నా భర్తది హత్యే...ఆత్మహత్య కాదు: గీత
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్ఐ రమేశ్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల నుంచే ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. పొద్దేముల్ మండలం కందినెళ్లి గ్రామ సమీపంలో ఎస్ఐ చెట్టుకు శవమై కనిపించారు. గతంలో పెద్దేముల్లో ఎస్ఐగా పనిచేసిన రమేశ్ ఇటవలే యాలాల పోలీసుస్టేషన్‌కు బదిలీపై వచ్చారు. ఇంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా ఎస్ఐ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అంటున్నారు. అయితే ఇసుక మాఫియా ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఎస్ఐ రమేష్ ఆత్మహత్య అనుమానాస్పదంగా మారుతోంది. ఉన్నతాధికారుల వేధింపులా లేదా మరోటి కారణమై ఉండవచ్చని ఎస్ఐ కుటుంబసభ్యులు ఆరోపణలు వస్తున్నాయి. శ్రీనివాస్ బంధువులను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రి మహేందర్‌రెడ్డిని కూడా అడ్డుకున్నారు. అతని మృతి కేసును సీఐడీకి అప్పగించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
కాగా రమేశ్‌కు ఇటీవలే పెళ్లయింది. అతడు చనిపోయే ముందు భార్య గీతతో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలోనే తన భర్తకు ఫోన్ వచ్చిందని, అయితే ఫ్యామిలీతో బయటకు వచ్చానని చెప్పినా... పై అధికారులు త్వరగా విధులకు రావాలని ఫోన్లు మీద ఫోన్లు వచ్చాయని తెలిపారు. బయటకు వెళ్లిన తన భర్త శవమై కనిపించాడని ఆమె విలపించారు. ఒకవేళ తన భర్త ఆత్మహత్య చేసుకుంటే ఒంటిపై గాయాలు ఎందుకు ఉంటాయని ఎస్ఐ భార్య ప్రశ్నించారు.
ఇసుక మాఫియాతో చేతులు కలిపిన పోలీసులు... తమ కుమారుడిని మట్టుపెట్టారని ఆరోపించారు. తమకు న్యాయం జరగాలని, అవసరం అయితే మృతదేహంతో డీజీపీ కార్యాలయానికి వెళతామని తెలిపారు. కాగా చివరిసారిగా ఎస్ఐ రమేశ్ ..భార్యకు మెసేజ్ పంపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.