హోండా కాంపాక్ట్ క్రాసోవర్.. డబ్ల్యూఆర్–వీ
రెండు వేరియంట్లలో లభ్యం
⇒ పెట్రోల్: రూ.7.75 లక్షలు – రూ.8.99 లక్షలు
⇒ డీజిల్: రూ.8.79 లక్షలు – రూ. 9.99 లక్షలు
న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా కంపెనీ కాంపాక్ట్ క్రాసోవర్ మోడల్, హోండా ‘డబ్ల్యూఆర్–వీ’ని గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ధరలు రూ.7.75 లక్షల నుంచి రూ.9.99 లక్షల రేంజ్(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)లో ఉన్నాయి. ఈ కారును జాజ్ ప్లాట్‌ఫార్మ్‌పై తయారు చేశామని, పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభ్యమవుతుందని హోండా కార్స్ ఇండియా తెలిపింది. 1.2 లీటర్ ఇంజిన్‌తో రూపొందిన పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.7.75 లక్షల నుంచి రూ.8.99 లక్షల రేంజ్‌లో ఉన్నాయని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ యోచిరో యునొ చెప్పారు.
1.5 లీటర్ ఇంజిన్‌తో రూపొందిన డీజిల్ వేరియంట్ ధరలు రూ.8.79 లక్షల నుంచి 9.99 లక్షల రేంజ్‌లో ఉన్నాయని వివరించారు. ఈ డబ్ల్యూఆర్–వీ వాహనాన్ని ప్రపంచవ్యాప్తంగా భారత్‌లోనే తొలిసారిగా అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. హోండా కంపెనీ, జపాన్ ఆర్ అండ్ డీ విభాగం సహకారంతో భారత హోండా ఆర్ అండ్ డీ విభాగం అభివృద్ధి చేసిన తొలి మోడల్ ఇదని వివరించారు.
డీజిల్ వేరియంట్ మైలేజీ 25.5 కిమీ.
శాటిలైట్ అనుసంధాన నావిగేషన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సన్ రూఫ్, ఇంటర్నెట్‌కు వై–ఫై సపోర్ట్, 1.5 జీబీ ఇంటర్నల్ మెమెరీ తదితర ఫీచర్లతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ప్రత్యేకతలున్నాయని యునొ వివరించారు. డీజిల్ వేరియంట్‌లో స్టార్ట్/స్టాప్ బటన్, స్మార్ట్ కీ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి అదనపు ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. డీజిల్ వేరియంట్ 25.5 కిమీ. మైలేజీనిస్తుందని, ఈ సెగ్మెంట్ కార్లలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. ఈ కారు మారుతీ సుజుకీ విటారా బ్రెజా, ఫోర్డ్ ఈకోస్పోర్ట్, టయోట ఇటియోస్ క్రాస్, ఫియట్ అవెంచురా, హ్యుందాయ్ ఐ20 యాక్టివ్ కార్లకు గట్టిపోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.
మరిన్ని ప్రీమియమ్ మోడళ్లు..!
ఈ ఏడాది తమకు శుభారంభం పలికిందని యునొ పేర్కొన్నారు. గత నెలలో మార్కెట్లోకి తెచ్చిన కొత్త సిటీ కారుకు ఇప్పటివరకూ 14,000 బుకింగ్స్ వచ్చాయని వివరించారు. తాజాగా అందిస్తున్న డబ్ల్యూఆర్–వీ కారుతో తాము మంచి వృద్ధిని సాధించగలమని పేర్కొన్నారు. మరిన్ని ప్రీమియమ్ మోడళ్లను భారత్‌లోకి తెచ్చే విషయమై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు తమ అమ్మకాలపై బాగానే ప్రభావం చూపిందని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నొరియాకె అబె చెప్పారు. గత నెల నుంచి పరిస్థితులు మెరుగుపడుతున్నాయని వివరించారు.