అంతరిక్ష పరిశోధనలో ఆయనే సాటి
మొగల్తూరు, న్యూస్‌లైన్: మారుమూల గ్రామంలో పుట్టి అంతరిక్ష పరిశోధనా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యూరని తెలిసి మొగల్తూరు గడ్డ పులకించింది. ఇక్కడే పుట్టిపెరిగిన సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిని గతంలోనే పద్మభూషణ్ వరించగా, తాజాగా ప్రసాద్ పద్మశ్రీకి ఎంపిక కావడంతో ఇక్కడి ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఒకే గ్రామం నుంచి ఇద్దరు పద్మ పురస్కారాలకు ఎంపిక కావడం గర్వకారణంగా భావిస్తున్నారు. మలపాక సూర్యనారాయణ, భాస్కరమ్మ దంపతుల మూడో కుమారుడైన ప్రసాద్ శాస్త్ర, సాంకేతిక రంగంలో ఉన్నతస్థారుుకి ఎదిగారు. 1953 మే4న మొగల్తూరులో పుట్టిన ప్రసాద్ 1968లో ఇక్కడి పెన్మత్స రంగరాజా జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. 1969లో ఏలూరులో పీయూసీ చదివారు.
కాకినాడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ అభ్యసించారు. తిరువనంతపురం ఇస్రో కేంద్రంలో జూనియర్ సైంటిస్ట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అందులో ఉన్నత పదవులను అధిరోహించారు. చంద్రయాన్-1 విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ప్రసాద్ ఇటీవల మార్స్ ఉప గ్రహ ప్రయోగంలోనూ ముఖ్యభూమిక పోషించారు. మొగల్తూరు వాసులు చిట్టిబాబుగా పిలుచుకునే ప్రసాద్‌కు పద్మశ్రీ దక్కడంపై గ్రామస్తులు పులకించిపోతున్నారు. ప్రసాద్‌కు ఆయన చిన్ననాటి స్నేహితులైన అనంతపల్లి బుల్లెబ్బాయి, ఉద్దగిరి వెంకన్న, పడాల భాస్కరరావు, అయితం దుర్గారావు, దూసనపూడి ఆదియ్య, నాగళ్ళ నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు.