కేంద్ర మాజీ మంత్రులకు వారంట్లు
అనంతపురం: సమన్లు అందినా వాయిదాలకు గైర్హాజరైన కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, గులాంనబీ ఆజాద్‌లకు శుక్రవారం అనంతపురం ఏడవ ఫాస్ట్‌ట్రాక్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వై. విజయకుమార్ బెయిలబుల్ వారంట్లు జారీ చేశారు. రాష్ట్ర విభజనకు ముందు సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీలతో పాటు మంత్రులు చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే, వీరప్ప మొయిలీ, గులాంనబీ ఆజాద్, కావూరి సాంబశివరావు, ఎస్.జైపాల్‌రెడ్డిలు చేసిన ప్రకటనలు రాష్ట్రంలో అల్లర్లకు కారణమయ్యాయని, ఇది దేశద్రోహం కన్నా తీవ్రమైనదని పేర్కొంటూ 2013లో అనంతపురానికి చెందిన న్యాయవాదులు మల్లికార్జున, నాగన్న మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు.
దీన్ని పరిశీలించిన కోర్టు సరైన ఆధారాలు లేవంటూ.. పిటిషన్‌ను రిజిష్టర్ చేయకుండానే 2013 డిసెంబర్లో కేసును కొట్టివేసింది. దీన్ని సవాల్ చేస్తూ 2013 డిసెంబర్ 24న వారు సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు అర్జీదారుల వాదనలు విన్న కోర్టు ప్రతివాదుల సమాధానం కూడా విన్న మీదటే పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడం సబబని పేర్కొంటూ..ప్రతి వాదులైన ఎనిమిది మందికి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సమన్లు జారీ చేశారు.