అవగాహనే అసలు మందు
న్యూఢిల్లీ:పదహారేళ్ల యువతి మొదలుకొని 60 ఏళ్ల వృద్ధురాలి వరకు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ సోకిందా లేదా అని నిర్ధారించే వైద్య పద్ధతులు అందుబాటులో ఉన్నా వాటి గురించి మహిళలకు సరైన అవగాహన లేకపోవటంతో వ్యాధి ముదిరిన తర్వాత వైద్యులను సంప్రదిస్తున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించే మామోగ్రఫీ వైద్య పరికరం అందుబాటులో ఉంది. బయట ప్రైవేటు ఆస్పత్రుల్లో ఈ పరీక్షకు రూ.2,500 తీసుకుంటుండగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగానే ఆ సేవలు లభ్యమవుతున్నాయి.
మామోగ్రఫీతో ఉపయోగాలు...
మామోగ్రఫీ ఎక్సరే మిషన్‌తో రొమ్ములో రెండు మిల్లీమీటర్ల కన్నా తక్కువ సైజులో గడ్డలు ఉన్నా గుర్తించవచ్చు. తద్వారా రేడియేషన్, ఆపరేషన్ లాంటివి లేకుండా వైద్యం ద్వారా కొద్దిరోజుల్లోనే వ్యాధిని తగ్గించవచ్చు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షల మందికి మామోగ్రామ్ పరీక్ష చేశారు. వీరిలో 30శాతం మందికి రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ జరిగింది. జన్యులోపాలవల్ల, వంశపారంపర్యంగా, ఇన్ఫెక్షన్ల వల్ల, ఒక్కోసారి ఎలాంటి కారణం లేకుండానే రొమ్ములో గడ్డలు ఏర్పడతాయి. రొమ్ములో ఉండే ప్రతి గడ్డ క్యాన్సర్ గడ్డ కాదు. అయితే అశ్రద్ధ చేయకుండా వైద్యుడిని సంప్రదించి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవటం ద్వారా నిర్ధారించుకోవచ్చు. గ్రామస్థాయిలో ఉండే వైద్య సిబ్బంది యువతులకు రొమ్ము క్యాన్సర్ అవగాహన కల్పించాల్సి ఉంది.అవగాహన కోసం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలు పనిచేసే కార్యాలయాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి.