చరిత్రపై నెత్తుటి చేవ్రాలు ‘బ్రదర్హుడ్’
ఇదొక ప్రపంచ సమస్య. అల్‌కాయిదా సమస్యను మించినది. ప్రభుత్వాలతో విభేదిస్తూనే 80 ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న సంస్థ ముస్లిం బ్రదర్హుడ్.
పిరమిడ్లలో ఉన్న మమ్మీలు కూడా ఈజిప్ట్ వర్తమాన సన్నివేశాలను చూసి నవ్వుకుంటాయనిపిస్తుంది. మధ్యయుగాల నాటి ఎన్ని దురంతాలను గుర్తుకు తెచ్చుకుందో నైలు నది! ఒకరకం మౌఢ్యానికి పరాకాష్ట అనిపించే ఆ ఐదురోజులలో (ఈ నెల 14 నుంచి) ఈజి ప్ట్లో జరిగిన రక్తపాతాన్ని చూసి ప్రపంచం విస్తుపోకుండా ఉండటం సాధ్యంకాదు. 900 మంది ఆ హింసాకాండలో ప్రాణాలు కోల్పోయారు. తమ పురాతన నాగరికతా చిహ్నాలనీ, చారిత్రక సాక్ష్యాలనీ కూడా మతోన్మాదంతో ఊగిపోతున్న యువకులు ధ్వంసం చేస్తున్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోకు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న మిన్యా పురావస్తు ప్రదర్శనశాల నుంచి దాదాపు వేయి కళాఖండాలను ఉన్మాదులు దోచుకుపోయారు. ఇంతకాలం భద్రంగా ఉన్న మమ్మీలను ధ్వంసం చేశారు. 2011లో హోస్నీ ముబారక్ హయాంలో ప్రారంభమైన విధ్వం సకాండకీ, ఇప్పటికీ కొంచెం తేడా ఉంది. అప్పుడు రెండు లక్షల అపురూపు గ్రంథాలను ఛాందసం నెత్తికెక్కిన విధ్వంసకారులు ధ్వం సం చేశారు. ఇప్పుడు కళాఖండాలనూ, అవశేషాలనూ నాశనం చేస్తున్నారు. ఈ రెండేళ్లలోనే ఈజిప్ట్ సాంస్కృతికంగా, సామాజికం గా తన మౌలికతను చాలా నాశనం చేసుకుం ది. ‘ముస్లిం బ్రదర్హుడ్’ నిర్వాకం ఇది.
2005లో ఈజిప్ట్ అధ్యక్షునిగా హోస్నీ ముబారక్ ఉన్న కాలంలో ప్రధానస్రవంతి రాజకీయాలను ప్రభావితం చేయడానికి వచ్చి న అవకాశాన్ని బ్రదర్హుడ్ అందిపుచ్చుకుం ది. కానీ 2013 లోనే పతనదశకు చేరుకుంది కూడా. అరబ్ దేశాలతో పాటు ఇప్పటికీ చాలా దేశాలలో వేళ్లూనికుని ఉన్న బ్రదర్హుడ్ 1928, మార్చిలో ఈజిప్ట్‌లోని ఇస్మాలియా అనే చోట రూపుదాల్చింది. పండితుడు, ఉపాధ్యాయుడు హసన్ అల్ బన్నా దీని స్థాపకుడు. సూయెజ్ కాలువ పనిలో ఉన్న ఆరుగురు శ్రామికులతో మొదలైన బ్రదర్హుడ్ ఎంతో వేగంగా విస్తరించి రెండో ప్రపంచయుద్ధం ముగిసేనాటికి రెండు లక్షల మంది సభ్యులను ఆకర్షించింది. 1948 నాటికి పలు దేశాలలో రెండువేల శాఖలతో, ఐదులక్షల మంది సభ్యులతో బలపడింది. బ్రదర్హుడ్ తన వ్యతిరేకులను నిర్మూలిస్తుందని మొదటి నుం చి ఆరోపణలు ఉన్నాయి. 1948 నాటి ఈజిప్ట్ అధ్యక్షుడు మహ్మద్ ఫాహిం అన్నూ క్రిషిపాషా హత్య వెనుక ఈ సంస్థ ప్రమేయం ఉం దని ఆరోపణలు ఉన్నాయి. ఆ సంవత్సరంలోనే ఇది నిషేధానికి గురైంది. ఈజిప్ట్ ప్రభుత్వంతో బ్రదర్‌హుడ్‌కు ఎక్కువ కాలం సంఘర్షణే కనిపిస్తుంది. అబ్దుల్ నాసర్ (1954) ఈ సం స్థను అదుపులో పెట్టే ప్రయత్నం చేశాడు. ఈ ఆటుపోట్లతో 1970లో ఈ సంస్థ హింసాకాండను వీడి, రాజకీయపార్టీ అవతారం ఎత్తాలని అనుకుంది. కానీ ఎన్నికలలో పోటీ చేయడానికి అప్పటికే అర్హత కోల్పోయింది. దీనితో దీని సభ్యులు ఇండిపెండెంట్లుగా పోటీ చేసేవారు. అలా మొదలైన ఎన్నికల ప్రయాణం 2005 నాటికి 88 స్థానాల దాకా చేరింది. 2011లో ముబారక్‌ను పదవీచ్యుతుని చేయడంలో బ్రదర్హుడ్ కీలకపాత్ర వహించి, చట్టబద్ధత సాధించింది. ఈ ‘విప్లవం’లోనే బ్రదర్‌హుడ్‌కు సైన్యం మద్దతు పలికింది.
