షార్జాలో భారత యువతి అరెస్టు
* తల్లికి చెందిన రూ.5 కోట్ల బంగారంతో పారిపోవడానికి యత్నం
* యువతితోపాటు పాక్కు చెందిన ఆమె స్నేహితుడిని అరెస్టు చేసిన పోలీసులు
దుబాయ్: తల్లికి చెందిన 20 కిలోల బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ఓ భారత యువతిని, పాకిస్తాన్కు చెందిన ఆమె స్నేహితుడిని షార్జా పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ కలిసి మరో దేశంలో స్థిరపడేందుకు పారిపోవాలని నిర్ణయించుకున్నట్టు విచారణలో తేలింది.
భారత్కు చెందిన ఓ మహిళ తన బంగారు ఆభరణాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అనుమతి పొందేందుకు షార్జా కస్టమ్స్ డిపార్ట్మెంట్కు వెళ్లారు. ఆ సమయంలో ఆమె కుమార్తె (20) కారులోనే ఉంది. ఆ మహిళ తిరిగొచ్చేసరికి కుమార్తె కనిపించలేదు. దీంతో తన కుమార్తె కనిపించడంలేదని ఆమె పోలీసులను ఆశ్రయించారు.
అయితే ఆ యువతి కిడ్నాప్ కాలేదని, దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారు నగలు తీసుకుని స్నేహితుడైన పాక్ జాతీయుడు మామ్ దగ్గరకు వెళ్లిపోయినట్టు పోలీసులు కనుగొన్నారు. ఇద్దరూ కలిసి మరో దేశానికి పారిపోవాలని ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. విచారణలో ఇరువురూ నేరం అంగీకరించారని పోలీసులు వెల్లడించారు.