Yoga training program
-
‘ఆన్లైన్’లో యోగా చేర్చండి
సాక్షి, న్యూఢిల్లీ: సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్లైన్ విధానంలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న విద్యాసంస్థలు.. ఈ విద్యావిధానంలో యోగాను కూడా చేర్చాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. కరోనా మహమ్మారి విజృం భిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలోని ప్రతి ఒక్కరికీ అవసరమైన రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగా ఓ అద్భుతమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. ఆదివారం స్పిక్ మెకే సంస్థ నిర్వహించిన డిజిటల్ యోగా అండ్ మెడిటేషన్ శిబిరం’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఆన్లైన్లో యోగా సాధకులకు సందేశాన్నిచ్చారు. పాఠశాల స్థాయినుంచే యోగాభ్యాసాన్ని అలవర్చడం ద్వారా భవిష్యత్ భారతాన్ని మరింత సమర్థవంతంగా మార్చేందుకు వీలుంటుందని ఆకాంక్షించారు. చిన్నారుల కోసం 13 యోగాసనాల జాబితాను ‘యునిసెఫ్ కిడ్ పవర్’ప్రస్తావించడంపై ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. -
ప్రభుత్వ సంస్థల్లో యోగా బ్రేక్
న్యూఢిల్లీ: వృత్తి నిపుణుల్లో పని ఒత్తిడిని తగ్గించడానికి రూపొందించిన 5 నిమిషాల యోగా విరామం (వై–బ్రేక్) త్వరలోనే ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థల్లో అమల్లోకి రానుంది. ఈ యోగా బ్రేక్‌లో 5 నిమిషాల్లో పూర్తి చేయగల కొన్ని తేలికైన వ్యాయామాలుంటాయి. మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా విద్యాలయం, యోగా నిపుణుల సాయంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఈ వై–బ్రేక్ ప్రొటోకాల్ ట్రయల్స్‌ను సోమవారం ప్రారంభించింది. ఇందులో పాల్గొనడానికి టాటా కెమికల్స్, యాక్సిస్ బ్యాంక్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ గ్లోబల్ కన్సల్టింగ్ సర్వీసెస్ తదితర 15 సంస్థలు ఆసక్తి చూపించాయని ఓ అధికారి తెలిపారు. ఈ వై–బ్రేక్ అనేది యోగా కోర్సు కాదని, కానీ కోర్సుకు సంక్షిప్త ప్రారంభ మాడ్యూల్ అని పేర్కొన్నారు. యోగా ప్రొటోకాల్స్ తయారీ ప్రక్రియ 3 నెలల క్రితమే తయారైందని తెలిపారు. వై–బ్రేక్ అభ్యాసంలో భాగంగా ఒక బుక్లెట్ తయారు చేశామని, పనిస్థలాల్లో ఎలా ఉండాలో దానికి సంబంధించిన స్థితులతో కూడిన వీడియో చిత్రాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. -
డల్లాస్‌లో ఘనంగా ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు
టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్), ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) డల్లాస్‌లో ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు నిర్వహించింది. జెన్స్టార్ మాంటెస్టరీ అకాడమీలో సభ్యుల ఆరోగ్య అవగాహన కోసం డిసెంబరు 14న ఏర్పాటు చేసిన ప్రాథమిక యోగా శిక్షణా సదస్సు అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంతో ఘనంగా జరిగింది. ప్రస్తుత టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం వీర్నపు, కళ్యాణి తాడిమేటి (సుఖీభవ కమిటీ సమన్వయ కర్త), సాంబ దొడ్డ(తానా SW region RVP) అందరికి స్వాగతం పలికారు. టాంటెక్స్, తానా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించి సభకు టాంటెక్స్, తానా కార్యవర్గ సభ్యులను పరిచయం చేసి, వారి సహాయ సహకారాలతోనే ఇటువంటి మంచి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురాగలుగుతున్నాం అని చెప్పారు. తదుపరి దత్త యోగా క్రియ టీచర్స్ ప్రశాంత దుల్లూర్, శివరాజు జయన్నలను సభకు పరిచయం చేసి కార్యక్రమం ప్రారంభించారు. యోగా టీచర్స్ ప్రశాంత్ దుల్లూర్, శివరాజు జయన్న ముందుగా టాంటెక్స్, తానా వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం యోగా ప్రక్రియ గురించి యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నాడి సుద్ధి వ్యాయమాన్ని అందరికీ ఎలా చేయాలో చూయించి అందరూ ఆ వ్యాయామాన్ని ఎవరికి వారు చేయగలిగేలా నేర్పించారు. అలాగే ఆసనాలు, సూర్య నమస్కారాలు వాటివల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. సూర్యనమస్కారాల వల్ల జీర్ణశక్తి పెరుగుతుందని శరీరంలో నాడులన్నీ చక్కగా పనిచేస్తాయని మలబద్ధకం లాంటి రోగాల నుంచి ఉపశమనం కలుగుతుందని తెలియజేశారు. యోగా మనకి పూర్వీకులు అందించిన మంచి ప్రక్రియ అని దాన్ని మనం సక్రమంగా వాడుకోగలిగితే మంచి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని తెలియజేశారు. చివరిగా ప్రాణాయమ ప్రక్రియను నేర్పి మన శరీరంలో ప్రతి అవయవం మన శ్వాసతో కలిసి పనిచేస్తుందని సరైన శ్వాసతో నాడులు పనితీరును యోగా ప్రక్రియ ద్వారా మెరుగుపర్చుకోవచ్చని తెలియజేశారు. అక్కడకు వచ్చిన సభ్యులు అందరూ ఎంతో ఓపికగా యోగాలో మెళకువలను నేర్పిన యోగా టీచర్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్య అతిథులుగా వచ్చిన యోగా టీచర్స్ ప్రశాంత్ దుల్లూర్, శివరాజు జయన్నలను టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, సాంబ దొడ్డ (తానా sw region rvp), శ్రీకాంత్ పోలవరపు(తానా ఫౌండేషన్ డైరెక్టర్), కళ్యాణి తాడిమేటి(సుఖీభవ కమిటీ సమన్వయకర్త) శాలువా, జ్ఞాపిక ఇచ్చి సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం మాట్లాడుతూ యోగా టీచర్స్ ప్రశాంత్ దుల్లూర్, శివరాజు జయన్న సేవలను కొనియాడారు. టాంటెక్స్, తానా తరపున యోగా కార్యక్రమం చేయడానికి సహకరించినందుకు చాలా ఆనందంగా ఉందని, ఇటువంటి కార్య్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించినవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంబ దొడ్డ, శ్రీకాంత్ పోలవరపు, మురళి వెన్నం, కళ్యాణం తాడవిమేటి తదితరులు పాల్గొన్నారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్, తానా కార్యవర్గ సభ్యులకు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
యోగాకు ‘సై’ అనండి!
