‘రైటర్ పద్మభూషన్’ మూవీ రివ్యూ
టైటిల్: రైటర్ పద్మభూషన్
నటీనటులు: సుహాస్,టీనా శిల్పారాజ్, ఆశిష్ విద్యార్థి, రోహిణి, శ్రీగౌరి ప్రియ, గోపరాజు రమణ, ప్రవీణ్ కఠారీ తదితరులు
నిర్మాణ సంస్థలు: లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్
దర్శకత్వం:షణ్ముక్ ప్రశాంత్
నిర్మాతలు: చంద్రు మనోహరన్, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర
సంగీతం:శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ:వెంకట్ ఆర్ శాఖమూరి
విడుదల తేది: ఫిబ్రవరి 3, 2023
విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాన్. యూట్యూబ్ యాక్టర్‌గా కెరీర్‌ని ఆరంభించి.. కలర్ ఫోటోతో హీరో అయ్యాడు. ఈ తర్వాత ఫ్యామిలీ డ్రామా, హిట్ 2 చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ లో మెప్పించాడు. ఇక ఇప్పుడు రైటర్ పద్మభూషన్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
రైటర్ పద్మభూషణ్ కథేంటంటే..
పద్మ భూషణ్ అలియాస్ రైటర్ పద్మభూషన్(సుహాస్) విజయవాడలో లైబ్రేరియన్‌గా పని చేస్తుంటాడు. ఎప్పటికైనా గొప్ప రైటర్ కావాలని కలలు కంటాడు. అతని ఇష్టాన్ని ప్రోత్సహిస్తుంటారు తండ్రి మధుసూధన్‌రావు(అశిష్ విద్యార్థి), తల్లి సరస్వతి(రోహిణి). పద్మభూషన్ కష్టపడి ‘తొలి అడుగు’ అనే ఒక పుస్తకాన్ని రాస్తాడు. పేరెంట్స్‌కి తెలియకుండా అప్పుచేసి మరీ ఆ పుస్తకాన్ని పబ్లీష్ చేయిస్తాడు. కానీ ఆ పుస్తకాన్ని ఎవరూ కొనుగోలు చేయరు. ఉచితంగా ఇచ్చినా చదవరు. దీంతో తీవ్ర నిరాశకు గురవుతాడు.
కట్ చేస్తే.. పద్మ భూషన్ పేరుతో మార్కెట్లోకి ఓ పుస్తకం వస్తుంది. అది బాగా సేల్ అవుతుంది. అంతేకాదు అతని పేరు మీద బ్లాగ్ కూడా రన్ అవుతుంది. దీంతో పద్మభూషన్ సెలెబ్రెటీ అవుతాడు. మేనల్లుడు గొప్ప రైటర్ అని కూతురు సారిక(టీనా శిల్పరాజ్)ని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్దమవుతాడు పద్మభూషన్ మామ లోకేంద్ర కుమార్(గోపరాజు రమణ). ఇష్టపడిన మరదలితో పెళ్లి అవుతుందన్న సమయంలో షాకింగ్ ట్విస్ట్ ఎదురవుతుంది. అదేంటి? రైటర్ పద్మభూషణ్ పేరుతో పుస్తకాలు రాసేది ఎవరు? ఎందుకు రాస్తున్నారు? మరదలు సారికాతో పద్మభూషణ్ పెళ్లి జరిగిందా లేదా? గొప్ప రైటర్ కావాలన్న పద్మ భూషణ్ కల నెరవేరిందా? లేదా? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
రైటర్ పద్మ భూషణ్ టైటిల్ అనగానే ఏదో కామెడీగా సాగే చిత్రం అనుకుంటాం. కానీ ఇందులో కామెడీతో పాటు మంచి సందేశం ఉంది. ఆడియన్స్‌ని నవ్వించడమే కాదు కొన్ని చోట్ల ఏడిపిస్తాడు పద్మ భూషణ్. అన్ని రకాల ఎమోషన్స్ ఉండేలా కథను అల్లుకున్నాడు దర్శకుడు షణ్ముఖ్ ప్రశాంత్. అలా అని ఇది కొత్త కథ కాదు. స్క్రీన్‌ప్లే, ట్విస్ట్‌లతో కథనం కొత్తగా సాగుతుంది.
పద్మ భూషణ్ క్యారెక్టర్ని పరిచయం చేస్తూ సినిమా ప్రారంభించాడు . గొప్ప రైటర్‌గా పేరు తెచ్చుకోవాలని ఆశపడే పద్మభూషణ్.. హౌస్ వైఫ్‌గా ఇంటిపని చేసే తల్లి సరస్వతి, ఖర్చులన్నీ పోగా నెలకు 8000 మిగిలితే పొంగిపోయే తండ్రి మధు సూదనరావు పాత్రల చుట్టే ఫస్టాఫ్ సాగుతుంది. ఈ ముగ్గురి పాత్రలు క్రియేట్ చేసే ఫన్ బాగుంటుంది.
ఇక పద్మభూషణ్ మరదలు సారిక ఎంట్రీ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య వచ్చే లవ్ సీన్స్ అంతగా వర్కౌట్ కాలేదు కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోవడమే కాకుండా సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఇక సెకండాఫ్‌లో కొత్త పుస్తకం రాసేందుకు పద్మభూషణ్ పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అదేసమయంలో క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకుల గుండెను బరువెక్కేలా చేస్తాయి. అమ్మ కోసం చూడాల్సిన సినిమా ఇది. ఇంతకంటే ఎక్కువ చెబితే ట్విస్ట్ రివీల్ అయ్యే ప్రమాదం ఉంది. క్లైమాక్స్ ఒక్క సీన్ సినిమా స్థాయిని పెంచుతుంది. దర్శకుడికి ఇది తొలి సినిమా అయినా.. మంచి పాయింట్‌ని ఎంచుకొని, తెరపై అంతే మంచిగా చూపించాడు.
ఎవరెలా చేశారంటే..
సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రల్లోనైనా ఈజీగా నటించగలడు. రైటర్ పద్మభూషణ్ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన నటనతో నవ్విస్తూనే..కొన్ని చోట్ల ఏడిపించాడు. తల్లి పాత్రలు చేయడం రోహిణికి కొత్తేమి కాదు. గతంలో అనేక సినిమాల్లో హీరోకి తల్లిగా నటించింది. ఇందులో కూడా ఆమెది ఆ తరహా పాత్రే. సరస్వతి క్యారెక్టర్‌కు న్యాయం చేసింది. ఇక చాలా కాలం తర్వాత కామెడీ తరహా పాత్రలు చేశాడు ఆశిష్ విద్యార్థి. హీరో తండ్రిగా ఆయన చేసే కామెడీ బాగా వర్కౌట్ అయింది. సారిక పాత్రకి టీనా శిల్పరాజ్ న్యాయం చేసింది. శ్రీగౌరి ప్రియ, గోపరాజు రమణ, ప్రవీణ్ కఠారీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. శేఖర్ చంద్ర, కల్యాణ్ నాయక్ సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.