అప్పుడే పత్తి పూతపై ఆందోళన వద్దు
యాచారం: జానెడు పత్తి మొక్కకు పూత రావడంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు యాచారం మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్. ఈ ఏడాది అదనులో వర్షాల్లేకపోవడంతో విత్తే సమయానికంటే 30 రోజుల తర్వాత రైతులు పత్తి విత్తనాలు విత్తారు. దీంతో సరైన, సమృద్ధిగా వర్షాలు లేకపోవడం వల్ల ఎదుగుదల లేక జానెడు మొక్కకే పూత పూయడం ప్రారంభమైంది.
వేలాది రూపాయల పెట్టుబడితో పత్తి సాగు చేస్తే జానెడు మొక్కకు పూసిన 5 వరకు పూతలు కాత కాస్తే పెట్టుబడులు ఎలా వెళ్లుతాయని రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. ఈ ఏడాది ఇబ్రహీంపట్నం డివిజన్లో 4 వేల హెక్టార్లకు పైగా రైతులు పత్తి పంట సాగు చేశారు. ఎకరాకు రూ.20 వేలు ఖర్చు చేశారు. ఆలస్యంగా కురిసిన వర్షాల వల్ల, సమయానుకూలంగా కురవని వర్షంతో పత్తి మొక్కల ఎదుగుదలలో మార్పు లేకుండాపోయింది.
దీంతో మొక్క జానెడు పెరగడంతోనే చెట్టుకు పూత ప్రారంభమవుతోంది. మొక్కకు 50 నుంచి 70 వరకు పువ్వులు పూసి కాతకాసి పత్తి వెళ్లితేనే రైతులకు నష్టం జరగకుండా ఉంటుంది. కానీ జానెడు మొక్కకు కేవలం 5కు మించి కూడా పూత పూయకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
జానెడు మొక్కకు పూతపై..
వర్షాలు అదనులో కురవకపోవడంతో సరైన సమయంలో పత్తి విత్తనాలు విత్తకపోవడం, విత్తిన తర్వాత కూడా వర్షాల్లేక మొక్కలు ఎదగలేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వ్యవసాయాధికారి సందీప్ కుమార్ పేర్కొంటున్నారు. సరైన విధంగా నీరు అందిస్తే 9 నెలల పాటు మొక్క బతుకుతుందని అన్నారు. జానెడు మొక్కకు పూత రావడంతో ఇకముందు పూత పూయదేమోనని రైతులు ఆందోళనకు గురి కావద్దన్నారు.
ఎకరాకు 25 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ అందించాలి. 3 అంగుళాల దూరంలో మట్టి జరిపి మందులు పోయాలి. దీంతో మొక్క గట్టిగా మారి ఎదుగుతుంది. పత్తిలో ఎరువులు అందిస్తే ఎదిగే గుణం ఉంది. అందుకే రైతులు ఆందోళనపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో జానెడు మొక్కకు పూస్తున్న పూత కారణంగా సూచించిన మేరకు మందులు వేయాలని చెప్పారు. ప్రతి నెలకోసారి క్రమం తప్పకుండా మందులు వేస్తే మొక్క పెరగడమే కాకుండా గణనీయమైన పూత, కాత వస్తుందన్నారు.
చీడపురుగులు తగలకుండా బొట్టు పద్ధతిని పాటించాలన్నారు. 100 మిల్లిమీటర్ల మోనోక్రోటోఫాస్, అర లీటర్ నీటిలో కలిపి కాండానికి బొట్టు అంటించాలని ఆయన సూచించారు. ఇలా 15 రోజులకోసారి చేస్తే రసం పీల్చే పురుగులు దరిచేరవన్నారు. ప్రస్తుతం డివిజన్లోని పత్తి మొక్కలు 45 నుంచి 60 రోజుల వయసులో ఉన్నట్లు, సరైన విధంగా సూచనలు పాటిస్తే దిగుబడి గణనీయంగా ఉంటుందని ఆయన తెలిపారు.