సోమాజిగూడ: ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగ సాధనను చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. రాజ్‌భవన్ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా యోగా తరగతులను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 5.30 నుంచి 6.30 వరకు సాంస్కృతిక భవన్లో ఏర్పాటు చేసిన ఈ తరగతులను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా..సమాజంలో చాలా మంది శారీరక శ్రమకు దూరమయ్యారని, కనీసం నడవడం కూడా మానుకున్నారన్నారు. ప్రతిరోజూ గంటపాటు తాను యోగా సాధన చేస్తానని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ఫిట్ ఇండియా ఉద్యమానికి బలం చేకూర్చేలా ప్రతిరో జూ అందరం యోగా చేద్దామన్నారు. తెలంగాణ లోని ప్రజలంతా యోగా ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత దీన్ని నిత్యకృత్యం చేసుకోవాలని గవర్నర్ పిలుపునిచ్చారు. రాజ్‌భవన్ పాఠశాలలో... రాజ్‌భవన్ ప్రభుత్వ స్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 450 మంది విద్యార్థులకు ప్రతి శనివారం యోగా తరగతులను నిర్వహిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. ఫిట్నెస్ పై పాఠశాల విద్యార్థుల్లో అవగాహన, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాజ్‌భవన్ స్కూల్లో యోగా గురువు రవికిషోర్ శిష్య బృందం పర్యవేక్షణలో యోగా తరగతులను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గవ ర్నరు కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, సలహాదారు ఎ.పి.వి.యన్.శర్మ, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, డిప్యూటీ సెక్రటరీ రఘుప్రసాద్ తదితర 200 మంది సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యార్థులకు ఏకాగ్రత తప్పనిసరి
1600 మంది విద్యార్థులకు యోగా శిక్షణ అల్లూరు : మండల కేంద్రంలోని రామకృష్ణ విద్యాసంస్థలలో శుక్రవారం గణపతి సచ్చిదానంద ఆశ్రమం వారి ఆధ్వర్యంలో దత్త క్రియా యోగా ఫౌండేషన్ వారు 1600 మంది విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. అంతర్జాతీయ యోగా శిక్షకుడు రాజారామ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఏకాగ్రత తప్పనిసరి అని, యోగాతో ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యోగా శిక్షకులు నిర్మలా నందా, సుబ్రమణ్యం శాస్త్రి, రామ నిర్మల, డాక్టర్.కామేశ్వరీ, చాయాదేవి, రేబాల శైలకుమారి, బాలకృష్ణశాస్త్రి, రామకృష్ణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణారెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు పప్పు శ్రీనివాసులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
వేల మందితో యోగా శిక్షణ
ఏలూరు సిటీ: ఏలూరు ఇండోర్ స్టేడియంలో ఈనెల 21వ తేదీన యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జరిగిన సమావేశంలో కలెక్టర్, జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగా శిక్షణలో 3 వేల మంది పాల్గొంటారని, ఉదయం 6.30 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఉదయం 7 గంటలకు యోగా మొదలుపెట్టి 7.33 గంటల వరకూ శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయూలన్నారు. ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్, బ్రహ్మకుమారి ఆర్గనైజర్ బీకె లావణ్య, బీకే కృష్ణారావు, బీకే రాంబాబు, ఆయుష్ శాఖ డాక్టర్ శ్యామ్‌సుందర్ పాల్గొన్నారు. ఏలూరు బాలయోగి సైన్సు పార్కులో బుధవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉద్యోగులకు యోగా శిక్షణ ఇచ్చారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు యోగాలో మెళకువలు నేర్చుకున్నారు. 20న సెయింట్ ఆన్స్‌లో ‘బడి పిలుస్తోంది’ ఏలూరు సెయింట్ ఆన్స్ స్కూల్లో ఈ నెల 20న బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తుంచనున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం అధికారులతో మాట్లాడుతూ రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేస్తారన్నారు. టెన్త్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేసి, నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను మంత్రి సత్కరిస్తారన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు మంత్రి చేతులమీదుగా బహుమతులు అందజేస్తామన్నారు. ఐదేళ్ల పైబడిన విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఎస్పీ భాస్కర్‌భూషణ్, ఆర్డీవో నంబూరి తేజ్‌భరత్, డీఈవో డి.మధుసూదనరావు, సర్వశిక్షాభియాన్ ఎంఈవో కె.కృష్ణారావు పాల్గొన్నారు.