Yavatmal district
-
కరోనా కల్లోలం.. మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్
ముంబై: మహమ్మారి వైరస్ విజృంభిస్తుండడంతో మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ విధించారు. రోజుకు 5 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సరికొత్త నిబంధనలు విధిస్తూ బృహన్ ముంబై కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైతో పాటు విదర్భ ప్రాంతంలోని రెండు జిల్లాల్లో సరికొత్త నిబంధనలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విదర్భ ప్రాంతంలోని అమరావతి, యావత్మాల్ జిల్లాలో పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అమరావతి జిల్లాలో వారాంతాల్లో లాక్డౌన్ పాక్షికంగా సడలించారు. ఇక ముంబైలో శుభకార్యాలు, సామూహిక కార్యక్రమాలను నిషేధిస్తూ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. మాస్క్‌లు లేకుండా తిరిగే వారిని గుర్తించడానికి 300 మంది మార్షల్స్‌ను బీఎంసీ ఏర్పాటుచేసింది. మాస్క్‌లను లేని వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నారు. 28వ తేదీ వరకు విద్యాలయాలన్నీ మూసివేస్తూ యావత్మాల్ జిల్లా అధికారులు ప్రకటించారు. పెళ్లిళ్లకు కేవలం 50 మంత్రిని మాత్రమే అనుమతిస్తూ కలెక్టర్ డీఎం సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. హోటల్స్ ఉదయం 8 నుంచి రాత్రి 9.30 గంటల వరకు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరచుకోవచ్చు. రెండు జిల్లాల్లో రాత్రిళ్లు లాక్డౌన్ విధిస్తూ నిర్ణయించారు. రాత్రి కర్ఫ్యూ వాతావరణం అమల్లో ఉండనుంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య: 20,81,520. మృతుల సంఖ్య 51,669. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే కేసులు, మృతుల సంఖ్య నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే అన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతుండగా మహారాష్ట్రలో పెరుగుతుండడంతో తాజా లాక్డౌన్ విధించారు. తాజాగా గురువారం 5,427 కేసులు నమోదయ్యాయి. -
‘ఉరి’ కౌగిట రైతు ఊపిరి..!
సాక్షి, ముంబై: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అకాలవర్షాలకు లేదా నీటిఎద్దడితో దెబ్బతింటుండటం రైతుల పాలిట శాపంగా మారాయి. దీంతో పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో రైతు ఆత్మహత్యల సంఖ్య నానాటికీ అధికమవుతోంది. ఓ వైపు కరువు, మరోవైపు అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. గత రెండు నెలల్లో సుమారు 125 మందికిపైగా ఆత్మహత్య చేసుకున్నారు. దీన్నిబట్టి రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంతదయనీయంగా ఉందన్నది స్పష్టమవుతోంది. ఓ వైపు పంట కోసం తీసుకున్న అప్పులు వడ్డీతో తడిసిమోపెడు కాగా మరోవైపు ఇంట్లో తినేందుకు కూడా తిండి గింజలు లేని పరిస్థితి. దీనికితోడు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి మద్దతు లభించడంలేదు. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో రైతులను ఆదుకునే విషయంపై ప్రభుత్వం కీలకనిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా అకాల వర్షాలు, నీటి ఎద్దడి కారణంగా పంటలకు నష్టం వాటిల్లింది. ఇలా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించి ఆదుకోకపోతే ఆత్మహత్యల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. యావత్మాల్ జిల్లాలో రోజుకో ఆత్మహత్య..! రాష్ట్రంలో అత్యధికంగా యావత్మాల్ జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. గత రెండు నెలల్లో ఇక్కడ 60 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇదిలా ఉండగా, ఈ జిల్లాలో గడిచిన 11 నెలల్లో 224 మంది బలవన్మరణాలకు పాల్పడినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. ఆత్మహత్యలకు పాల్పడినవారందరు దాదాపు ఉరి వేసుకునో లేదా విషం తాగి ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అమరావతి జిల్లాలో 45 రోజుల్లో 20 మంది... అమరావతి జిల్లాలో గత 45 రోజుల్లో అప్పులబాధ తాళలేక 20 మంది ఆత్మహత్య పాల్పడ్డారు. అయితే వీరిలో కేవలం ఒక్కరైతును మాత్రమే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేందుకు యోగ్యుడిగా గుర్తించింది. మిగతా వారందరికి నష్టపరిహారం ఇచ్చేందుకు నిరాకరించినట్టు తెలిసింది. అకోలా జిల్లాలో నెలరోజుల్లో 11 ఆత్మహత్యలు అకోలా జిల్లాలో గడిచిన నెల రోజుల్లో 11 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరిలో అకోలా, పరతూర్ తాలూకాకి చెందినవారే అధికంగా ఉన్నారు. -
ఒకే రోజు ఆరుగురు రైతుల ఆత్మహత్య
నాగపూర్: విదర్భలో బుధవారం ఒకే రోజు ఆరుగురు రైతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. యావత్మాల్ జిల్లాలో నలుగురు అన్నదాతలు బలవన్మరణం పాలయ్యారు. అకోలా, అమరావతి జిల్లాల్లో ఒక్కొక్కరు ఆత్మహత్య చేసుకున్నారని విదర్భ జన ఆందోళన్ సమితి అధ్యక్షుడు కిశోర్ తివారి తెలిపారు. తమ కష్టాలు తీరుస్తుందన్న ఆశతో కేంద్రం, మహారాష్ట్రలో బీజేపీకి ప్రజలు ఓటు వేశారని ఆయన తెలిపారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు బీజేపీ చర్యలు చేపట్టాలని కోరారు. విదర్భలో పర్యటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. జాతీయ నేర గణాంక విభాగం లెక్కల ప్రకారం విదర్భలో గతేడాది 3,146 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.