సిబ్బందికి కొత్త సౌకర్యం...
షాంఘై ః ఉద్యోగులనుంచి అధిక పనిని పొందాలంటే ఒక్కో కంపెనీ ఒక్కో సౌకర్యం కల్పిస్తుంటుంది. కొందరు ప్రత్యేక బోనస్ లు, ఇంక్రిమెంట్లు, టూర్లు, ఔటింగ్ ఇలా వారికి అప్పుడప్పుడు ఒత్తిడిని తగ్గించే కార్యక్రమాలను ఏర్పాటు చేసి, వారితో పని చేయించుకుంటాయి. కానీ ఓ చైనా కంపెనీ మాత్రం తన సంస్థలోని ఉద్యోగులు ఒత్తిడి లేకుండా చక్కగా పనిచేసేందుకు భిన్నంగా ఆలోచించింది. వారు తమ పెంపుడు జంతువులతోపాటు ఆఫీసులకు వచ్చే సౌకర్యం కల్పించింది.
చైనా షాంఘై లోని ఇంటర్నెట్ మార్కెటింగ్ కంపెనీ తమ ఉద్యోగులు ఒత్తిడి లేకుండా పని చేసేందుకు కొత్త సౌకర్యాన్ని కల్పించింది. సిబ్బంది తమతోపాటు పెంపుడు జంతువుల్ని కూడా ఆఫీసుకు తెచ్చుకునే ఏర్పాటు చేసింది. వారిని ప్రోత్సహించేందుకు కల్పించిన కొత్త సౌకర్యంతో అద్భుత ఫలితాలు సాధించడంతోపాటు, సిబ్బంది హాయిగా, ఆనందంగా పనిచేయగల్గుతున్నట్లు యాజమాన్యం చెప్తోంది. కార్యాలయంలో పోటీ, డిమాండ్ సిబ్బందిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తోందని, అది వారి పనిపై ప్రభావం చూపిస్తుందని భయపడ్డ కంపెనీ అధిపతి జావో కాంగ్ చాంగ్.. వారు ఒత్తిడినుంచీ ఎలా రిలాక్స్ అవ్వగలరో పరిశోధించాడు. ముందుగా వారి ప్రొఫైల్స్ అధ్యయనం చేసి ఎక్కువశాతం ఉద్యోగుల ఇంట్లో పెంపుడు జంతువులు ఉన్నట్లు గమనించాడు. వాటిని తెచ్చుకొని మరీ ఆఫీసుకు రావచ్చంటూ ('బ్రింగ్ యువర్ పెట్ వర్క్ డే' ) ప్రత్యేక సౌకర్యాన్ని ప్రకటించాడు.
యజమాని తీసుకున్న నిర్ణయం భారీ విజయాన్ని సాధించింది. ఉద్యోగులంతా ఎంతో రిలాక్స్ గా ఉండటంతోపాటు, ఒకరికొకరు సహాయ పడుతూ ఉత్సాహంగా టీమ్ వర్క్ చేస్తున్నారు. నేనుకూడా పెట్ లవర్ అని, పెంపుడు జంతువులను ఎక్కువ సమయం ఒంటరిగా వదిలి వచ్చిన తర్వాత పొందే ఆందోళన ఎంతటిదో తనకు స్వానుభవం ఉందని, అందుకే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఏర్పాటు చేసినట్లు జావో చెప్తున్నాడు. సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి తన నిర్ణయాన్ని వివరించగా.. వారు ఆహ్వానించారని, కంపెనీ ఉత్పాదకత పెంచడంలో అదో అనధికారిక విధానంగా అమలు చేసినట్లు జావో వివరించాడు. ప్రస్తుతానికి పెట్స్.. సిబ్బందితోపాటు ఆఫీసులోనే తిరుగుతూ ఉంటాయని, భవిష్యత్తులో అవి ఆడుకునేందుకు, నిద్రపోయేందుకు వీలుగా ప్రత్యేక సౌకర్యాలను కల్పించే యోచనలో ఉన్నట్లు తెలిపాడు. జావో కాంగ్ చాంగ్ నూతన ఆలోచన విజయవంతమవ్వడంతో ఇప్పుడు ఇతర స్టార్ట్ అప్ కంపెనీలు సైతం అటుగా దృష్టి సారిస్తున్నాయి.