ఎన్నికలలో పోటీ చేసే వీలులేకపోవడంతో అనుబంధంగా ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీని ఏర్పాటు చేసింది. దీని అధ్యక్షుడే మహ్మద్ మొర్సీ. 2000-2005 మధ్య పార్లమెంట్ సభ్యుడు. 2012 అధ్యక్ష ఎన్నికలలో బ్రదర్హుడ్, ఫ్రీడమ్ అండ్ జస్టిస్ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికలలో ఇతడే పోటీ చేశాడు. ఓటర్లలో అరవైశాతం మొర్సీకే ఓటేశారు. 508 స్థానాలు ఉన్న పార్లమెంటులో మొర్సీ పార్టీ, ఈ పార్టీ మద్దతు ఉన్న వారు 235 మంది గెలిచారు. ఇంత మద్దతు ఉన్నా కేవలం జూన్ 30, 2012 నుంచి జూలై 3, 2013 వరకు మాత్రమే పాలించాడు. హద్దుల్లేని అధికారాలు చేజిక్కిం చుకోవడంతో సంక్షోభం ఏర్పడింది. సైన్యం నాయకత్వంలో తాత్కాలిక సైనిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఇప్పుడు జరుగుతున్న హింసాకాండ ఆ ప్రభుత్వం పుణ్యమే.
ఈజిప్ట్‌లో మైనారిటీగా ఉన్న క్రైస్తవులపై దాడులతో బ్రదర్హుడ్ పూర్తిగా అప్రతిష్టపాలైంది. ఉదారవాదులపై కక్ష కట్టడం మరొక అంశం. అయితే తాత్కాలిక ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం సులభం కాదు. బ్రదర్హుడ్ రకరకాల పేర్లతో బహ్రెయిన్, సిరియా, జోర్డాన్, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, సౌదీ అరేబియా, కువైట్, యొమెన్, కెన్యా (బరాక్ ఒబామా సవతి సోదరుడు మాలిక్ ఒబామాకు దీనితో సంబంధాలు ఉన్నాయని చెబుతారు), అల్జీరియా, సూడాన్, సోమాలియా, ట్యునిషి యా, లిబియా, మారిటేనియా, రష్యా (2003 లో నిషేధించారు), అమెరికా, బ్రిటన్, ఇండోనేషియా, భారత ఉపఖండం (అబ్దుల్ అలా మౌదుది 1941లో లాహోర్‌లో స్థాపించిన జమాతె ఎ ఇస్లాం అదే)లో పనిచేస్తున్నది. అంటే ఇదొక ప్రపంచ సమస్య. అల్‌కాయిదా సమస్యను మించినది. ప్రభుత్వాలతో విభేదిస్తూనే 80 ఏళ్లుగా మనుగడ సాగిస్తున్న సం స్థ ఇది. అయినా ప్రపంచంలో కొన్నిచోట్ల ప్ర భుత్వాలు ఇప్పటికీ ఉగ్రవాద సంస్థలను పోషిస్తున్నాయి. అందుకే మమ్మీలకు నవ్వు తెప్పిం చే పరిణామాలే ఇప్పుడు ఎక్కువ.
- డా॥గోపరాజు నారాయణరావు