by ysrcp
-
నిరుద్యోగులకు బాసటగా ‘ఉద్యోగపోరు’
9న కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిరసన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు కాకినాడ : నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9న కలెక్టరేట్ ఎదుట నిరన కార్యక్రమం చేపట్టనున్నట్టు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం సాయంత్రం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. ఇచ్చిన వాగ్దానం మేరకు నెలకు రూ.2 వేల చొప్పున 32 నెలలకు ఒక్కో నిరుద్యోగికి రూ.64 వేల చొప్పున తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్ష వరకు బ్యాక్లాగ్పోస్టులతో పాటు ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ కావలసి ఉందన్నారు. వీటి నియామకంపై దృష్టి పెట్టకుండా కేవలం కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగ యువతనే కాక మహిళలు, రైతులు, ఇతర వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్కు వారే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఉద్యోగపోరులో భాగంగా ఈ నెల 9న ఉదయం 10 గంటలకు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఒరగబెట్టింది ఏమీలేదని విమర్శించారు. ఉద్యోగాలూ లేక, నిరుద్యోగ భృతి రాక యువత ఎంతో వేదనకు గురవుతోందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు నిరుద్యోగ యువత సిద్ధంగా ఉందన్నారు. -
వారిద్దరూ దళిత ద్రోహులే...
కారెం, చంద్రబాబులపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం మధురపూడి : దళితుల సంక్షేమం గురించి ఏనాడూ పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కారెం శివాజీలు.. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడం తగదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కొల్లి నిర్మలకుమారి, రాజోలు నియోజవకర్గ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు, పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలమునికుమారి అన్నారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో మంగళవారం వారు విలేకర్లతో మాట్లాడారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు కూడా మంజూరు చేయని చంద్రబాబును సన్మానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తున్న కారెం శివాజీ వ్యూహాత్మకంగానే సన్మాన కార్యక్రమం నిర్వహించారని ఎద్దేవా చేశారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దళితులు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందారన్నారు. చంద్రబాబు దళితులకు చేసిన ద్రోహులను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్సీపీ నేతలు స్పష్టం చేశారు. ఆత్మవిమర్శ చేసుకోకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడం మానుకోవాలని చంద్రబాబు, కారెంలకు హితవు పలికారు. లేకుంటే దళితులే తగిన బుద్ధి చెబుతారని నిర్మలకుమారి, రాజేశ్వరరావు, మునికుమారి అన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెట్టా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.