నాన్న రుణం అలా తీర్చుకుంటాం
సినీ రచయిత ’సత్యమూరి’కి కుటుంబ సభ్యుల ఘన నివాళులు
హాజరైన అభిమానులు, సహచరులు
వెదురుపాక (రాయవరం):
మాకెంతో ఆప్యాయతల్ని, అనురాగాల్ని పంచి పెట్టిన నాన్న రుణాన్ని ఆయనకు ఇష్టమైన సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తీర్చుకుంటామని ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీప్రసాద్ తెలిపారు. మండలంలోని వెదురుపాకలో శుక్రవారం ప్రముఖ సినీ రచయిత స్వర్గీయ జి.సత్యమూర్తి ప్రథమ వర్ధంతిని ఆయన స్వగృహం సూర్యోదయంలో నిర్వహించారు. దేవీశ్రీప్రసాద్, ఆయన సోదరుడు సాగర్లు మాట్లాడుతూ నాన్నకు విద్య అంటే ఎంతో ఇష్టమని, అందుకే త్వరలో ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పేద మెరిట్ విద్యార్థులను ఆదుకుంటామన్నారు. 2017 మే 24న నాన్న పుట్టిన రోజు సందర్భంగా శాశ్వతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. సత్యమూర్తి భార్య శిరోమణి, కుమారులు దేవీశ్రీప్రసాద్, సాగర్, కుమార్తె ప్రియదర్శినిలు సత్యమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకు ముందుగా దేవీశ్రీప్రసాద్, సాగర్లు తండ్రి సత్యమూర్తికి సంవత్సరీక పూజలు నిర్వహించారు. దేవీశ్రీప్రసాద్ కుటుంబ సభ్యులు, సత్యమూర్తి సహచరులు, అభిమానులు హాజరై నివాళులర్పించారు.