికి కారణమిదే. కానీ... ఇలాంటివారికోసం మొక్కల నుంచి ప్రత్యామ్నాయం దొరుకుతుందట. అదే వెజ్ మీట్. మాంసం టెక్చర్‌తోపాటు... పంటికి మాంసం తిన్న ఫీలింగ్‌ని ఇస్తుంది. మొక్కల నుంచి వచ్చే మాంసందే భవిష్యత్ అని చెబుతున్నది... ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న నటి జెనీలియా. వీటితో సీక్ కబాబ్, చికెన్ నగ్గెట్, బిర్యానీ, బర్గర్పాటీస్, సాసేజెస్ వంటివి చేసుకోవచ్చట. లాభాలెన్నో.. వేగన్స్‌గా మారడం వల్ల జంతువులను రక్షించినవాళ్లమే కాక... పర్యావరణాన్ని పరిరక్షించినవాళ్ల మవుతామంటున్నారు. వేగన్‌గా మారడం వల్ల 15 రకాల ప్రాణహాని కారక వ్యాధులకు దూరంగా ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఆహారంలో కొలెస్ట్రాల్ తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె జబ్బులు, టైప్ టు డయాబెటిస్, క్యాన్సర్స్, ఆర్థ్రరైటిస్, ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులేవీ దరిచేరవంటున్నారు. బరువు పెరగరు, మానసిక ఆరోగ్యానికి సైతం ఇదే మందంటున్నారు. సెలబ్రిటీస్‌తో పాపులారిటీ... ఏటా వేగనిజం పాపులారిటీ పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా, మన దేశంలోనూ చాలామంది సెలబ్రిటీస్ ఇప్పుడు వేగన్స్‌గా మారిపోయారు. బాలీవుడ్ స్టార్స్ ఆమిర్‌ఖాన్, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్, సోనమ్ కపూర్, అనుష్క శర్మ, శ్రద్ధా కపూర్, కంగనా రనౌత్, వంటి మాంసాహారం ముట్టబోమని ఒట్టు పెట్టుకున్నారు. ►ప్రపంచ జనాభాలో 5శాతం శాఖాహారులు. అందులో సగం వేగన్స్.నో మీట్ పాలసీలో భాగంగా 2012 నుంచి లాస్ ఏంజిల్స్‌లో ప్రతి సోమవారం మాంసాహారం విక్రయించరు. 2020లో కేఎఫ్‌సీ మొట్టమొదటి వేగన్ బర్గర్‌ను తయారు చేసింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
శాకాహారం అద్భుతః
ఆహారాన్ని సెలబ్రేట్ చేసుకోవడం కొందరికే వచ్చు. కొంచెం అల్లం పచ్చడి, వేడి వేడి పెసరట్టు తోటకూర పప్పు, ఆలుగడ్డ తాలింపు, పాల తోటకూర, చింత తొక్కు సృష్టిలో ఆహారాన్ని ఎంచుకుని దానిని రుచి రంజకంగా చేసుకొని బతకడం తెలిసిన వారున్నారు. తాము అనుకునే విలువలను పాటించేవారున్నారు. జంతు సముదాయాలను బాధించకుండా దొరికే ఆహారం మాత్రమే తినేవారిని ‘వేగన్స్’ అని వీగన్స్ అని అంటారు. రేపు ప్రపంచ శాకాహార దినోత్సవం. వారి రుచి, అభిరుచి గురించి మాట్లాడుకోవాల్సిన రోజు. వారి వాదనను తెలుసుకోవాల్సిన రోజు. తెలుగులో నటించిన హీరోయిన్ జెనిలియా తెలుసుగా. ఆమె భర్త నటుడు రితేష్ దేశ్‌ముఖ్. ఇటీవల వారు భారతదేశంలో ‘మాక్ మీట్’ పరిశ్రమను స్థాపించారు. ‘మాక్ మీట్’ అంటే ‘వెజిటేరియన్ మీట్’. అంటే మాంసంలా కనిపించే మాంసం. మొక్కల నుంచి తయారు చేస్తారు. ‘భవిష్యత్తులో ప్రజలు శాకాహారంవైపుకు ఎక్కువగా మొగ్గు చూపుతారని, ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో మాక్ మీట్‌కు డిమాండ్ పెరిగిందని, దేశంలో కూడా పెరుగుతుందని’ వారు ఈ సందర్భంగా