టీడీపీతో పొత్తుంటే బీజేపీ నాశనం: యెండల
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే బీజేపీ నాశనం అవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ యెండల లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వచ్చిన బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్‌ను ఆయన గురువారం ఉదయం కలిశారు. అనంతరం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణలో టీడీపీకి బలమే లేదన్నారు.
బీజేపీలోని కొందరు నేతలు తమ స్వార్థం కోసమే పొత్తు కావాలంటున్నారని ఆయన ఆరోపించారు. ఇదే అంశంపై అంతకు ముందు యెండల ప్రతినిధి రాజ్‌నాథ్ సింగ్‌కు వినతి పత్రం సమర్పించింది. సైకిల్‌తో పొత్తుకు రాష్ట్ర బీజేపీ నేతలు విముఖత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
కాగా మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే తెలుగుదేశం అవసరం ఎంతో ఉందని బాకా ఊదుతున్నారు. పొత్తు విషయంలో బీజేపీ నేతలు ఎవరైనా స్పందించినా నోరు మెదపొద్దని పార్టీ నేతలకు ఆయన సూచించారు.