
రోడ్డు ప్రమాదంలో ధ్వంసమైన కారు
చిలకలూరిపేట: ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విగత జీవులుగా మారిన ఘటన సోమవారం తెల్లవారుజామున గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం సబ్బేవారిపేటకు చెందిన తిరుమల నాగవెంకటేశ్వరరావు (30) కుటుంబ సభ్యులతో కలసి మొక్కు తీర్చుకునేందుకు జూన్ 28వ తేదీన తిరుమలకు వెళ్లారు. దర్శనం అనంతరం ఆదివారం రాత్రి స్వగ్రామానికి కారులో ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో చిలకలూరిపేట ఎన్‌ఆర్‌టీ సెంటర్ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక వైపుగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో నాగ వెంకటేశ్వరరావుతో పాటు అతని భార్య తిరుమల సూర్యభవాని (25), కుమార్తె సోనాక్షి (7), కుమారుడు గీతేశ్వర్ (5), బావమరిది కటికిరెడ్డి అనోద్‌కుమార్ (21) అక్కడికక్కడే మృతి చెందారు.
కారులో ప్రయాణిస్తున్న బంధువులు తిరుమల దుర్గా మణికంఠ, గోకరకొండ సాయికిరణ్, గుమ్మళ్ల సాయిదుర్గా తులసి, గుమ్మళ్ల సాయిదుర్గా శైలజ, టి.అనంతలక్ష్మి, ఏడాదిన్నర బాలుడు టి.తేజేశ్వర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సాయికిరణ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మృతి చెందిన నాగ వెంకటేశ్వరరావు, గాయపడిన దుర్గా మణికంఠ అన్నదమ్ములు. ఇరువురికి డ్రైవింగ్ రావటంతో ఒకరి తరువాత ఒకరు వాహనం నడుపుకొంటూ వచ్చారు. ప్రమాద సమయంలో నాగ వెంకటేశ్వరరావు వాహనం నడుపుతున్నట్లు గాయపడిన వారు తెలిపారు.
నిద్రమత్తులో అతివేగంగా వాహనం నడపటమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి తరలించారు. గాయపడిన ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నరసరావుపేట డీఎస్పీ రామవర్మ, అర్బన్ సీఐ వి.సూర్యనారాయణ ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరితో పాటు డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ జీసీ రాజరత్నం, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ అమర్‌నాయక్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని ప్రభుత్వాసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.