చెప్పారు. శాకాహారాన్ని ఎంచుకునేవారు, జీవితంలో జీవహింసా రాహిత్యాన్ని సాధన చేసే వారు ‘వేగన్స్’ అవుతారు. మానవతావాదిని ‘హ్యుమానిటేరియన్’ అంటారు. వెజిటెబుల్స్‌ను మాత్రమే ఆహారంగా తీసుకునేవారిని వెజిటేరియన్ అంటారు. క్రమంగా ఆ మాటే వేగన్ అయ్యింది. ‘వీగన్’ అనీ అంటారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మాటను బ్రిటిష్ సంస్కరణవాది ఫాని కెంబల్ వ్యాప్తిలోకి తెస్తే, ప్రపంచ శాకాహారుల దినోత్సవం (వరల్డ్ వేగన్ డే)ను ఇంగ్లిష్ రచయిత్రి లూయిస్ వాలిస్ 1994 నుంచి వ్యాప్తిలోకి తెచ్చింది. మన దేశమే పుట్టినిల్లు శాకాహార ఉద్యమానికి భారత దేశమే పుట్టినిల్లు. సింధూ నాగరికతలో ఈ భావన, జీవహింసను వ్యతిరేకించడం మొదలైందని చరిత్రకారుల పరిశీలన. ఆ తర్వాత మన దేశంలో వచ్చిన జైన, బౌద్ధ మతాలు శాకాహారాన్ని గట్టిగా ప్రచారం చేశాయి. మత సంబంధమైన నాటి క్రతవుల్లో వందల వేల కొద్ది జంతువుల వధ జరుగుతుండటాన్ని నిరసించి జైన, బౌద్ధాలు జీవ హింసను వ్యతిరేకించాయి. శాకాహారాన్ని ప్రచారం చేశాయి. ఈ మతాల ప్రాబల్యం గమనించిన వైదిక మత అవలంబికులు క్రమంగా బలులను నిషేధించుకుంటూ, ఆహార వ్యవహారాలను కూడా మార్చుకున్నారని కూడా చరిత్రకారులు అంటారు. ఆ విధంగా మన దేశంలో పుట్టిన శాకాహార ఉద్యమం క్రమంగా నేడు ప్రపంచమంతా వ్యాపించింది. వరల్డ్ వేగన్ డేను ప్రచారంలోకి తెచ్చిన లూయిస్ వాలిస్ ఆహార హింస– జీవ హింస మనిషి తన ఆహారం కోసం జీవులను హింసించడం వేగన్స్‌కు ఇష్టం ఉండదు. వీరు ఒక రకం. అసలు మానవ సకల వ్యవహారాల్లోనూ జీవ హింస లేకుండా ఉండాలనే వేగన్స్ ఉంటారు. వీరు మరో రకం. మొదటి రకం వారు కేవలం ఆహారం విషయంలోనే తమ వ్రతం పాటిస్తే రెండో రకం వారు జీవితంలో కూడా పాటిస్తారు. మొదటి రకం వారు జంతువుల నుంచి, జీవుల నుంచి వచ్చే పాలు, గుడ్లు, నెయ్యి, నూనె, దుస్తులు, వాడుక వస్తువులు వేటినీ తీసుకోరు. రెండో రకం వారు ఇళ్లల్లో కుక్కలను, పక్షులను పెంచడం కూడా హింస అనుకుంటారు. వ్యవసాయానికి ఎడ్లు ఉపయోగించడం, రవాణాకు గుర్రాలను ఉపయోగించడం కూడా హింసే అనుకుంటారు. వాటిని అవాయిడ్ చేస్తారు. జంతువుల కొవ్వును ఉపయోగించి తయారు చేసే సాధారణ సబ్బులను కూడా వీళ్లు వ్యతిరేకిస్తారు. వీళ్లు కాకుండా మూడో రకం వారు పర్యావరణ శాకాహారులు. వీరు ఒక ఉత్పత్తిగా జీవులను ఉత్పత్తి చేయడానికి పర్యావరణ హింసగా భావిస్తారు. అంటే కోళ్లను, గొర్రెలను, ఇతర ఆహారానికి ఉపయోగపడే జీవులను పౌల్ట్రీలుగా, ఫార్మ్స్‌గా వ్యాపారదృష్టితో చేయడాన్ని వ్యతిరేకిస్తారు. లండన్ వెజిటేరియన్ సొసైటీ సభ్యులతో గాంధీజీ.. గాంధీ గారు కూడా ప్రచారకర్తే అమెరికాలో, యూరోపియన్ దేశాలలో 2010 నుంచి ‘వేగన్ స్టోర్స్’ మొదలయ్యాయి. ‘వెజిటేబుల్ బుచర్’ స్టోర్స్ అంటే శాకాహార మాంసం అమ్మే స్టోర్లు మొదలయ్యాయి. అక్కడ ‘బియాండ్ మీట్’ అనే సంస్థ అచ్చు బీఫ్ లాంటి, అచ్చు చికెన్ లాంటి కృత్రిమ పదార్థాలను తయారు చేసి అమ్ముతోంది. అమెరికాలోని స్కూళ్లు ‘మా దగ్గర పిల్లలకు వేగన్ మీల్స్ ఇస్తాము’ అని ప్రచారం చేసుకుంటున్నాయి. చాలామంది గొప్పవాళ్లు శాకాహారాన్ని ప్రచారం చేయడం వల్ల ఇదంతా సాధ్యమైందని అనే వారున్నారు. గాంధీజీ కూడా శాకాహారాన్ని ప్రచారం చేశారు. ఆయన లండన్ ‘వెజిటేరియన్ సొసైటీ’లో కార్యవర్గ సభ్యుడుగా పని చేశారు. ‘శాకాహారం కేవలం ఆరోగ్య విలువగా కాకుండా నైతిక విలువగా కూడా ప్రచారం కావాలి’ అని ఆయన కోరుకున్నారు. ప్రత్యామ్నాయం జీవులను హింసించని ఆహారం తీసుకోవాలని సంకల్పించిన వేగన్స్ తమ రుచిని కోల్పోదలుచుకోలేదు. తన భోజన సంబరాన్ని కోల్పోదలుచుకోలేదు. తమ సెలబ్రేషన్‌కు దూరం కాదలుచుకోలేదు. అందుకే ఆరోగ్యాన్ని నిలబెట్టే ‘వేగన్ డైట్’ను ప్రతి దేశంలో ఆ దేశంలో దొరికే శాకాహార పదార్థాలతో తయారు చేసి ప్రచారం చేసుకున్నారు. ఎందుకంటే శరీరానికి అన్ని పోషకాలు అవసరం. ‘హింసా రహిత పదార్థాలలో’ అన్ని పోషకాలు దొరక్కపోవచ్చు. తెలిసీ తెలియక అదే ఆహారాన్ని కొనసాగిస్తే కటువైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే శాకాహారం తీసుకోవాలనే సంకల్పంతో పాటు దానికి అవసరమైన చైతన్యం కూడా కావాలని వేగన్స్ అంటారు. వీరు తమ కోసం మాక్ మీట్‌ను ఉపయోగించడం, ప్లాంట్ మిల్క్ (నీటి మొక్కల నుంచి సేకరించింది)ను వాడటం చేస్తున్నారు. మన దగ్గర వేల రుచులు భారతీయులు అందునా తెలుగువారు శాకాహారంలో తిరుగులేని రుచులను కనిపెట్టినవారు. సమస్త పోషకాలను రంగరించుకుంటూ ఆరోగ్యానికి దానినొక వాహకంగా సాధన చేస్తున్నవారు. తెలుగు శాకాహార వంటలు తినడం ప్రారంభిస్తే విసుగు లేకుండా ఒక జీవితకాలం గడిచిపోతుంది. కూరలు, తాలింపులు, చార్లు, ఇగురులు, పులుసులు, పప్పులు... ఎన్నని. విస్తరిలో వాటి కళ వేరు. జిహ్వకు వైభోగం వేరు. ఆహారం లేకపోతే మనిషి లేడు. తన మనుగడ కోసం మనిషి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉన్నాడు. అయితే కాల మాన సామాజిక పరిస్థితుల అనుసారం ఆ అలవాట్ల ‘విలువ’ మారుతూ వచ్చింది. ఇప్పటి కాలానికి ‘వేగనిజమ్’ ఒక విలువగా ఉంది. వీగన్స్ తాత్త్వికతను గౌరవిస్తూ ఇవాళ శాకాహార భోజనం చేయడం మంచి పనే కదా. – సాక్షి ఫ్యామిలీ -
శాకం శరణం గచ్ఛామి
నవంబర్ 1 ప్రపంచ శాకాహార దినోత్సవం ‘తిండి కలిగితె కండగలదోయ్... కండ గలవాడేను మనిషోయ్’ అన్న మహాకవి మాట అక్షర సత్యమే. అయితే, కండబలం పెంచుకోవడానికి మాంసాహారమే తినక్కర్లేదు. శుభ్రంగా శుద్ధ శాకాహారాన్ని సంతుష్టిగా తింటూ పుష్టిగా కండబలానికి లోటు లేకుండా బతకవచ్చని నిరూపిస్తున్న శాకాహారుల సంఖ్య ప్రపంచంలో నానాటికీ పెరుగుతూ వస్తోంది. ఎక్కువగా మాంసాహారంపైనే ఆధారపడే పాశ్చాత్య దేశాల్లో సైతం గడచిన దశాబ్ద కాలంగా శాకాహారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పెరుగుతున్న శాకాహారులు హిందువులు, బౌద్ధులు, జైనులు ఎక్కువగా ఉండే భారత్, నేపాల్, భూటాన్, శ్రీలంక తదితర దేశాలలో శాకాహారుల జనాభా మొదటి నుంచి ఎక్కువగానే ఉంటోంది. మాంసాహారంపై మతపరమైన ఆంక్షలేవీ లేని పాశ్చాత్య ప్రపంచంలో మాత్రం శాకాహారుల