Worst road accident
-
దైవదర్శనానికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు...
చిలకలూరిపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విగత జీవులుగా మారిన ఘటన సోమవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బేవారిపేటకు చెందిన తిరుమల నాగవెంకటేశ్వరరావు (30) కుటుంబ సభ్యులతో కలసి మొక్కు తీర్చుకునేందుకు జూన్ 28వ తేదీన తిరుమలకు వెళ్లారు. దర్శనం అనంతరం ఆదివారం రాత్రి స్వగ్రామానికి కారులో ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో చిలకలూరిపేట ఎన్ఆర్టీ సెంటర్ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక వైపుగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నాగ వెంకటేశ్వరరావుతో పాటు అతని భార్య తిరుమల సూర్యభవాని (25), కుమార్తె సోనాక్షి (7), కుమారుడు గీతేశ్వర్ (5), బావమరిది కటికిరెడ్డి అనోద్‌కుమార్ (21) అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న బంధువులు తిరుమల దుర్గా మణికంఠ, గోకరకొండ సాయికిరణ్, గుమ్మళ్ల సాయిదుర్గా తులసి, గుమ్మళ్ల సాయిదుర్గా శైలజ, టి.అనంతలక్ష్మి, ఏడాదిన్నర బాలుడు టి.తేజేశ్వర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సాయికిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మృతి చెందిన నాగ వెంకటేశ్వరరావు, గాయపడిన దుర్గా మణికంఠ అన్నదమ్ములు. ఇరువురికి డ్రైవింగ్ రావటంతో ఒకరి తరువాత ఒకరు వాహనం నడుపుకొంటూ వచ్చారు. ప్రమాద సమయంలో నాగ వెంకటేశ్వరరావు వాహనం నడుపుతున్నట్లు గాయపడిన వారు తెలిపారు. నిద్రమత్తులో అతివేగంగా వాహనం నడపటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. గాయపడిన ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరసరావుపేట డీఎస్పీ రామవర్మ, అర్బన్ సీఐ వి.సూర్యనారాయణ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరితో పాటు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ జీసీ రాజరత్నం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అమర్‌నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
షాపింగ్‌కు వెళ్లొస్తుండగా షాకింగ్ ఘటన
-
ముగ్గురు వ్యక్తులు దుర్మరణం
సత్యనారాయణపురం(దెందులూరు) : సత్యనారాయణపురం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై గురువారం వేకువజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మరణించారు. ఐదుగురికి తీవ్ర గాయూలయ్యూయి. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఏలూరు వైపు వెళుతున్న ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు భీమడోలు మండలం గుండుగొలను గ్రామస్తులు. చేపల ప్యాకింగ్ పనిలో భాగంగా ఏలూరుకు ఈ గ్రామం నుంచి పది మంది కూలీలు వేకువజాము సుమారు 2.30 గంటలకు ఓ ఆటోలో బయలుదేరారు. వేగంగా వెళుతున్న ఆటో సత్యనారాయణపురం గుండేరువాగు సమీపంలో ఆగిఉన్న లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చప్పా శ్రీనివాసరావు(40), మరడాని రాము40) అక్కడికక్కడే మృతిచెందారు. కాలి ప్రభాకర్ (40), నత్తా బాబ్జి, ఓగిరాల రమేష్, కూర్మా ధర్మయ్య, ఎ.లక్ష్మణరావు, జి.రాజేంద్రకు తీవ్ర గాయూలయ్యూరుు. వారిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కాలి ప్రభాకర్ మరణించాడు. కోమాలోకి వెళ్లిపోయిన సత్తా బాబ్జి, ఓగిరాల రమేష్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భీమడోలు సీఐ ఎం.వెంకటేశ్వరరావు, దెందులూరు ఎస్సై ఎమ్వీ సుభాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శోకసంద్రం గుండుగొలను (భీమడోలు) : గుండుగొలనుకు చెందిన ముగ్గురు చేపల ప్యాకింగ్ కూలీలు మృత్యువాత పడటంతో గ్రామంలోని డోకలవారి వీధి, దళితవాడల్లో విషాద చాయలు అలముకున్నాయి. రెక్కాడితేగాని డొక్కాడని ఆ కుటుంబాలకు అర్ధరాత్రి కూలి పనికి బయలుదేరితేగానీ కడుపు నిండని పరిస్థితి. గురువారం వేకువజాము 2.30 గంటలకు బయలుదేరిన వీరి బ్రతుకులు తెల్లారిపోయాయి. డోకల వారి వీధికి చెందిన చప్పా శ్రీనివాసరావు 15 ఏళ్లుగా చేపల ప్యాకింగ్ చేస్తూ ముఠాను నిర్వహిస్తున్నాడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. కొల్లేరులో చేపల చెరువుల ధ్వంసంతో గుండుగొలను చెందిన వారు ఇతర మండలాలు, ఇతర జిల్లాలకు చేపల ప్యాకింగ్ పని కోసం వెళ్తుంటారు. ఆ క్రమంలోనే ఏలూరులో చేపల ప్యాకింగ్ నిమిత్తం 10 మందిని తీసుకు వెళ్తుండగా ఆటో ఈ ప్రమాదం జరిగింది. మరడాని రాము గతంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ట్రాక్టర్లకు సరిగా పనుల్లేక కొంత కాలంగా చేపల ప్యాకింగ్ పనికి వెళుతున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. గ్రామంలో దళిత వాడకు చెందిన కాలి ప్రభాకరరావు అలియాస్ కాళీ ఆటో నడుపుకునేవాడు. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు. ఆటో నడుపుకోవడంతో వచ్చే అరకొర సొమ్ము సరిపోక కొంత కాలంగా చేపల ప్యాకింగ్ పనికి వెళుతున్నాడు. వీరికి గురువారం సాయంత్రం గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ ప్రమాదంలో ఆ కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డాయి. వారి ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఆరేళ్ల క్రితం జరిగిన ఇటువంటి ప్రమాదంలో గుండుగొలనుకు చెందిన ఐదుగురు మహిళా కూలీలు మృతి చెందిన విషయాన్ని పలువురు గుర్తుకు తెచ్చుకున్నారు.