శాకాహారం అద్భుతః | Special Story On World Vegetarian Day | Sakshi
Sakshi News home page

శాకాహారం అద్భుతః

Published Sat, Oct 31 2020 8:48 AM | Last Updated on Sat, Oct 31 2020 8:48 AM

Special Story On World Vegetarian Day - Sakshi

ఆహారాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం కొందరికే వచ్చు. కొంచెం అల్లం పచ్చడి, వేడి వేడి పెసరట్టు తోటకూర పప్పు, ఆలుగడ్డ తాలింపు, పాల తోటకూర, చింత తొక్కు సృష్టిలో ఆహారాన్ని ఎంచుకుని దానిని రుచి రంజకంగా చేసుకొని బతకడం తెలిసిన వారున్నారు. తాము అనుకునే విలువలను పాటించేవారున్నారు. జంతు సముదాయాలను బాధించకుండా దొరికే ఆహారం మాత్రమే తినేవారిని ‘వేగన్స్‌’ అని  వీగన్స్‌  అని అంటారు. రేపు ప్రపంచ శాకాహార దినోత్సవం. వారి రుచి, అభిరుచి గురించి మాట్లాడుకోవాల్సిన రోజు. వారి వాదనను తెలుసుకోవాల్సిన రోజు. 

తెలుగులో నటించిన హీరోయిన్‌ జెనిలియా తెలుసుగా. ఆమె భర్త నటుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌. ఇటీవల వారు భారతదేశంలో ‘మాక్‌ మీట్‌’ పరిశ్రమను స్థాపించారు. ‘మాక్‌ మీట్‌’ అంటే ‘వెజిటేరియన్‌ మీట్‌’. అంటే మాంసంలా కనిపించే మాంసం. మొక్కల నుంచి తయారు చేస్తారు. ‘భవిష్యత్తులో ప్రజలు శాకాహారంవైపుకు ఎక్కువగా మొగ్గు చూపుతారని, ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో మాక్‌ మీట్‌కు డిమాండ్‌ పెరిగిందని, దేశంలో కూడా పెరుగుతుందని’ వారు ఈ సందర్భంగా చెప్పారు.

శాకాహారాన్ని ఎంచుకునేవారు, జీవితంలో జీవహింసా రాహిత్యాన్ని సాధన చేసే వారు ‘వేగన్స్‌’ అవుతారు. మానవతావాదిని ‘హ్యుమానిటేరియన్‌’ అంటారు. వెజిటెబుల్స్‌ను మాత్రమే ఆహారంగా తీసుకునేవారిని వెజిటేరియన్‌ అంటారు.  క్రమంగా ఆ మాటే వేగన్‌ అయ్యింది. ‘వీగన్‌’ అనీ అంటారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మాటను బ్రిటిష్‌ సంస్కరణవాది ఫాని కెంబల్‌ వ్యాప్తిలోకి తెస్తే, ప్రపంచ శాకాహారుల దినోత్సవం (వరల్డ్‌ వేగన్‌ డే)ను ఇంగ్లిష్‌ రచయిత్రి లూయిస్‌ వాలిస్‌ 1994 నుంచి వ్యాప్తిలోకి తెచ్చింది. 

మన దేశమే పుట్టినిల్లు
శాకాహార ఉద్యమానికి భారత దేశమే పుట్టినిల్లు. సింధూ నాగరికతలో ఈ భావన, జీవహింసను వ్యతిరేకించడం మొదలైందని చరిత్రకారుల పరిశీలన. ఆ తర్వాత మన దేశంలో వచ్చిన జైన, బౌద్ధ మతాలు శాకాహారాన్ని గట్టిగా ప్రచారం చేశాయి. మత సంబంధమైన నాటి క్రతవుల్లో వందల వేల కొద్ది జంతువుల వధ జరుగుతుండటాన్ని నిరసించి జైన, బౌద్ధాలు జీవ హింసను వ్యతిరేకించాయి. శాకాహారాన్ని ప్రచారం చేశాయి. ఈ మతాల ప్రాబల్యం గమనించిన వైదిక మత అవలంబికులు క్రమంగా బలులను నిషేధించుకుంటూ, ఆహార వ్యవహారాలను కూడా మార్చుకున్నారని కూడా చరిత్రకారులు అంటారు. ఆ విధంగా మన దేశంలో పుట్టిన శాకాహార ఉద్యమం క్రమంగా నేడు ప్రపంచమంతా వ్యాపించింది.