జనాభా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఆరోగ్య స్పృహ, పర్యావరణ స్పృహ పెరగడమే ఈ పరిణామానికి కారణమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ‘పెటా’ వంటి సంస్థల ప్రచారం వల్ల జంతువులపై హింసను వ్యతిరేకించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరగడం కూడా ఈ పరిస్థితికి కారణమవుతోంది. మాంసాహారులు ఎక్కువగా ఉండే స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్, ఇజ్రాయెల్ వంటి యూరోపియన్ దేశాల్లో గడచిన దశాబ్ద కాలంలో వెజిటేరియన్ రెస్టారెంట్ల సంఖ్య రెట్టింపు కావడమే దీనికి నిదర్శనం. తాజా అంచనాల ప్రకారం బ్రిటన్‌లో దాదాపు 12 శాతం, స్వీడన్లో సుమారు 10 శాతం, ఇజ్రాయెల్‌లో, అమెరికాలో దాదాపు 4 శాతం ఉన్నారు. ముఖ్యంగా ఈ దేశాల్లో ఎక్కువగా యువతరం జనాభా క్రమంగా మాంసాహారానికి దూరమవుతుండటం విశేషం. మాంసాహారంతో పర్యావరణ సమస్యలు మాంసాహారం వల్ల పర్యావరణానికి చాలా సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మాంసాహారం పరోక్షంగా నీటి ఎద్దడికి దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఒక కిలో మాంసం వినియోగదారుడికి అందాలంటే దాదాపు 15,500 లీటర్ల నీరు అవసరమవుతుందని అంటున్నారు. ఇప్పటికే ప్రపంచంలో దాదాపు 70 శాతం మంచినీరు మాంసాహారానికి ఉపయోగపడే జంతువుల కోసం పచ్చిక పెంచడానికే సరిపోతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి ఎద్దడి తీవ్రమయ్యే ప్రమాదం లేకపోలేదని వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) హెచ్చరిస్తోంది. బహుశ ఈ హెచ్చరికలు కూడా ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా శాకాహారుల జనాభా పెరగడానికి దోహదపడి ఉంటాయని భావిస్తున్నారు. శాకాహారమూ బలవర్ధకమే ఆకులు అలములు, కాయలు పండ్లతో కూడిన శాకాహారంలో ఎలాంటి బలం ఉండదనేది అపోహ మాత్రమేనని పలు పరిశోధనలు ఇప్పటికే రుజువు చేశాయి. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా గింజలు, పప్పుధాన్యాలు తీసుకున్నట్లయితే పుష్కలంగా శరీరానికి కావలసిన మాంసకృత్తులు లభిస్తాయి. పశుసంపద నుంచి సేకరించే పాలకు బదులుగా సోయా పాలు వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించే శుద్ధ శాకాహారులు సైతం నిక్షేపంగా బతుకుతున్నారు. ఆకు కూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి సూక్ష్మ పోషకాలు పుష్కలంగా లభిస్తాయని, మాంసం సహా ఇతర జంతు ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా శుద్ధ శాకాహారం తీసుకుంటూ జీవించినా ఆరోగ్యానికి ముప్పేమీ ఉండదని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. శాకాహారం వల్ల శరీర దారుఢ్యానికి ఎలాంటి లోటు ఉండదని పలువురు క్రీడాకారులు తాము సాధించిన విజయాలతో ఇప్పటికే ప్రపంచం కళ్లు తెరిపించారు. జర్మన్ వెయిట్ లిఫ్టర్ పాట్రిక్ బాబోమియాన్, ఆస్ట్రేలియన్ బాడీబిల్డర్ బిల్లీ సిమ్మండ్స్ తదితరులు శుద్ధ శాకాహారులే.