హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్!
ప్రపంచంలోనే అతిపెద్ద వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి హైదరాబాద్ వేదిక కానుంది. నగరానికి చెందిన ఓ ప్రముఖ సంస్థ శంషాబాద్ సమీపంలో సుమారు 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) నిర్మాణం జరగనుంది. మొదటి దశ పనులు 2025లో ప్రారంభం కానున్నాయి.
విస్తీర్ణం పరంగా ఇప్పటి వరకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ఢిల్లీ పరిధిలోని నోయిడాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ 44 ఎకరాల్లో విస్తరించింది. ఇదే ప్రపంచంలో అతది పెద్దది. రెండో స్థానంలో 43 ఎకరాల్లో విస్తరించిన బీజింగ్ డబ్ల్యూటీసీ నిలిచింది. శంషాబాద్‌లో నిర్మించబోయే వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాలు ఎత్తులో 12 అంతస్థులకే పరిమితం కానున్నాయి. ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ స్కైస్క్రాపర్లకు అనుమతి లేదు.
ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణం కోసం రూ.4000 కోట్ల వరకు వెచ్చించనున్నారు. ఈ డబ్ల్యూటీసీకి అనుబంధంగా సర్వీస్ అపార్ట్మెంట్లతో పాటు 225 గదుల హోటల్ నిర్మాణం కూడా చేపడుతున్నారు. మొత్తంగా వివిధ దశల్లో కలిపి 2035 నాటికి డబ్ల్యూటీసీ పనులు పూర్తి కావచ్చని అంచనా. డబ్ల్యూటీసీ సెంటర్ కోసం ఇప్పటికే 15 ఎకరాల స్థల సేకరణ పూర్తవగా నిర్మాణ పనులు తొలి దశలో ఉన్నాయి. మిగిలిన భూసేకణ పనులు జరుగుతున్నాయి.
శంషాబాద్‌తో డబ్ల్యూటీసీ పనులు చేపడుతున్న సంస్థనే విశాఖపట్నంలోనూ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తోంది. రిషికొండ సమీపంలో 20 లక్షల చదరపు అడుగుల సామర్థ్యంతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి ప్లాన్ రెడీ చేశారు.
చదవండి: ముందుంది పెను ముప్పు తట్టుకోలేరు: యూఎన్ చీఫ్ సంచలన హెచ్చరిక