WR-V
-
హోండా డబ్ల్యూఆర్-వీ ఫేస్లిఫ్ట్ లాంచ్
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటో సంస్థ హోండా తన డబ్ల్యూఆర్-వీ మోడల్ 2020 ఫేస్లిఫ్ట్ వెర్షన్ కారును భారతదేశంలో లాంచ్ చేసింది. దీని ధరలు 8.50 లక్షల నుండి ప్రారంభమై 10.99 లక్షల రూపాయల వరకు (అన్ని ధరలు,ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ సంవత్సరం ఏప్రిల్లో ప్రారంభించాలనుకున్నా కరోనావైరస్ మహమ్మారితో ఆలస్యమైందని జపాన్ కార్ మేకర్ వెల్లడించింది. రిఫ్రెష్ స్టైలింగ్, కొత్త ఫీచర్లతో బీఎస్-6 ఫార్మాట్లో అప్ డేట్ చేసింది. పెట్రోలు, డీజిల్ ఇంజీన్లతో ఎస్ వీ, వీక్స్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే ఇది లభ్యం కానుంది. హోండా డబ్ల్యూఆర్-వీ డిజైన్, ఫీచర్లు బీఎస్ 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా 1.5 లీటర్ డీజిల్, 1.2 పెట్రోల్ ఇంజిన్లను అమర్చింది. డీజిల్ వెర్షన్ వాహనం 99 పీఎస్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. పెట్రోల్ వాహనమైతే 89 పీఎస్ పవర్, 200 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6- స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. సరికొత్త ఫ్రంట్ గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ లైట్లతో కూడిన డే టైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్డ్ టెయిల్ ల్యాంప్స్ లాంటివి జోడించింది. 7.0 అంగుళాల టచ్ స్క్రీన్ ఇంఫొటైన్మెంట్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, సన్ రూఫ్, రేర్ ఏసీ వెంట్స్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, యాంటీ బ్రేకింగ్ వ్యవస్థ, రేర్ పార్కింగ్ సెన్సార్లు, మల్టీ వ్యూ రేర్ పార్కింగ్ కెమెరా లాంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే..మారుతీ సుజుకీ విటారా బ్రెజా, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్ యూవీ 300, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, హ్యుండాయ్ వెన్యూ లాంటివి ప్రధానంగా గట్టిపోటీ ఇవ్వనున్నాయి. -
హోండా కాంపాక్ట్ క్రాసోవర్.. డబ్ల్యూఆర్–వీ
రెండు వేరియంట్లలో లభ్యం ⇒ పెట్రోల్: రూ.7.75 లక్షలు – రూ.8.99 లక్షలు ⇒ డీజిల్: రూ.8.79 లక్షలు – రూ. 9.99 లక్షలు న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా కంపెనీ కాంపాక్ట్ క్రాసోవర్ మోడల్, హోండా ‘డబ్ల్యూఆర్–వీ’ని గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ధరలు రూ.7.75 లక్షల నుంచి రూ.9.99 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి. ఈ కారును జాజ్ ప్లాట్ఫార్మ్పై తయారు చేశామని, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుందని హోండా కార్స్ ఇండియా తెలిపింది. 1.2 లీటర్ ఇంజిన్తో రూపొందిన పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.7.75 లక్షల నుంచి రూ.8.99 లక్షల రేంజ్లో ఉన్నాయని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ యోచిరో యునొ చెప్పారు. 1.5 లీటర్ ఇంజిన్తో రూపొందిన డీజిల్ వేరియంట్ ధరలు రూ.8.79 లక్షల నుంచి 9.99 లక్షల రేంజ్లో ఉన్నాయని వివరించారు. ఈ డబ్ల్యూఆర్–వీ వాహనాన్ని ప్రపంచవ్యాప్తంగా భారత్లోనే తొలిసారిగా అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. హోండా కంపెనీ, జపాన్ ఆర్ అండ్ డీ విభాగం సహకారంతో భారత హోండా ఆర్ అండ్ డీ విభాగం అభివృద్ధి చేసిన తొలి మోడల్ ఇదని వివరించారు. డీజిల్ వేరియంట్ మైలేజీ 25.5 కిమీ. శాటిలైట్ అనుసంధాన నావిగేషన్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ, డ్యుయల్ ఎయిర్బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సన్ రూఫ్, ఇంటర్నెట్కు వై–ఫై సపోర్ట్, 1.5 జీబీ ఇంటర్నల్ మెమెరీ తదితర ఫీచర్లతో కూడిన ఇన్ఫోటైన్మెంట్ వంటి ప్రత్యేకతలున్నాయని యునొ వివరించారు. డీజిల్ వేరియంట్లో స్టార్ట్/స్టాప్ బటన్, స్మార్ట్ కీ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి అదనపు ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. డీజిల్ వేరియంట్ 25.5 కిమీ. మైలేజీనిస్తుందని, ఈ సెగ్మెంట్ కార్లలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. ఈ కారు మారుతీ సుజుకీ విటారా బ్రెజా, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, టయోట ఇటియోస్ క్రాస్, ఫియట్ అవెంచురా, హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. మరిన్ని ప్రీమియమ్ మోడళ్లు..! ఈ ఏడాది తమకు శుభారంభం పలికిందని యునొ పేర్కొన్నారు. గత నెలలో మార్కెట్లోకి తెచ్చిన కొత్త సిటీ కారుకు ఇప్పటివరకూ 14,000 బుకింగ్స్ వచ్చాయని వివరించారు. తాజాగా అందిస్తున్న డబ్ల్యూఆర్–వీ కారుతో తాము మంచి వృద్ధిని సాధించగలమని పేర్కొన్నారు. మరిన్ని ప్రీమియమ్ మోడళ్లను భారత్లోకి తెచ్చే విషయమై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు తమ అమ్మకాలపై బాగానే ప్రభావం చూపిందని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నొరియాకె అబె చెప్పారు. గత నెల నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్నాయని వివరించారు.