వరల్డ్‌ వేగన్‌ డేను ప్రచారంలోకి తెచ్చిన లూయిస్‌ వాలిస్‌ 

ఆహార హింస– జీవ హింస
మనిషి తన ఆహారం కోసం జీవులను హింసించడం వేగన్స్‌కు ఇష్టం ఉండదు. వీరు ఒక రకం. అసలు మానవ సకల వ్యవహారాల్లోనూ జీవ హింస లేకుండా ఉండాలనే వేగన్స్‌ ఉంటారు. వీరు మరో రకం. మొదటి రకం వారు కేవలం ఆహారం విషయంలోనే తమ వ్రతం పాటిస్తే రెండో రకం వారు జీవితంలో కూడా పాటిస్తారు. మొదటి రకం వారు జంతువుల నుంచి, జీవుల నుంచి వచ్చే పాలు, గుడ్లు, నెయ్యి, నూనె, దుస్తులు, వాడుక వస్తువులు వేటినీ తీసుకోరు. రెండో రకం వారు ఇళ్లల్లో కుక్కలను, పక్షులను పెంచడం కూడా హింస అనుకుంటారు. వ్యవసాయానికి ఎడ్లు ఉపయోగించడం, రవాణాకు గుర్రాలను ఉపయోగించడం కూడా హింసే అనుకుంటారు. వాటిని అవాయిడ్‌ చేస్తారు. జంతువుల కొవ్వును ఉపయోగించి తయారు చేసే సాధారణ సబ్బులను కూడా వీళ్లు వ్యతిరేకిస్తారు. వీళ్లు కాకుండా మూడో రకం వారు పర్యావరణ శాకాహారులు. వీరు ఒక ఉత్పత్తిగా జీవులను ఉత్పత్తి చేయడానికి పర్యావరణ హింసగా భావిస్తారు. అంటే కోళ్లను, గొర్రెలను, ఇతర ఆహారానికి ఉపయోగపడే జీవులను పౌల్ట్రీలుగా, ఫార్మ్స్‌గా వ్యాపారదృష్టితో చేయడాన్ని వ్యతిరేకిస్తారు.

లండన్‌ వెజిటేరియన్‌ సొసైటీ సభ్యులతో గాంధీజీ.. 

గాంధీ గారు కూడా ప్రచారకర్తే
అమెరికాలో, యూరోపియన్‌ దేశాలలో 2010 నుంచి ‘వేగన్‌ స్టోర్స్‌’ మొదలయ్యాయి. ‘వెజిటేబుల్‌ బుచర్‌’ స్టోర్స్‌ అంటే శాకాహార మాంసం అమ్మే స్టోర్లు మొదలయ్యాయి. అక్కడ ‘బియాండ్‌ మీట్‌’ అనే సంస్థ అచ్చు బీఫ్‌ లాంటి, అచ్చు చికెన్‌ లాంటి కృత్రిమ పదార్థాలను తయారు చేసి అమ్ముతోంది. అమెరికాలోని స్కూళ్లు ‘మా దగ్గర పిల్లలకు వేగన్‌ మీల్స్‌ ఇస్తాము’ అని ప్రచారం చేసుకుంటున్నాయి. చాలామంది గొప్పవాళ్లు శాకాహారాన్ని ప్రచారం చేయడం వల్ల ఇదంతా సాధ్యమైందని అనే వారున్నారు. గాంధీజీ కూడా శాకాహారాన్ని ప్రచారం చేశారు. ఆయన లండన్‌ ‘వెజిటేరియన్‌ సొసైటీ’లో కార్యవర్గ సభ్యుడుగా పని చేశారు. ‘శాకాహారం కేవలం ఆరోగ్య విలువగా కాకుండా నైతిక విలువగా కూడా ప్రచారం కావాలి’ అని ఆయన కోరుకున్నారు. 

ప్రత్యామ్నాయం
జీవులను హింసించని ఆహారం తీసుకోవాలని సంకల్పించిన వేగన్స్‌ తమ రుచిని కోల్పోదలుచుకోలేదు. తన భోజన సంబరాన్ని కోల్పోదలుచుకోలేదు. తమ సెలబ్రేషన్‌కు దూరం కాదలుచుకోలేదు. అందుకే ఆరోగ్యాన్ని నిలబెట్టే ‘వేగన్‌ డైట్‌’ను ప్రతి దేశంలో ఆ దేశంలో దొరికే శాకాహార పదార్థాలతో తయారు చేసి ప్రచారం చేసుకున్నారు. ఎందుకంటే శరీరానికి అన్ని పోషకాలు అవసరం. ‘హింసా రహిత పదార్థాలలో’ అన్ని పోషకాలు దొరక్కపోవచ్చు. తెలిసీ తెలియక అదే ఆహారాన్ని కొనసాగిస్తే కటువైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే శాకాహారం తీసుకోవాలనే సంకల్పంతో పాటు దానికి అవసరమైన చైతన్యం కూడా కావాలని వేగన్స్‌ అంటారు. వీరు తమ కోసం మాక్‌ మీట్‌ను ఉపయోగించడం, ప్లాంట్‌ మిల్క్‌ (నీటి మొక్కల నుంచి సేకరించింది)ను వాడటం చేస్తున్నారు. 

మన దగ్గర వేల రుచులు
భారతీయులు అందునా తెలుగువారు శాకాహారంలో తిరుగులేని రుచులను కనిపెట్టినవారు. సమస్త పోషకాలను రంగరించుకుంటూ ఆరోగ్యానికి దానినొక వాహకంగా సాధన చేస్తున్నవారు. తెలుగు శాకాహార వంటలు తినడం ప్రారంభిస్తే విసుగు లేకుండా ఒక జీవితకాలం గడిచిపోతుంది. కూరలు, తాలింపులు, చార్లు, ఇగురులు, పులుసులు, పప్పులు... ఎన్నని. విస్తరిలో వాటి కళ వేరు. జిహ్వకు వైభోగం వేరు. 
ఆహారం లేకపోతే మనిషి లేడు. తన మనుగడ కోసం మనిషి ఆహారాన్ని ఉత్పత్తి చేస్తూనే ఉన్నాడు. అయితే కాల మాన సామాజిక పరిస్థితుల అనుసారం ఆ అలవాట్ల ‘విలువ’ మారుతూ వచ్చింది. ఇప్పటి కాలానికి ‘వేగనిజమ్‌’ ఒక విలువగా ఉంది. వీగన్స్‌ తాత్త్వికతను గౌరవిస్తూ ఇవాళ శాకాహార భోజనం చేయడం మంచి పనే కదా.
– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement