zilla parish office
-
జెడ్పీ ఆస్తులు అన్యాక్రాంతం
ఒంగోలు సిటీ: సొంత స్థలమైతే కంచె వేస్తాం.. కట్టడి చేసుకుంటాం. అన్యుల పాలు కాకుండా కాపాడుకుంటాం. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు జాగ్రత్తగా దాచుకుంటాం. పశువులు రాకుండా, వర్షం, మురుగు నీళ్లు నిలవకుండా మెరకలు పోస్తాం. ప్రతి ఒక్క యజమాని తన ఆస్తిని సంరక్షించుకొనే పద్దతి ఇదే. జిల్లా పరిషత్ విషయానికొస్తే అందుబాటులో ఉన్న ఆస్తులను నిర్వహించుకోవడంలో నిర్లక్ష్యం. విలువైన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు లేవు. కనీసం గుర్తించే పనిలోనూ లేరు. ఆస్తికి సంబంధించిన డాక్యుమెంట్లు భద్రపరిచిన దాఖలాలు లేవు. జెడ్పీకి ఎంత మొత్తంలో ఆస్తులు ఉన్నాయి.. వాటి విలువ ఇతర వివరాలను అడిగి చూడండి.. మాకు తెలియదనే జవాబు వస్తుంది. ఇది జెడ్పీలో ఆవరించిన నిర్లక్ష్యానికి నిదర్శనం. జిల్లాలో స్థానిక సంస్థలకు విలువైన ఆస్తులు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయో కొన్నింటికే వివరాలు ఉన్నాయి. మూడొంతుల స్థలాలు ఎవరి కబ్జాలో ఉన్నాయో తెలియవు. భూమి స్వరూపం ఏ విధంగా మారిపోతుందో తెలుసుకొనే ప్రయత్నం చేయడం లేదు. ఇప్పుడు భూమి విలువ బాగా పెరిగింది. ఒకప్పుడు ఎకరా రూ.లక్షలోపు విలువ ఉంటే ఇప్పుడు అదే ఎకరా రూ.2 కోట్లు పలుకుతోంది. జిల్లా పరిషత్తుకు సంబంధించి 17 ఎకరాల భూమి ఒంగోలు శివారు మంగమూరు సర్వే నంబర్లో ఉంది. దీనిలో ఇప్పుడు సుబాబుల్, జామాయిల్ తోట వేసి ఉంది. ఇప్పుడు జెడ్పీ నిర్వహణలో ఉందని చెబుతున్నా.. వాస్తవానికి ఓ పలుకుబడి ఉన్న వ్యక్తి దీనిని ఆ«ధీనంలో ఉంచుకున్నారు. ఒకప్పుడు అంతగా కన్ను లేకపోవడంతో సదరు వ్యక్తి తోట పెంచుకుంటూ ఈ భూమి తనదే అన్పించుకున్నారు. ఎకరా విలువ రూ.2 కోట్లకు చేరడంతో ఎన్జీవోలు తమకు ఇంటి నివేశన స్థలానికి పట్టా ఇవ్వమని, కొందరు మార్కెట్ విలువ ప్రకారం అమ్మమని, మరి కొందరు నిరు పేదలకు ఇంటి నివేశన స్థలాలను ఇవ్వమని, తాజాగా జెడ్పీ ఉద్యోగులు తమదే ఈ స్థలం కావడంతో తమకు ఇళ్ల కోసం కేటాయించమని రకరకాలుగా ఒత్తిళ్లు నెలకున్నాయి. ఇందరి కన్ను ఉండటంతో దీని జోలికి వెళ్లాలంటే తేనె తుట్టెను కదిలించినట్లేనని మిన్నకుండి పోయారు. కొందరు క్రయ విక్రయాలు జరిగాయని ఒప్పంద పత్రాలతో లిటిగేషన్లకు పూనుకున్నారు. తాగునీటి కోసమే.. ఇంత విలువైన ఆస్తిని ఎవ్వరికీ ఇవ్వబోమని అప్పటి జిల్లా సంయుక్త కలెక్టర్ లక్ష్మీనసింహం దీనిపై ప్రత్యేకంగా నివేదిక తయారు చేశారు. ఒంగోలు ప్రజలకు తాగు నీటికి ఇప్పుడున్న వేసవి చెరువులు రెండిటిలోనూ నీటి నిల్వ సామర్థ్యం సరిపోవడం లేదని తన నివేదికలో పేర్కొని తాగునీటి కోసమే ఈ 17 ఎకరాలను ఉపయోగిస్తామని స్వాధీనంలోకి తీసుకోమని రెవెన్యూ అధికారులకు సూచన చేస్తూ ఆర్డీవోను భూమిని స్వాధీనంలోకి తీసుకోమని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు ఇప్పుడు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. ఆయన ఇన్‌ఛార్జి జెడ్పీ సీఈవోగా బాధ్యతలను నిర్వహించినప్పుడు స్వాధీనం కోసం తయారు చేసిన నివేదికను గల్లంతు చేశారు. ఇప్పుడు సంబంధిత రికార్డు ఏమైందో కూడా తెలియని పరిస్థితి. జిల్లా కేంద్రంలోని జెడ్పీ భూమి పరి స్థితి ఇలా ఉంటే ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆస్తుల పరిస్థితి.. వాటి అన్యాక్రాంతం వివరాలు ఎక్కడున్నాయన్న ప్రశ్న సర్వత్రా నెలకొంది. కబ్జా వెయ్యి ఎకరాల పై మాటే.. పొన్నలూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల భూమిని కొందరు ఆక్రమించారు. ఇదేమి చోద్యం హైస్కూలు.. అందులోనూ నిరుపేద పిల్లలకు చదువు చెప్పే కోవెల. అలాంటి స్థలాన్ని ఎలా కబ్జా చేస్తారని అడిగిన వారు లేరు. కొందరు ప్రజా ప్రతినిధులు కబ్జా చేసిన వారికే వత్తాసు పలికారు. ఇంకేం వారికే భూమిని బదలాయించి ఇంటి నివేశన స్థలాలు ఇచ్చారు. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి జిల్లా వ్యాప్తంగా కోకొల్లలుగా ఉన్నాయి. జెడ్పీ పరిధిలో సుమారు మూడు వేల ఎకరాలు ఉన్నాయి. ఇందులో జెడ్పీ కార్యాలయాలు ఉన్నాయి. దుకాణాల సముదాయాలు ఉన్నాయి. అతిథి గహాలు నిర్మించారు. విడిది కేంద్రాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థలాలు ఉన్నాయి. వీటి విలువ ఇప్పుడు లెక్క గడితే రూ.30 వేల కోట్లే అంటున్నారు. ఒంగోలు దక్షిణ బైపాస్ రోడ్డు కూడలిలో జిల్లా పరిషత్తు స్థలం ఉంది. ఇక్కడ కార్యాలయాన్ని నిర్మించాలని శంకుస్థాపన చేశారు. ఇందు కోసం రూ.2 కోట్లు ఎంఎన్‌పి గ్రాంటు నుంచి నిధులు కేటాయించారు. ఖాళీగానే ఉంచేశారు. నిధులు వెనక్కి పోయాయి. ఇప్పుడు ఈ ఖాళీ స్థలాన్ని కొందరు కన్నెశారు. కల్యాణ మండపానికి లీజు కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీ నేతల వద్ద కల్యాణ మండపానికి మంతనాలు కూడా జరిగాయి. మండల పరిషత్‌లు పరిధిలో సుమారు 1300 ఎకరాలు భూములు ఉన్నాయి. జెడ్పీ హైస్కూలు స్థలాలు సుమారు 1200 ఎకరాలు ఉన్నాయి. వీటి విలువ లెక్క కట్టలేనిది. జెడ్పీ హైసూళ్ల స్థలాల చుట్టూ జెడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు సూళ్లకు ప్రహరీలను నిర్మించారు. స్కూళ్ల స్థలాలను కట్టడి చేశారు. ఇక అన్యాక్రాంతం కావడానికి వీల్లేకుండా ఫెన్సింగ్ వేశారు. పొన్నలూరు తరహాలోనే 250 ఎకరాల వరకు అన్యాక్రాంతమైనట్లుగా లెక్కలున్నాయి. అయి తే స్థానిక రాజకీయ నాయకులను కాదని ఎవ్వరు పట్టించుకోగలరంటున్నారు. విలువైన మండల పరిషత్తు, హైస్కూలు స్థలాలు అన్యులపరమై ఉన్నాయి. నిర్వహణ అంతం మాత్రమే.. జిల్లాలోని కొత్తపట్నం, ఒంగోలు, మార్కాపురం, సీఎస్‌పురం, కందుకూరు ఇలా పలు చోట్ల అతిథి గృహాలు, దుకాణ సముదాయాలు ఉన్నాయి. గిద్దలూరు, మార్టూరు, ఒంగోలులో దుకాణాలు ఉన్నాయి. వీటిని నిర్వహించుకొనే పరిస్థితి లేకుండా పోయింది. రూ.కోట్ల విలువైన స్థలాలు, ఆస్తులు దెబ్బతింటున్నా పట్టించుకోవడం లేదు. నిధులు లేవంటూనే నెట్టుకొస్తున్నారు. నిర్వహణలేక, ఆలనా పాలన లేక విలువైన ఆస్తులు దెబ్బతినిపోతున్నాయి. రికార్డులు గల్లంతు.. విలువైన జెడ్పీ ఆస్తులకు సంబంధించిన కాగితం ముక్క కార్యాలయంలో అందుబాటులో లేదు. ఏ వివరాలు అడిగినా దిక్కు దివాణా లేదు. అసలు రికార్డు నిర్వహించుకోవడానికి ప్రత్యేకించి విభాగం లేకపోవడం గమనార్హం. మండలాల్లోనూ అదే పరిస్ధితి నెలకుంది. జేసీ లక్ష్మీ నసింహం ఉన్నప్పుడు కొంత సమాచారాన్ని సేకరించారు. దానిని కూడా ఎక్కడుంచారన్నది వివరాలు లేవు. రెవెన్యూ శాఖకు కాంతిలాల్ దండే జెడ్పీ ప్రత్యేకాధికారిగా ఉన్నప్పుడు ఆస్తుల వివరాలు తేల్చమని ఆదేశించారు. ఆయన ఆదేశాలు భేఖాతరయ్యాయి. రెవెన్యూలో లెక్క చేసిన వారు లేరు. కొంత రికార్డు ఉన్నా దానిని బయట పెడితేనే రూ.వందల కోట్లు విలువైన ఆస్తులు బయటకొస్తాయి. అందుకే వీటిపై విచారణలు లేవు. సుమారు వెయ్యి ఎకరాలు స్థలాలు అన్యులపాలయినట్లుగా గుర్తించారు. ఇంకా లెక్కలేనన్ని ఆస్తులు ఉంటాయన్నది అంచనా. వీటి విలువ సుమారు ప్రస్తుత మార్కెట్ ప్రకారం రూ.700 కోట్లకుపైమాటే. రికార్డులను తయారు చేద్దామన్న ధ్యాసలేదు. చేతులు దులుపుకుంటున్న పాలకులు.. ఇటీవల వెబ్ పోర్టింగ్ చేసినప్పుడు కొన్ని వివరాలు ఆర్ఎస్ఆర్ దాఖలా బయట పడ్డాయి. దాతలు జెడ్పీకి కొన్ని ఆస్తులను భూరి విరాళాలుగా ఇచ్చారు. అలాంటివి బయటకు రాలేదు. దాతలు ఇచ్చిన ఆస్తులు పరుల పాలయ్యాయి. వీటిలో మూడొంతులు ఆస్తులకు సరైన రికార్డులు లేవు. ఉన్న రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్ని రికార్డులను గల్లంతు చేశారు. వీటిపై పాలకులు శ్రద్ద వహిస్తే విలువైన ఆస్తుల వివరాలు బయటకు వస్తాయి. పాలకులు వస్తున్నారు.. పోతున్నారు.. చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ పాలక వర్గానికి గడువు ఇక నెలన్నర మాత్రమే ఉండడం గమనార్హం. జెడ్పీ విలువైన ఆస్తులపై దృష్టి సారిస్తారన్న విశ్వాసం ప్రజల్లో నెలకోవడం గమనార్హం. -
జిల్లాకో జెడ్పీ
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): తెలంగాణ ప్రభుత్వం పారిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ నాలుగు జిల్లాలుగా విడిపోయింది. దీనికి తోడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నేడో, రేపో నారాయణపేట జిల్లాగా ఏర్పడనుంది. తద్వారా జిల్లాల సంఖ్య ఐదుకు చేరుతుంది. అయితే, జిల్లాల విభజన తర్వాత అన్ని శాఖల్లో దస్త్రాలు, ఉద్యోగులను పంపిణీ చేసినా... జిల్లా పరిషత్ మాత్రం మిగిలిపోయింది. తాజాగా కొత్తగా అవిర్భవించిన జిల్లాలకు అనుగుణంగా జెడ్పీలు ఏర్పాటు చేయడానికి పంచాయతీరాజ్ శాఖ సన్నాహాలు చేస్తుంది. ఫలితంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొత్తగా ఏర్పాటు కానున్న నారాయణ పేట జిల్లాతో కలిపి మొత్తం ఐదు జిల్లా పరిషత్‌లు ఏర్పాటు కానున్నాయి. చైర్మన్, వైస్ చైర్మ న్ వంటి పదవులతోపాటు పెరిగిన మండలా ల వారీగా ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు పెరగనున్నాయి. ఈ విషయమై వివిధ పార్టీల్లోని ఆ శావహుల్లో ఉత్సాహం నెలకొంది. రాబోయే జె డ్పీ ఎన్నికలు సైతం జిల్లాల వారీగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జెడ్పీతోనే గ్రామీణాభివృద్ధి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో జిల్లా పరిషత్ కీలకపాత్ర పోషిస్తోంది. కొత్త పనులు చేపట్టాలన్నా.. సమస్యలు పరిష్కారం కావా లన్నా జెడ్పీ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని శాఖల అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు జెడ్పీ సమావేశాలకు హాజరవుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. అందుకే జిల్లా పరిషత్ çచైర్మన్‌కు రాష్ట్ర సహాయ మంత్రితో సమాన హోదా ఉంటుంది. ఉన్న సిబ్బందితోనే... నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో జెడ్పీలు కొలు వు దీరనుండడంతో పూర్వ వైభవం వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో జిల్లా పరిషత్ కార్యాలయం ఉండగా కొత్తగా నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాలతో పాటు నారాయణపేట జిల్లాలోనూ జిల్లా పరిషత్‌లు ఏర్పాటుకానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జెడ్పీ కార్యాలయంలోని సిబ్బందినే కొత్త జెడ్పీ కార్యాలయాలకు సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా జిల్లాలు ఏర్పడినప్పడు కూడా రెవెన్యూ, పోలీస్, ఇత ర శాఖల్లోని అధికారులు, సిబ్బందిని ఉమ్మడి జిల్లా కార్యాలయాల నుంచే విభజించి వర్క్ టూ సర్వు కింద విభజించారు. అదే మాదిరిగా జిల్లా పరిషత్ ఉద్యోగుల విషయంలో వ్యవహరించన్నుట్లు సమాచారం. పీఆర్ మండలాలుగా గుర్తిస్తేనే... కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో నూతన మండలాలు కూడా ఏర్పడ్డాయి. పాతవి, కొత్తగా ఏర్పడిన మండలాలు కలిపి మొత్తం సంఖ్య మహబూబ్‌నగర్‌లో 26, నాగర్‌కర్నూల్ జిల్లాలో 20, వనపర్తిలో 14 మండలాలు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 12కు చేరింది. ఇందులో కొత్తగా ఏర్పడిన మండలాలను రెవెన్యూ మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం తహసీల్దార్ కార్యాలయాలను ఏర్పాటుచేసింది. దీనికి అనుగుణంగా పంచాయతీరాజ్ మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం తిరిగి ఆదేశాలను జారీ చేయాల్సి ఉంటుంది. అప్పుడే అక్కడ మండల పరిషత్ కార్యాలయాలు ఏర్పడతాయి. కానీ ప్రస్తుతం ఇప్పటి వరకు కొత్త మండలాలను పీఆర్ మండలాలుగా గుర్తించలేదు. దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడాల్సి ఉంది. అలా అన్ని గ్రామీణ మండలాలు పంచాయతీరాజ్ పరిధిలోకి వచ్చాక జెడ్పీ ఎన్నికల ప్రక్రయ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఉమ్మడిగానే సమావేశాలు ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలు ఏర్పాటైనా జిల్లా పరిషత్ సమావేశాలు మాత్రం ఉమ్మడి జిల్లా వారీగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలు, జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఉమ్మడిగానే నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల సమయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాంతం లో ఏర్పడిన నాలుగు జిల్లాలతో పాటు కొన్ని మండలాలు కలిసిన వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల అధికారులు సైతం హాజరవుతున్నారు. అయితే, కొత్తగా ఏర్పడిన జిల్లాకు చెందిన సభ్యులు పలువురు సమావేశాలు హాజరఅయ్యేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. జెడ్పీ స్టాండింగ్ కమిటీ సమావేశాలకు కూడా జెడ్పీటీసీ సభ్యులు అంతంత మాత్రంగానే హాజరవుతున్నారు. ఒక్క జెడ్పీ సర్వçసభ్య సమావేశాలకు మాత్రమే సభ్యులు హాజరవుతుండడం గమనార్హం. జున్‌తో ముగియనున్న పదవీకాలం ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా పరిషత్ పాలక మండలి పదవీ కాలం గడువు ఈ ఏడాది జూన్ నెలతో ముగియనుంది. తదనంతరం జెడ్పీటీసీల వ్యవస్థను కొనాగించాలా, వద్దా అనే అంశంపై పంచాయతీరాజ్ శాఖ జెడ్పీ చైర్మన్ల సమావేశంలో చర్చకు తీసుకొచ్చింది. అయితే, ఎక్కువ మంది వ్యవస్థను కొనసాగించొద్దనే భావన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయినప్పటికీ ప్రభుత్వం కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీగానే ఆశావాహులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొత్త మండలాలు ఏర్పడ్డాయి. ప్రభుత్వం కొత్తగా జిల్లా పరిషత్‌లు ఏర్పాటుచేయనుందనే ప్రచారంతో ఆశావహుల్లో జోష్ నెలకొంది. జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొంది చైర్మన్ లేదా వైస్ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కొత్త జిల్లాలో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేకపోవడంతో నిరాశలో కూరుకుపోయిన వారిలో తాజా ప్రచారం ఉత్సాహాన్ని కలిగిస్తోంది. కొత్తగా మండలాల జెడ్పీటీసీలుగా గెలుపొందితే తొలి సభ్యుడిగా రికార్డు ఉంటుందనే భావనతో పలువురు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులుగా తమను ప్రకటించాలనే పార్టీల వారీగా అధినాయకత్వాన్ని కోరుతున్నారు. ఆదేశాలు రాలేదు.. కొత్త జిల్లాల వారీ గా జెడ్పీ కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సమాచారం కానీ మార్గదర్శకాలు కానీ అందలేదు. కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగిన నేపథ్యంలో కొత్త జెడ్పీలు కూడా ఏర్పాటు జరుగుతాయనే ప్రచారం మాత్రం సాగుతోంది. అయితే, అధికారిక సమాచారంలేదు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చి నా అందుకు అనుగుణంగా ప్రక్రియ కొనసాగిస్తాం. – వసంతకుమారి, జెడ్పీ సీఈఓ, మహబూబ్‌నగర్ -
జెడ్పీ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ధర్నా
ఏలూరు సిటీ : జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉపాధ్యాయుల ప్రావిడెంట్ ఫండ్ రుణాల మంజూరులో జరుగుతున్న అవకతవకలపై సత్వరమే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. స్థానిక జెడ్పీ కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు, ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరై ధర్నా చేశారు. ధర్నా శిభిరానికి జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ అధ్యక్షత వహించగా, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్‌సాబ్జీ శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సాబ్జీ మాట్లాడుతూ జెడ్పీ కార్యాలయంలో పీఎఫ్ రుణాల మంజూరుకు చేసుకున్న దరఖాస్తులను అసంబద్ధమైన కారణాలతో తిప్పి పంపుతూ, లంచాలు ఇచ్చిన వారికి ఏ విధమైన డాక్యుమెంట్లూ లేకున్నా మైనస్ బ్యాలెన్స్ చూపించి రుణాలు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేస్తున్న సూపరింటెండెంట్ నాగరాజకుమారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి ఎస్.జయప్రభ, జిల్లా గౌరవాధ్యక్షుడు ఎం.రామకృష్ణ, సహాధ్యక్షురాలు వి.కనకదుర్గ, జిల్లా కోశాధికారి పీవీ నరసింహారావు, జిల్లా కార్యదర్శులు పి.శివప్రసాద్, ఎ.విక్టర్, ఏకేవీ రామభద్రం, ఎంఐ రాజకుమార్, పి.సువర్ణరాజు పాల్గొన్నారు.